Take a fresh look at your lifestyle.

మరిచిపోలేని రోజు

సె‌ప్టెంబర్‌ ‌పదిహేడు
తెలంగాణ చరిత్రలో
మరిచి పోలేనిరోజు
అది
విలీనమా విద్రోహామా విమోచనమా……
ముక్కలుగా చూస్తే ప్రతి పదానికి ఓ లెక్క దొరుక వచ్చు
వివాదాలు లెట్లున్నా
చెరిగిపోని గాయాల జ్ఞాపకాలు ఇంకా
సలుపుతూనే ఉంటున్నయ్‌.
‌నిరంకుశత్వం
దొరతనం మతమౌఢ్యం
అధికారమదాంధం
మానవీయతకు మాయని మచ్చై నిలిచి
మారణహోమాన్ని సృష్టించిన
చీకటి రోజుల చరితను
ఎట్లా మరిసిపోతం
సామాన్యులు సాయుధులై  ఎదిరించి
ఎదలను తాకి జ్వాలలై ఎగసిపడిన మహత్తర ఘట్టాలను
ఎత్తి పట్టకుండా ఎట్లా ఉంటమ్‌
అమరుడు దొడ్డికొమురయ్య షోయబుల్లాఖాన్‌
‌భాయి షేక్‌ ‌బందగీల రక్తతర్పణంతో తడిసి ఎర్రబారిన నేల ఇది
ఆ నెత్తుటి మరకలను ఎట్లా చెరిపివేయగలం.
రజాకారు రక్కసి మూకల దౌర్జన్యాలను సాహసంతో ఎదిరించి
సాయుధ సమరానికి ఊపిరిలూది విప్లవాలకు
నాంది పలికిన వీరభూమి తెలంగాణ
అందుకేననుకుంటా కవుల వర్ణనల్లో కూడా కనిపించే పదం
ఈ గడ్డమీద బుట్టిన గరిక పోస సైతం
కరుకు కత్తులుబూని కదన రంగము నందు
ఉరకలు వేసిన ఉత్సాహన్ని చూపిస్తున్న వైనం
బొడ్డూడని బిడ్డలకు సైతం పురిట్లోనే విప్లవాన్ని
పుక్కిట బట్టించిన నేల తల్లి చరిత
ఎర్రదండు గట్టిన నల్లగొండ
జన జాగరుకమైన జనగామ
పౌరుషాగ్ని రగిలించిన పరకాల
మర్లబడ్డ మానుకోట
వడిసెలు బరిసెలు కత్తులు చేతబట్టి
చీకటి బతుకుల్లో ఉదయించే కొత్తపొద్దుకై
తెగించిపోరాడిన రణస్థలాలు తెలంగాణ పల్లెలు
అంతిమంగా అంతమైన
నెత్తుటి మరకల చరితను అంటించుకున్న
ఉస్మాన్‌ అలిఖాన్‌ ఉన్మాదపు రాజరికం
ఇల్లలకగానే పండుగైందా
భూమికోసం భుక్తికోసం దోపిడి పీడనలులేని రాజ్యం కోసం
తనువులు చాలించిన అమరులు ఆశయాలు నేరవేరలేదన్నది
విలీనం మాటున జరిగిన విద్రోహమన్నది చరిత్ర చెపుతున్న సత్యం.

 ‌గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి
9494789731

Leave a Reply