Take a fresh look at your lifestyle.

మహిళల భద్రత, నేరాల నిరోధానికై స్వయం సహాయక మహిళల భాగస్వామ్యం డీజీపీ మహేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌, ‌మార్చ్ 8: ‌రాష్ట్రంలో బాల్య వివాహాలు, గృహ హింస, లైంగిక వేధింపుల నిరోధం పై రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక బృందాల మహిళలకు చైతన్యం, అవగాహన కల్పించేందుకై పోలీస్‌ ‌శాఖ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్‌ ‌పరిపాలన శాఖ సంచాలకులు డా. సత్యనారాయణ, పోలీస్‌ ‌శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ ‌డీ.జీ.స్వాతి లక్రా ల మధ్య ఈ అంగీకారం కుదిరింది. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వహించిన జూమ్‌ ‌సమావేశంలో డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతా, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, దీనిలోభాగంగా దేశంలో తొలిసారిగా అడిషనల్‌ ‌డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణా రాష్ట్రానికే దక్కిందని గుర్తు చేశారు.

మహిళల భద్రతకై చేపట్టిన చర్యల్లో భాగంగా షీ- టీమ్‌ ‌లు, భరోసా కేంద్రాలు, ఎన్‌.ఆర్‌.ఐ ‌సెల్‌ ‌ల ఏర్పాటుతోపాటు డయల్‌ 100 , 112 ‌ల ద్వారా అందే ఫిర్యాదులకు త్వరిత గతిన స్పందిస్తున్న విషయాన్నిగుర్తు చేసారు. సీసీ టీవీ ల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అదేవిధంగా స్థానిక ప్రజల సహాయ, సహకారాలతో హైదరాబాద్‌ ‌నగరంలో 6.50 లక్షల సీసీ టీవీ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌ ‌నగరం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటిగా ఉందని అన్నారు. పోలీసులు ప్రతి చోటా భౌతికంగా ఉండలేరని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బలంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా సమాజ భద్రతలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల కట్టడికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న రాష్ట్రం తెలంగాణా రాష్ట్రమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ ‌డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ, షీ – టీమ్‌ ‌లకు 2020 సంవత్సరంలో 5 వేల ఫిర్యాదులు అందాయని, వీటిలో 68 శతం వాట్సాప్‌ ‌ల ద్వారా అందాయని వెల్లడించారు.

ఈ ఫిర్యాదుల్లో అధిక శాతం ఫోన్‌ ‌ల ద్వారా, సోషల్‌ ‌మీడియా ల ద్వారా వేధింపులపైనే అధికంగా ఉన్నాయని తెలిపారు. షీ -టీమ్‌ ‌ల పనితీరుపై ప్రముఖ సంస్థ సెస్‌ ‌ద్వారా సర్వేనిర్వహించగా 89 శాతం మంది షీ-టీమ్‌ ‌ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో సైబర్‌ ‌నేరాలపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు గాను ఐదు సార్లు ఆన్‌ ‌లైన్‌ ‌కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. బాధిత మహిళలకు పూర్తి సేవలందిస్తున్న భరోసా కేంద్రాలను దశల వారీగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, ‌వికారాబాద్‌,‌సంగారెడ్డి, వరంగల్‌ ‌లలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న బాల మిత్ర న్యాయస్థానాల పనితీరు, ఏర్పాటును సుప్రీం కోర్టు కూడా ప్రశంసించింది చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌డా. సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రం లో 1.70 లక్షల మహిళా బృందాలలో 17 లక్షల మహిళలు సభ్యులుగా ఉన్నారని వీరందరికీ గృహ హింస, వర్క్ ‌ప్లేస్‌ ‌హరాస్‌ ‌మెంట్‌, ఇతర సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించడం హర్షణీయమని అన్నారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ, రాష్ట్ర పోలీస్‌ ‌శాఖలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటయ్యి 3 సంవత్సరాలు పూర్తయిందని, ఈ మూడు సంవత్సరాల్లో మహిళా భద్రత, సామాజిక అవ్యవస్థలపై అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ,రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాల మహిళలను మహిళలు, పిల్లల భద్రత, గృహ హింస నిరోధం, పని స్థలాల్లో వేధింపులకు వ్యతిరేకంగా చైతన్య పరిచే గొప్ప కార్యక్రమానికి మహిళా భద్రతా విభాగం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షిత్‌ ‌తాండాన్‌, ‌గీతా చల్ల, శృతి ఉపాధ్యాయ్‌ ‌తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీవిద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు. యూజర్‌ ‌ఫ్రెండ్లి సాంకేతిక విధానం క్యూ ఆర్‌ ‌కోడ్‌ ‌ద్వారా ఫిర్యాదు చేసే పోస్టర్‌, ‌కౌమార బాలికలపై జరిగే సైబర్‌ ‌క్రైమ్స్ ‌నిరోధం, మహిళా భద్రతవిభాగం విధి విధానాలపై ప్రచురించిన పుస్తకాలను డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి ఆవిష్కరించారు.

Leave a Reply