అధికారంలోకి రాగానే ప్రజారంజకంగా పాలిస్తామని ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి రాగానే హామీలను తుంగలోకి తొక్కటం నేటి రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. అధికార సింహాసనంపై కూర్చోగానే గత విషయాలన్నిటినీ మరిచిపోయి, కేవలం తమ గద్దెను ఎలా కాపాడుకోవాలన్న దానిపైనే దృష్టి పెట్టడం కూడా అంతే సహజమై పోయింది. ఈ విషయంలో నాయకులందరిదీ ఒకేబాట అనేందుకు తాజాగా ఏపి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ రుజువు చేస్తున్నది. ఒకవైపు రాజధాని విషయంలో అమరావతి, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు గత నలభై రోజులుగా దీక్ష కొనసాగిస్తుంటే, ఏపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందేనని తెలంగాణ సిఎం వ్యాఖ్యానించినట్లు వొస్తున్న వార్తలు నాయకుల దారే వేరన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. కొద్ది రోజుల కింద రాష్ట్ర ఐటి శాఖ మంత్రిని ఏపి రాజధాని విషయమై నెటిజన్లు ప్రశ్నించినప్పుడు ఈ విషయాన్ని నిర్ణయించుకోవాల్సింది ఏపి ప్రజలని చాల ఉపాయంగా, హూందాగా సమాధానమిచ్చాడు. కాని, కెసిఆర్ మాత్రం ఏపి సిఎం అభిప్రాయాన్ని ఏకీభంచినట్లు వార్తలు వొస్తున్నాయి. అంతటితో ఆగకుండా జగన్ మంచి నిర్ణయం తీసుకున్నాడని మెచ్చుకుంటూ, దానిపై ఏమాత్రం సంశయం లేకుండా ముందుకు వెళ్ళాలని వెన్ను తట్టినట్లు కూడా తెలుస్తోంది. అలా తాను ప్రోత్సహించడానికి కారణాన్ని కూడా కెసిఆర్ ఉదహరించినట్లు ఓ కథనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా హైదరాబాద్‌కే పరిమితం కావడం పెద్ద సమస్యగా తయ్యారైంది. రాష్ట్ర విభజన సందర్భంగా దానిపైనే చాలావరకు చర్చలు జరిగిన విషయాన్ని కెసిఆర్ జగన్ దృష్టికి తీసుకువచ్చినట్లు కూడా తెలుస్తున్నది. రాష్ట్ర విభజనలో జాప్యం జరుగడానికి ఇది కూడా ఒక కారణమన్న విషయాన్ని జగన్‌కు కెసిఆర్ వివరించాడని తెలుస్తున్నది. ఇది సహజంగానే ఏపి ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించే విషయమే. అయినా విపక్షాల ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తున్నది.
అయితే తెలంగాణలో తాను ఎలాగూ ప్రతిపక్షాలను పట్టించుకోలేదని, ఇప్పుడు అదే విషయాన్ని జగన్‌కు కెసిఆర్ నూరిపోయడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నాయి. వాస్తవంగా రాజధాని కోసం ఆనాటి ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చింది రైతులు, కాని, వారి నమ్మకాన్ని జగన్ ప్రభుత్వం ఒమ్ముచేస్తూ మూడు రాజధానుల ప్రకటన చేసింది. అది మొదలు ఏపిలో ప్రజలు మూడు ముక్కలుగా విడిపోయారు. జగన్ కావాలని అలా ప్రకటన చేశారా, లేక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆ ప్రకటన చేశారా తెలియదు కాని, ఈ ప్రకటన మాత్రం ఏపి ప్రజల్లో చిచ్చుపెట్టింది. అధికారపార్టీ ఒక వైపు, ప్రతిపక్షాలు మరోవైపుగా తీవ్రస్థాయిలో ఘర్షణ పడుతున్నారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా రైతులు గడచిన యాభై రోజులుగా ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. వారిని అనునయించాల్సిన ఏపి ప్రభుత్వం వారిపై నిర్ధాక్షిణ్యంగా దాడులు చేస్తోంది. ఏనాడు ఇంటి నుండి బయటికి వెళ్ళని మహిళలు ధర్నాల్లో పాల్గొంటే కనీసం కనికరం లేకుండా విచక్షణా రహితంగా మహిళలను గొడ్డును బాదినట్లు బాదారు. ఇంతటి బీకర పరిస్థితి నెలకొని ఉన్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జగన్ తీసుకున్న నిర్ణయానికి తన మద్దతు ప్రకటించినట్లు వొస్తున్నవార్తలు ఏపి ప్రజల్లో కెసిఆర్‌పైన పూర్వ ద్వేషానికి కారణంగా మారబోతోంది. గతంలో అమరావతిని ఎంచు కోవడం సరైందని, చారిత్రాత్మకమైనదే కాకుండా, వాస్తు ప్రకారం సరైందని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు అమరావతి వేస్ట్, డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్ కూడా కెసిఆర్‌లా వ్యవహరిస్తూ రాజధాని విష యాన్ని ఎటూ తేల్చడం లేదన్న ఆవేదన చెందుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఆర్టీసి సమ్మె జరిగితే చివరి క్షణం వరకు కెసిఆర్ ఎలా మౌనం వహించారో, ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో ఏమాత్రం చలనం లేకుండా ఉండడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రైతులు, మఖ్యంగా మహిళలు, పిల్లలు, అటు ప్రతిపక్ష పార్టీలు నిర్విరా మంగా ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు చేస్తుంటే, చివరకు ఆవేదన తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించడాన్ని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అందోళనకారులతో మాట్లాడకుండానే రాజధానిని తరలించే ప్రక్రియను మొదలు పెట్టడం ఆయన నిర్లక్షాన్ని తెలుపుతోందంటున్నారు. చివరకు తాను అనుకున్నట్ల్లే విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చడానికే జగన్ ప్రయత్నిస్తున్నాడని, రాజధానికోసం భూములను త్యాగంచేసి, భవిష్యత్ నష్టపోయిన తమను ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేకుండడం పట్ల వారు ఆక్రోషిస్తున్నారు. ఇదిలా ఉంటే రాజధానిపై ఈ నెల 17న హై పవర్ కమిటీ ఇచ్చే నివేదికపై 20వ తేదీన సమావేశం కానున్న ఏపి అసెంబ్లీలో చర్చించనున్నారు. దీనితో పాటు ఇతర కమిటీల నివేదికలపై కూడా సభ చర్చించనుంది. దీన్నిబట్టి అమరావతి ఆందోళనకు ఈ నెల 20న సభ తీసుకునే నిర్ణయం ముగింపు పలకనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ప్రజలెంత అందోళన చేసినా, నాయకులనుకున్నదే ఫైనల్ అన్నమాట.