పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా!!.. అని భక్త రామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరతుని పేరిట చేయించిన ఈ పతకాన్ని భరతాగ్రజుడైన రామయ్య తండ్రికి శ్రీరామనవమి నాడు మరియు ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరామునికి అలంకరిస్తారు.
చింతాకు పతకం : సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!! అని రామదాసు కీర్తించిన పతకమిదే. ఈ పతకాన్ని శ్రీరామనవమి నాడు, అలాగే ప్రత్యేకమైన ఉత్సవాల్లో సీతమ్మ తల్లికి అలంకరిస్తారు.
మంగళసూత్రం : మూడు మాంగల్యాలు గల మంగళ సూత్రాన్ని భక్త రామదాసు చేయించారు. ఒకటి దశరథ మహారాజు తరుపున, రెండు జనక మహారాజు తరపున, మూడు శ్రీ భక్తరామదాసు కన్యాదాతగా తమ తరపున అమ్మవారికి సమర్పించినది. ఈ మాంగల్యముతోనే శ్రీరామ నవమినాడు కల్యాణ మహోత్సవము జరుగును.
శ్రీరామ మాడ : రామదాసుని చెరనుండి విడిపించడానికి రామలక్ష్మణులిద్దరూ గోల్కొండ నవాబైన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజీ అనే సిపాయిల రూపాతో వెళ్ళి, ఆలయం నిర్మించడానికై ఖర్చు చేసిన 6 లక్షల వెండి నాణాలకు బదులుగా 6 లక్షల బంగారు నాణాలు చెల్లించారు. ఆ నాణాలపై ఒక వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు దాసాంజనేయస్వామి రూపు ఉంటాయి. ఆ నాణానికే రామ మాడ అని పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఆ రామమాడను శ్రీరామనవమి మరియు ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణస్వామికి అలంకరిస్తారు.