- సచివాలయం వైపు వెళ్లే అన్ని రహదారులు మూసివేత
- ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులకు తప్పని తిప్పలు
- కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్
సచివాలయ భవనాల కూల్చివేత పనులు రెండో రోజూ కొనసాగాయి. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను కూల్చివేసి అదే స్థానంలో ఆధునిక హంగులతో కొత్త సచివాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయ భవనాల కూల్చివేత ప్రారంభం కాగా, రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. దీంతో పోలీసులు అటు వైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సచివాలయ భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎలాంటి ఆందోళన చేయకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం వైపు వెళ్లే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేశారు. దీంతో సచివాలయం వైపు వెళ్లే నగరంలోని రద్దీ ప్రాంతాలైన హిమాయత్‌నగర్, లక్డీకాపూల్, ఆదర్శ్‌నగర్ రవీంద్రభారతి, ఖైరతాబాద్, ఇందిరాపార్క్, బషీర్‌బాగ్ నుంచి వేల సంఖ్యలో వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలు చోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలలోనే వెళ్లాలని సూచించడంతో మరో దారి చూసుకోక తప్పలేదు. కాగా, సచివాలయ భవనాల కూల్చివేత పనులు మరో వారం రోజుల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. భవనాల శిథిలాలను అక్కడి నుంచి తరలించే ప్రక్రియను ఈనెలాఖరు వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణానికి వీలుగా 25.5 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు సుమారు 12 నుంచి 15 రోజుల వరకూ పడుతుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వాస్తు దోషాలను చక్కదిద్దేందుకు ఆ ప్రాంగణాన్ని చతురస్రాకారంగా తయారు చేసేందుకు వీలుగా మింట్ కాంపాండ్ వైపు ఉన్న స్థ)ంతో పాటు ప్రస్తుతం ఉన్న సచివాలయం ప్రధాన గేటు వెనక భాగం వైపు స్థ)ంలో ఉన్న విద్యుత్ శాఖ రాతి భవనాన్ని సైతం ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.
సచివాలయ కూల్చివేత పనులు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్
కాగా, సచివాలయ భవనాల కూల్చివేత పనులను వెంటనే నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీజేఎస్ నేత ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు ఈమేరకు బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారనీ, దీంతో వాతావరణం కాలుష్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ కూల్చివేతల కారణంగా సమీపంలోని దాదాపు 5 లక్షల మంది పీల్చే స్వచ్చమైన గాలి కలుషితం అవుతుందనీ, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఈ కేసును ప్రస్తుతం అత్యవసరంగా విచారించలేమనీ, దీనికి సంబంధించిన విచారణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.