కలాన్ని కాగడగా పట్టినవాడు
అక్షరాన్ని అస్త్రంగా మలిచినవాడు
కవన కత్తులు దూసినవాడు
మాటల తూటాలు పేల్చినవాడు
ధిక్కార స్వరం వినిపించినవాడు
ఉద్యమాలకు ఊపిరి పోసినవాడు.
నిరసన జ్వాలలు రగిలించినవాడు
తిరుగుబాటు జెండా ఎగరేసినవాడు
నిజాం గుండెల్లో నిద్దురోయినవాడు
దోపిడీ రాజ్యాన్ని వణికించినవాడు
బతుకు పోరు నేర్పినవాడు
భవిత దారి చూపినవాడు
భాషకు యాసకు …
జవసత్వాలు అద్దినవాడు
పలుకుబడులకు …
ప్రాణ ప్రతిష్ట చేసినవాడు
ఒక్క సిరా చుక్కతో …
లక్షల మెదళ్ళు కదిలించినడు
జనం గోస, గొడవ …
తన గొడవగా తలచినవాడు
పుట్టుక చావు నీది
బతుకు మాత్రం
దేశానిదంటు తేల్చినవాడు
తెలంగాణ ధీరత్వం
అమరుల.త్యాగత్వం
దశ దిశలా చాటి చెప్పినవాడు
ప్రజా పక్షం నిలిచినవాడు
ప్రజా గొంతుకై నినదించినవాడు
ప్రజలకై బతుకు దారబోసినవాడు
అతడే…
జన జాగృత దివిటీ…
తెలంగాణ గుండె సవ్వడి
అభ్యుదయ కవి…కాళోజీ
( సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి సందర్బంగా..)
కోడిగూటి తిరుపతి,: 9573929494