- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అధ్యయనం
- ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న ఉన్నత స్థాయి కమిటీ
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్:రాష్ట్రంలో సమగ్ర ఎన్ఆర్ఐ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ విదేశాలకు వెళుతున్నారు. అయితే, అక్కడ అమలులో ఉన్న నియమ నిబంధనలపై అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. జాతి వివక్ష (రేసిజం)తో విదేశీయుల చేతిలో హత్య•కు గురికావడం, రోడ్డు ప్రమాదాలలో మరణించడం జరుగుతోంది. మరోవైపు, ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లిన వారు ఇతర కార్యకలాపాలకు పాల్పడిన పక్షంలో అక్కడి ప్రభుత్వాలు మన రాష్ట్ర పౌరులను జైలులో పెట్టడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుం టున్నాయి.కొంత మంది ఉపాధి అవకాశాల పేరుతో ఏజెంట్ల చేతిలో మోసపోయి శిక్షలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఈ తరహా ఘటనలు అమెరికా, అరబ్ దేశాలలో ఏదో ఒక చోట జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా సమగ్ర ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా తెలంగాణ నుండి ప్రతీ ఏటా ఎంత మంది పౌరులు విదేశాలకు వెళుతున్నారు ?రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి ఎంత మంది ఏ దేశానికి వెళ్లారు ? అలా వెళుతున్న వారిలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎంత మంది వెళుతున్నారు ?ఉపాధి అవకాశాల నిమిత్తం ఎంత మంది వెళుతున్నారు ? వంటి వివరాలను సేకరించనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దేశవ్యాప్తంగా పర్యటిం••నుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి నర్సింగరావు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. అక్కడ అమలులో ఉన్న ఎన్ఆర్ఐ పాలసీపై అధ్యయనం చేస్తున్నది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్ఐ పాలసీలను అమలు చేస్తుండగా కేరళలో అమలులో ఉన్న విధానం అత్యుత్తమమైందిగా భావిస్తున్నారు.
ఆ రాష్ట్రంలో అమలులో ఉన్న ఎన్ఆర్ఐ పాలసీ ప్రకారం అక్కడి పౌరుడు విదేశాలకు వెళ్లాలంటే ముందుగా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి, దీంతో పాటు ఏ దేశానికి ఎందుకోసం వెళుతున్నారు ? ఎవరి ద్వారా అక్కడికి వెళుతున్నారు వంటి వివరాలన్నింటినీ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వాలి వారి ఫోను నెంబర్లు వంటి ముఖ్యమైన పూర్తి సమాచారంతో అఫిడవిట్ ఇవ్వాలి. ఈ వివరాలన్నింటిని స్థానికంగా నమోదు చేసుకున్న తరువాతనే విదేశాలకు వెళ్లేందుకు వారికి అనుమతి ఇస్తుంది. కేరళ పర్యటన పూర్తయిన అనంతరం ఈ కమిటీ విదేశాలకు ఎక్కువ సంఖ్యలో పౌరులు వెళ్లే రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలోనూ అమలులో ఉన్న ఎన్ఆర్ఐ పాలసీని అధ్యయనం చేసి ప్రభుత్వానిక సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికపై క్యాబినెట్లో చర్చించిన అనంతరం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీని ప్రకటించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిసింది.