Take a fresh look at your lifestyle.

అధికారంపై ఆత్మగౌరవం గెలుపు

(మండువ రవీందర్‌రావు)
హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎట్టకేలకు ఆత్మగౌరవమే గెలిచింది. ఇక్కడ జరిగిన ఎన్నికలను రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికలుగా ఎవరూ భావించడంలేదు. ఈటల రాజేందర్‌ ‘ఆత్మగౌరవం’, కెసిఆర్‌ ‘అధికారం’ మధ్య జరిగిన పోరాటంగానే చూస్తూవచ్చారు. హుజురాబాద్‌లో తిరుగులేని నాయకుడిగా, ఈ ప్రాంతంనుండి ఆరు సార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తిగానే కాకుండా, తెలంగాణ రాష్ట్ర సాధనలో మడిమ తిప్పని పోరాటం చేసిన వ్యక్తిగా రాజేందర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర క్యాబినెట్‌లో నెంబర్‌ ఒన్‌గా కొనసాగుతూ వొచ్చిన రాజేందర్‌పై, రాష్ట్ర ప్రభుత్వం అనేకన్నా కెసిఆర్‌- అ‌క్రమాల ఆరోపణపై మంత్రి వర్గం నుండి బర్తరఫ్‌ ‌చేసినతీరు రాజేందర్‌ ఆత్మగౌరవాన్ని అగౌరవపర్చినట్లైంది. అదిగో.. ఆ నాటి నుండి ఆత్మగౌరవానికి, అధికారానికి మద్య పోరాటం జరుగుతూ వొచ్చింది. గడచిన అయిదు నెలలుగా సాగుతున్న ఈ పోరాటం కేవలం ఒక నియోజక వర్గానికో, తెలంగాణ రాష్ట్రానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా మారింది. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఏర్పడినా బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌మధ్యే నువ్వా నేనా అన్నట్లు కొనసాగింది. కోట్లాది రూపాయలను ఈ ఎన్నికల్లో మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చుచేశారు. చివరకు వోటుకు ఆరువేల నోటు అందించారు. అయితే దేనికదే అన్నట్లుగా వోటర్లు ఈసారి పార్టీలను పట్టించుకోకుండా వ్యక్తులను, వారి వెనుక జరిగిన రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకునే తమ వోటు హక్కును వినియోగించుకున్నారన్నది ఇక్కడి ఎన్నికల పక్రియ స్పష్టం చేస్తున్నది. ఈటల రాజేందర్‌ను 23 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలిపించారు.

మంగళవారం ఉదయం ప్రారంభమైన వోట్ల లెక్కింపు తీరుకూడా అంతే ఉత్కంఠతను కలిగించింది. ప్రతీ రౌండ్‌లో ఈటల రాజేందర్‌ ఆధిక్యతను కనబరుస్తూ రావడం టిఆర్‌ఎస్‌ ‌వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తూ వొచ్చింది. ఏ రాష్ట్రంలో అయినా ఉప ఎన్నిక జరుగుతున్నదంటే అక్కడి అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది సహజం. అలాంటిది దుబ్బాక ఎన్నికల్లో  ఆ తర్వాత ఇప్పుడు హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో సీన్‌ ‌రివర్స్ అయింది. మొదటి రౌండ్‌ ‌లెక్కింపు నుండి ఒకటి రెండు రౌండ్లు మినహాయిస్తే దాదాపు ప్రతీ రౌండులో వందల సంఖ్యలో బిజెపి అభ్యర్థి అయిన ఈటల రాజేందర్‌కు మెజార్టీ కొనసాగుతూ వొచ్చింది. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో కూడా రాజేందర్‌ ఆధిక్యతను సంతరించుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్‌ ‌నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్‌ ‌రెడ్డి స్వంత మండలం వీణవంకలో కూడా బిజెపి ఆధిక్యతను సంపాదించుకోవడం గమనార్హం. అదొక్కటే కాదు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు కేప్టెన్‌ ‌లక్ష్మికాంతరావు స్వగ్రామం సింగాపురంలో కూడా బిజెపి ఆధిక్యతను సాధి•ంచుకుంది.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద దళితబంధు పథకాన్ని హుజురాబాద్‌లో ప్రవేశపెడుతున్నదని ప్రతిపక్షాలు కోడై కూసినా, ప్రభుత్వం మాత్రం అక్కడే పథకాన్ని ప్రారంభించింది. ఈ నియోజకవర్గంలోని శాలపల్లిలో దీనికి శ్రీకారం చుట్టారు. గతంలో రైతుబంధు పథకాన్ని కూడా ఈ గ్రామం నుండే ప్రారంభించారు. అలాంటి పరిస్థితిలో ఈ గ్రామం వోటర్లు టిఆర్‌ఎస్‌ ‌వైపే నిలుస్తారని ఆ పార్టీ ఆశించింది. కాని, అక్కడి వోటర్లు భారతీయ జనతాపార్టీ వైపే మొగ్గుచూపటం టిఆర్‌ఎస్‌కు గట్టిదెబ్బే. ఈ గ్రామంలో బిజెపికి 129 వోట్ల ఆధిక్యత లభించింది. గ్రామంలో మొత్తం 493 వోట్లుండగా బిజెపికి 311 రాగా, టిఆర్‌ఎస్‌కు 182 వోట్లు మాత్రమే లభించాయి. రాష్ట్రానికి సంబంధించిన అతి ప్రధానమైన రెండు పథకాలు శ్రీకారం చుట్టుకున్న గ్రామంలోనే రాష్ట్ర ప్రభుత్వం వోట్లు సాధించుకోలేకపోయింది.

