Take a fresh look at your lifestyle.

దవాఖానా వద్దు… ఇంటి వైద్యమే ముద్దు

సొంత వైద్యానికే ప్రాధాన్యమిస్తున్న కొరోనా బాధితులు
వైద్య పరికరాల కొనుగోలు…. అందుబాటులో మందులు

రాష్ట్రంలో కొరోనా బాధితులు వైద్య చికిత్సల కోసం దవాఖానాలకు వెళ్లడం కన్నా ఇంటి వైద్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.  దవాఖానాలకు వెళ్లి రూ.లక్షలు వదిలించుకోవడానికి బదులు ఇంటి పట్టునే ఉండి సొంత వైద్యంతోనే కోలుకుంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాలు కూడా కొద్దిపాటి లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉండి వైద్య చికిత్సలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ సూచనలతో వీరంతా హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. దీంతో దగ్గు, జలుబు, నీరసం వంటి కొద్దిపాటి లక్షణాలు ఉన్న వారి ఇళ్లు చిన్నపాటి దవాఖానాలుగా మారిపోతున్నాయి. రోజూ ఉదయం లేవగానే ఘాటైన మసాలా దినుసులను మరగబెట్టి తయారు చేసిన కషాయం తాగి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించడం, పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవడంతో పాటు మల్టీవైటమిన్‌, ‌జింక్‌, ‌పారాసెటమాల్‌, ‌సిట్రిజిన్‌ ‌వంటి మాత్రలను సమయం ప్రకారం వేసుకుంటూ దవాఖానాలో వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులో దాదాపు 90 శాతం ఆదా చేస్తున్నారు.

కొరోనాకు భయపడి రాజధాని హైదరాబాద్‌లోని ప్రవేటు దవాఖానాలలో పనిచేసే నర్సులు, ఆయాలు, వార్డ్ ‌బాయ్‌లు తమ ఉద్యోగాలను సైతం వదిలేసి సొంత ఊళ్లకు వెళ్లి పోవడంతో దవాఖానాలలో సైతం నర్సుల కొరత ఏర్పడింది. దీంతో దవాఖానాలకు వచ్చే కొరోనా రోగులకు వైద్య సేవలు అందడం కష్టంగా మారింది. ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో, ఏ ముందు జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులను అడిగి తెలుసుకుంటూ వాటిని కచ్చితంగా పాటిస్తున్నారు. వీటికి తోడు బీపీ ఆపరేటర్‌, ‌పల్స్ ఆక్సీమీటర్‌ ‌వంటి వైద్య పరికరాలను కొనుగోలు చేసి వాటిని ఎప్పటికప్పుడు వినియోగిస్తూ తాము తీసుకుంటున్న వైద్య చికిత్సలు ఎంతమేరకు ఫలితాన్ని ఇస్తున్నాయో పరీక్షించుకుంటున్నారు. కాగా, కొరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిలో కొందరు హోటళ్లలో ఐసోలేషన్‌లో ఉండి వైద్య చికిత్సలు పొందడానికి సైతం మొగ్గు చూపుతున్నారు.

హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రైవేటు దవాఖానాలు కొరోనా చికిత్సల కోసం హోటళ్లను అద్దెకు తీసుకుని అక్కడ వారికి వైద్య చికిత్సలు అందిస్తున్నాయి. తమ హాస్పిటల్‌కు చెందిన ఒక నర్సును, వైద్యుడిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాయి. బాధితునికి ఎప్పటికప్పుడు వైద్య సలహాలు ఇవ్వడంతో పాటు నిర్ణీత వేళల్లో మందులు వాడే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీనికి బాధితుని నుంచి నామమాత్రపు ఫీజులను వసూలు చేస్తున్నాయి. దీంతో గత నెల వరకూ పలు హోటళ్లలో 857గా ఉన్న ఐసోలేషన్‌ ‌పడకల సంఖ్య ప్రస్తుతం 2995కు పెరగడం గమనార్హం. హోటల్‌ ఐసోలేషన్‌లో వైద్య చికిత్సలకు తక్కువ ఖర్చు కావడంతో పాటు వైద్యుడు, నర్సు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటున్న కారణంగా కొరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకునే వీలు కలుగుతుందని కొరోనాను జయించిన కొందరు పేర్కొనడం విశేషం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!