Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్‌ 17 ‌విలీనం కాదు, విద్రోహమే..

వీర తెలంగాణ విప్లవోద్యమం పీడిత ప్రజానీకం సృష్టించిన ప్రజా ఉద్యమం. ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగిన పోరాటం ప్రపంచ ప్రజలను ఆనాడు ఆశ్చర్యపరిచింది. కనీవినీ ఎరుగని రీతిలో రాచరిక పాలనపై, భూస్వామ్య పీడనలపై ప్రజా వెల్లువను, పీడితుల ఆకాంక్షలను ఆ ప్రజా ఉద్యమం వెల్లడించింది. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ‘‘ దొర బాంచాన్‌ ‌నీ కాల్మోక్తా అన్న..’’ అన్ని పీడిత ప్రజానీకం ఒక్కటై సాయుధ పోరాటాన్ని నడిపించారు. బందూక్‌ ‌చేతపట్టి మహాసంగ్రామాన్ని కొనసాగించారు. ఆ మహత్తర పోరాటంలో  4,500 మంది వీరులు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వేలాది మంది అడబిడ్డలు తమ మాన ప్రాణాలను కోల్పోయారు. వేలాది మంది నిర్భందించబడి జైళ్లలో మగ్గారు. అనేక త్యాగాల ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 10 లక్షల ఎకరాల భూమి, భూమి లేని నిరుపేదలకు పంచబడింది. మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలేర్పడ్డాయి. 1946 నుంచి 1951 వరకు కొనసాగిన పోరాటం అనేక అనుభవాలను ప్రజల ముందుంచింది.

ప్రస్తుత తెలంగాణ జిల్లాలతో పాటు మాహారాష్ట్రలోని ఐదు జిల్లాలు, కర్నాటకలోని మూడు జిల్లాలు కలిసి సంస్థానంగా ఉండేది. 224 ఏళ్లు నిజామ్‌ ‌వంశీయులే పాలించారు. మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1911 – 1948 ‌సెప్టెంబర్‌ 17‌న భారత సైన్యాలకు లొంగిపోయేదాకా పాలకుడిగా, తర్వాత రాజ ప్రముఖ్‌ ‌గా కొనసాగారు. ఈ ప్రాంతంలో 5.30 కోట్ల ఎకరాల భూమిలో మూడుకోట్ల ఎకరాలు ప్రభుత్వానికి శిస్తు చెల్లించే దివానీ భూమిగా, ఒక కోటి 50లక్షల ఎకరాల భూమి జాగీర్దార్లు, జమీందార్లు, అగ్రహారీకుల కింద ఉండేది. దీంతో పాటు 45లక్షల ఎకరాల భూమి నిజామ్‌ ‌కుటుంబ స్వంత భూమిగా ఉండేది. అధిక శిస్తుల వసూళ్ళకు, రాజ్య దోపిడీకి వ్యతిరేకంగా సకల జనులు ఎర్రజెండా నాయకత్వంలో తిరుగుబాటు చేశారు.

సాయుధ రైతాంగ ఉద్యమాన్ని నడిపింది కమ్యూనిస్టులు, అది చారిత్రక వాస్తవం. ఆనాటి ప్రజా ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసేందుకు నిజామ్‌ ‌ప్రభువుతో కలిసి కుట్రలు చేసింది ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం. భారత దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటూ ఉంటే, తెలంగాణ సంస్థానంలో ప్రజానీకం పోరాటాల్లో మునిగి ఉంది. ఈ వాస్తవాన్ని కాదనలేం. హైదరాబాద్‌ ‌రాజ సంస్థానం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళుతుందని గ్రహించి, స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న సంస్థానాన్ని సెప్టెంబర్‌ 17, 1948‌న భారత్‌ ‌లో కలిపేసుకున్నారు. భారత పాలకులు కేవలం నిజామ్‌ ‌వ్యతిరేక పోరాటంగా చూశారే తప్ప స్వాతంత్య్రోద్యమంలో భాగంగా దీనిని చూడలేదు. దానికి ప్రాంతం అడ్డొచ్చింది. ఆ పోరాటానికి కమ్యూనిస్టులు సారథ్యం వహించడమే ప్రధాన కారణంగా చూశారు. నిజామ్‌ ఏజెంట్లు, తాబేదార్లు, నిజామ్‌ ‌బ్రిటిష్‌ ‌తొత్తులు. అందువల్ల ఇది స్వాతంత్య్ర పోరాటంలో భాగమే, సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంగా ఎందుకు చూడకూడదు.

