Take a fresh look at your lifestyle.

సిఎం కేసీఆర్‌ ఇలాకాలో దారుణం

  • రైతువేదిక భవనానికి భూమి ఇవ్వాలని బలవంతం
  • సెల్ఫీ వీడియో, వాయిస్‌ ‌రికార్డు చేసి మరీ దళిత యువ రైతు బలవన్మరణం
  • వేలూరులో ఉద్రిక్తత భారీగా మోహరించిన పోలీసులు
  • కేసీఆర్‌ ‌నియోజకవర్గంలో ఇంత దారుణమా?
  • సిద్ధిపేటలో కాంగ్రెస్‌ ‌నేతల అరెస్టు
  • తుర్కపల్లిలో బిజెపి నేతల అరెస్టు

వేలూరులోని తన వ్యవసాయ పొలంలో పురుగులు మందు తాగుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసిన రైతు బ్యాగరి నర్సింలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని వేలూరులో దారుణం చోటుచేసుకుంది. తనకున్న భూమిని రెవెన్యూ అధికారులు రికార్డులో ఎక్కించక పోవడమే కాకుండా, ఆ భూమిని రైతువేదిక భవనానికి ఇవ్వాలని బలవంతం చేయడంతో ఆవేదనతో తన వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి దళిత యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…వర్గల్‌ ‌మండలంలోని వేలూరుకు చెందిన దళిత యువ రైతు బ్లాగరి నర్సింలుకు చెందిన వ్యవసాయ భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారనీ ఆవేదన చెంది బుధవారం రోజున తన పొలంలోనే సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. తన భూమిని రెవెన్యూ అధికారులు రికార్డుల్లోకి ఎక్కించకపోవడమే కాకుండా… ఇప్పుడు రైతువేదిక భవనానికి ఇవ్వాలంటూ బలవంతం చేయడంపై తీవ్ర మనస్తాపానికి చెందిన పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న నర్సింలును తొలుత గజ్వేల్‌ ‌ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం …అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని సిద్ధిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించగా…చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో మృతిచెందాడు. తనకున్న భూమిని రెవెన్యూ అధికారులు రికార్డులో ఎక్కించడం లేదని, ఆ భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని బలవంతం చేయడంతో ఆవేదనతో పురుగుల మందు తాగడని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. పురుగుల మందు తాగుతూ బాధితుడు సెల్ఫీ వీడియో, వాయిస్‌ ‌రికార్డు చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్‌ ఇం‌టి ముందు మృతుని కుటుంబీకులు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మృతుడు నర్సింలుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

కేసీఆర్‌ ‌నియోజకవర్గంలోనే ఇంత దారుణమా?..సిద్ధిపేటలో కాంగ్రెస్‌ ‌నేతల అరెస్టు
ముఖ్యమంత్రి కేసీఆర ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం దారుణమని ఏఐసిసి కార్యదర్శి సంపత్‌కుమార్‌, ‌జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. వేలూరుకు చెందిన నిరుపేద దళిత రైతు నర్సింలుకు చెందిన తన సొంత భూమిని రైతు వేదిక నిర్మాణం కోసం అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచి బలవంతం చేయడంతోనే తీవ్ర నిరాశకు గురైన నర్సింలు తన వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు. నర్సింలు భూమిని గుంజుకోవడాని ప్రయత్నించిన సర్పంచి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతల పేర్లు చెప్పి సెల్ఫీ వీడియో తీయడమే కాకుండా వాయిస్‌ ‌రికార్డు చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. నర్సింలు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం సిద్ధిపేటలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో మార్చూరీలో ఉన్న నర్సింలు మృతదేహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ‌నేతలు సంతప్‌కుమార్‌, ‌నర్సారెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా వాహనంలో ఎక్కించి సిద్ధిపేట టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. నర్సింలు మృతదేహంను కూడా చూడనివ్వకుండా పోలీసులు అడ్డుకుని పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించడాన్ని కాంగ్రెస్‌ ‌నేతలు తీవ్రంగా ఖండించారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం వచ్చాక దళితుల పట్ల దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. సిఎం కేసీఆర్‌ ‌నియోజకవర్గ పరిధిలోనే దళితుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రమంతటా ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదన్నారు. దళితులపై దాడులను ఆపాలనీ, మృతిచెందిన రైతు నర్సింలు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాటం చేస్తుందనీ సంపత్‌కుమార్‌, ‌నర్సారెడ్డి హెచ్చరించారు. వీరి వెంట నేతలు నాయిని యాదగిరి, దరిపల్లి చంద్రం, తోట ముత్యాలు, బొమ్మల యాదగిరి, బర్మా రామచంద్రం, మిట్టపల్లి గణేష్‌, ‌మార్క సతీష్‌ ‌గౌడ్‌, ‌తప్పేట శంకర్‌ ‌తదితరులు ఉన్నారు.