మొదటినుండి టిఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈటల బర్తరఫ్‌తో రాజకీయ పరిణామాలు సత్వర మార్పులు జరుగుతూ వొచ్చాయి. గత సంవత్సరం జూన్‌ 12‌న టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి రాజీనామా చేసిన ఈటల 14వ తేదీన బిజెపిలో చేరారు. అయితే బిజెపిలోకి చేరడానికి ముందునుండే ఆయన ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకుని నియోజకవర్గమంతా కలియతిరిగారు. అప్పటినుండి ఎన్నికల పక్రియ పూర్తి అయ్యేవరకు అలుపెరుగని విక్రమార్కుడిలా వోటర్లతో మమేకమవుతూ తనను, తనలాంటి వారిని కెసిఆర్‌ ఎలా వాడుకుని వదిలేస్తాడన్న విషయాన్ని విడమరిచి చెప్పడంలో సఫలమైనాడని ఈ ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఎన్నికలు రానున్న సార్వత్రిక  ఎన్నికలకు లిట్మస్‌ ‌టెస్ట్ ‌లాంటిదన్న అభిప్రాయాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తూ వొచ్చాయి. రానున్న రోజుల్లో గోలకొండకోటపై కాషాయ జండాను ఎగురవేస్తామని చెబుతున్న భాజపా ఈ ఎన్నికను ప్రతిష్టగానే తీసుకుంది. దీంతో రాష్ట్ర శాసనసభలో ఇప్పుడు బిజెపి స్థానాలు మూడుకు పెరిగాయి.

ఇక వోట్ల లెక్కింపు తీరును పరిశీలిస్తే  ప్రతీ రౌండ్‌లోనూ భారతీయ జనతాపార్టీ  తన ఆధిక్యతను నిరూపించుకుంటూ వొచ్చింది. అయితే టిఆర్‌ఎస్‌ ‌రెండు రౌండ్లలో మాత్రమే మెజార్టీని సాధించుకుంది. అందులో ఒకటి ఎనిమిదవ రౌండ్‌ ‌కాగా, మరోటి 11 రౌండ్‌ ‌దీంతో భాజపా వర్గాల్లో ఎక్కడలేని ఆనందం వెల్లి విరిసింది. నియోజకవర్గంతోపాటు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు సంబరాలు చేసుకున్నాయి. గతంలో ఉత్తర, దక్షిణ ప్రాంతంలోకలిపి కేవలం రెండు ఎంపి స్థానాలను సాధించుకున్న బిజెపికి హనుమకొండ ఎలా అండగా నిలిచిందో, ఇప్పుడు ప్రతిష్టగా తీసుకున్న ఈ ఎన్నికల్లో అదే హనుమకొండ జిల్లాకు చెందిన హుజురాబాద్‌ ‌నియోజకవర్గం మరోసారి ఆ పార్టీ ప్రతిష్టను నిలిపినట్లైంది.
లెక్కింపును పరిశీలిస్తే మొత్తం 22 రౌండ్లకు గాను టిఆర్‌ఎస్‌ ‌కేవలం రెండు అంటే రెండు రౌండ్లలో మాత్రమే ఆధిక్యతను నిరూపించుకుంది. అదికూడా చాలా స్వల్పమనే చెప్పాలె. ఎనిమిదవ రౌండ్‌లో 162 వోట్ల ఆధిక్యతను సాధించుకోగా, 11వ రౌండ్‌లో 367 లీడ్‌ను పొందింది. అంతకు మించి మరే రౌండ్‌లో కూడా టిఆర్‌ఎస్‌ ‌బిజెపి అభ్యర్థిని దాటలేకపోయింది. ఇదిలా ఉంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌ ‌షరా మామూలే అన్నట్లు, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోకూడా కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయింది. ఇందుకు ఆ పార్టీలోని సీనియర్‌లు రేవంత్‌రెడ్డి వైపే వేలెత్తి చూపుతున్నారు.

Leave a Reply