తెలంగాణలో సైనికచర్య జరుగక ముందు భూస్వాముల సారధ్యంలో, రజాకార్‌ ‌మూకల చేతుల్లో రెండు వేల మంది అమరులయ్యారు. అయితే, సంస్థానంలోకి భారత సైన్యాలు ప్రవేశించి జరిపిన పాశవిక హత్యకాండలో సుమారుగా మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక చర్య కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు విడిచారు. సైనిక చర్య ప్రజలకు మేలు చేసేందుకు ఉపయోగపడ లేదు. నిజామ్‌ను, నిజామ్‌ ఆస్తులను, రజాకార్‌ ‌ప్రైవేటు సైన్యాన్ని మరియు భూస్వాముల ఆధిపత్యాన్ని, ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే సైనిక చర్య ఉపయోగపడిందనేది వాస్తవం. ఆనాటి పటేల్‌ (‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం) సహాయంతో నిజామ్‌ ‌ప్రభువు రాజ ప్రముఖ్‌ ‌గా నియమించబడ్డారు. గ్రామాలు విడిచిపెట్టిన భూస్వాములు, దొరలు ఖద్దరు టోపీలతో గ్రామాల్లోకి ప్రవేశించారు. భూస్వాముల భూములు ప్రభుత్వ సహకారంతో ప్రజలపై దాడులు చేసి తిరిగి అప్పగించారు. వేలాది మంది ప్రాణాలను బలిగొన్న రజాకార్ల ఛీఫ్‌ ‌ఖాసిం రజ్వీ స్వేచ్ఛతో దేశం దాటి వెళ్ళిపోయాడు. అనేక ఘటనలు నిజామ్‌, ‌పటేల్‌ ‌మధ్య ఒప్పందాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఆనాడు జరిగింది విమోచన, విలీనమో కాదు, జరిగింది విద్రోహం.  కలిసికట్టుగా ప్రజా ఉద్యమానికి విఘాతం కలిగిస్తూ విద్రోహానికి పాల్పడ్డారు.

ఇక్కడ తొలి కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడకుండా నిలువరించారు. ఈ చారిత్రక వాస్తవాల్ని అందరూ గుర్తించాలి, అంగీకరించి తీరాలి.
తెలంగాణ చరిత్ర సాయుధ రైతాంగ పోరాటం లేకుండా చెప్పలేం. అలాంటి చారిత్రక పోరాటాన్ని హైజాక్‌ ‌చేసేందుకు పాలక వర్గ పార్టీలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. ఆ పోరాటాలకు, ఉద్యమానికి తామే నిజమైన వారసులమని చెబుతున్నారు. ఆనాటి పోరాటంలో ఏలాంటి పాత్ర లేని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుంది. ఆ మహోన్నత ప్రజా పోరాటాన్ని ముస్లీం – హిందూ మధ్య జరిగిన పోరాటంగా చెబుతూ విద్వేష రాజకీయాలతో తెలంగాణలో బలోపేతానికి పూనుకొంది. సెప్టెంబర్‌ 17‌న విమోచన దినోత్సవాన్ని జరుపుతుంది. స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నేటివరకు సెప్టెంబర్‌ 17 అధికార ఉత్సవాలు జరుపకుండా కాలయాపన చేసింది టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీ బలపడటానికి కారణమైంది. రజాకార్ల వారసత్వం కలిగిన ఎంఐఎం డైరెక్షన్‌ ‌లో ‘‘తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు’’ పేరిట అధికారికంగా జరుపుతుంది. చరిత్రను మసి పూసి మారేడు కాయగా మార్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మతం రంగు పులిమెందుకు, ప్రజల్లో చీలిక తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. దానిని చైతన్య వంతమైన తెలంగాణ ప్రజానీకం తిప్పికొట్టాలి. రైతాంగ సాయుధ పోరాట లక్ష్యాలింకా నెరవేరలేదు. ఆ లక్ష్యాలను పూర్తి చేయటమే కమ్యూనిస్టుల కర్తవ్యం కావాలి.
– మామిండ్ల రమేష్‌ ‌రాజా
రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ (యంయల్‌) ‌లిబరేషన్‌, ‌తెలంగాణ.
సెల్‌ : 7893230218

Leave a Reply