నర్సింలు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి: టిపిసిసి నేత నాయిని
యాదగిరి హైదరాబాద్‌ : ‌వర్గల్‌ ‌మండలానికి చెందిన నర్సింలు మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి డిమాండ్‌ ‌చేశారు. నర్సింలు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. దళితులకు మూడు ఎకరాల ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఉన్న భూమి దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింలు మృతికి బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలనే ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నాననీ, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవుతున్నారు నాయిని యాదగిరి ఆరోపించారు.

తుర్కపల్లి వద్ద బిజెపి నేతల అడ్డగింత… రోడ్డుపై బైఠాయింపు..
భారతీయ జనతా పార్టీకి చెందిన సిద్ధిపేట జిల్లా, రాష్ట్ర నేతలు సిద్ధిపేట-హైదరాబాద్‌ ‌రాజీవ్‌ ‌రహదారిపైన గల తుర్కపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. వేలూరుకు చెందిన దళిత యువ రైతు నర్సింలు బలవన్మరణానికి పాల్పడ్డ సమాచారాన్ని తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నేతలు మోత్కుపల్లి నర్సింలు, వివేక్‌, ‌బాబుమోహన్‌, ‌సిద్దా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, వేముల అశోక్‌, ‌సారంగపాణి, బండోజు సాంబశివరావు, సిద్ధిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి బృందం వేలూరుకు వెళ్తుండగా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బిజెపి నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై బైఠాయించిన బిజెపి నేతలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేసన్‌కు తరలించారు. పోలీసుల తీరును బిజెపి నేతలు ఎండగట్టారు. సిఎం కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో దళితులు బతికే పరిస్థితులు కనిపించడం లేదనీ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత రైతు ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత :టిడిపి నేత రమణ
ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు కుటుంబానికి తక్షణం కోటి రూపాయాల పరిహారం చెల్లించాలని టిడిపి డిమాండ్‌ ‌చేసింది. రైతు ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్‌. ‌రమణ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని వర్గాల మండలం వేలూరు గ్రామంలో దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని రమణ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యని చెప్పారు. దళితులు భూములు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. నర్సింహులు కుటుంబాన్ని ప్రభుత్వం కలవాలని, ఇతర రాజకీయ పక్షాలు కలవడానికి పరామర్శించడానికి అమతించాలన్నారు. నర్సింహులు కుటుంబానికి కోటి రూపాయలు ఆర్ధిక సహాయం ఇవ్వాలని రమణ డిమాండ్‌ ‌చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యలుకు అండగా నిలవాలని అన్నారు. ఎస్పీ కులానికి చెందిన నర్సింహులు మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ‌కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ ‌చేసారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవుతున్నారని ఆరోపించారు. నర్సింహులు మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రమణ డిమాండ్‌ ‌చేశారు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల న్నారు. దళితులకు మూడు ఎకరాల ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఉన్న భూమి దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌నియోజకవర్గంలోనే ఇంత దారుణమా అంటూ ప్రశ్నించారు.

Leave a Reply