Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌దిశగా ఆలోచించమంటున్న శాస్త్రవేత్తలు.. మౌనంలో కేంద్రం

దేశంలో నిత్యం పెరుగుతున్న కొరోనా కేసులను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌విధించడమే సరైన చర్యగా అటు శాస్త్రవేత్తలు, న్యాయకోవిదులు చెబుతున్న మాటలను కేంద్రం పెడచెవిన పెడుతున్నట్లు కనిపిస్తున్నది. గత లాక్‌డౌన్‌ అనుభవాల దృష్ట్యా దేశ ఆర్థిక పరిస్థితిని గురించి మాత్రమే కేంద్రం ఆలోచిస్తున్నదేగాని, అంతకుమించిన భారీనష్టాన్ని నిరోధించలేకపోతున్నదన్న ఆరోపణలను కేంద్రం ఎదుర్కుంటున్నది. కొరోనా మొదటివేవ్‌ ‌కన్నా రెండవ వేవ్‌ ‌దేశంలో భారీస్థాయిలో మానవ హవనానికి కారణంగా మారింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో దేశంలో మొదలైన కొరోనా ఆ సంవత్సరం చివరినాటికి అంటే డిసెంబర్‌ ‌నాటికి కోటి మంది ఈ వైరస్‌ ‌ప్రభావానికి లోనైనారు. కాని ఈ సంవత్సరం ఇప్పటివరకు అంటే మే మొదటి వారం వరకు అంతకు మించి ఆ సంఖ్య రెండు కోట్లకు చేరింది. మొదటిసారి కొరోనా విషయంలో తీసుకున్న జాగ్రత్తలేవీ రెండవ వేవ్‌లో పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయంలో పాలకుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తున్నది.

రెండవ వేవ్‌ ‌ప్రమాదకారిగా మారినప్పటికీ మొదటివేవ్‌లో లాగా లాక్‌డౌన్‌ ‌విధించేందుకు కేంద్రం వెనుకాముందు అడుతుండడం ఒకటికాగా, పాటించాల్సిన నిబంధనల విషయంలో పాలకుల ,విధాన కర్తల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దేశం ఇంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కుంటున్నప్పటికీ ఎన్నికలని, సభలు, సమావేశాలు పెట్టడం, కుంభమేలాలకు అనుమతించడంలాంటి చర్యలే దేశంలో మారణహోమానికి దారితీసిందన్న విషయాన్ని స్వయంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నమాట. తాజాగా ఒక్క రోజున దేశంలో నాలుగు లక్షల పన్నెండు వేల పాజిటివ్‌ ‌కేసులు నమోదు అవడమే ఇందుకు నిదర్శనం. ఇంత పెద్ద సంఖ్యలో ఇప్పటివరకు ఏ దేశంలో కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఒక విధంగా గత ఏడాది మనదేశంలోనే ఏప్రిల్‌లో నాలుగు లక్షల రెండు వేలకు పైగా కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా ఇంచుమించుగా నాలుగువేల మరణాలు సంభవించాయి. ఇలాంటి పరిస్థితిలో లాక్‌డౌన్‌ ‌విషయంలో ఆలోచించాలని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తాజాగా కేంద్రానికి సూచించారు కూడా. రెండవ వేవ్‌ ఇం‌త ప్రమాదకారిగా ఉంటే మూడవ వేవ్‌ ‌మరింత ప్రమాదకారిగా మారే అవకాశమున్నందును కేంద్రం ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ముఖ్యంగా మూడవవేవ్‌ ‌చిన్నపిల్లలపై అధిక ప్రభావాన్ని చూపించేదిగా ఉంటుందంటున్న దరిమిలా కావాల్సినంత ఆక్సీజన్‌ను సిద్దపర్చుకోవాలనికూడా న్యాయస్థానం పేర్కొంది.

ఈ విషయంలో కేంద్రం వెంటనే స్పందించకుంటే రాబోయే రోజుల్లో వేలు, లక్షల సంఖ్యలో ఈ వైరస్‌కు బలి అయ్యే ప్రమాదాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. రాబోయే పరిణామాలపై రెండు నెలల క్రితమే కేంద్రాన్ని హెచ్చరించామని అయినా కేంద్రం సత్వరం స్పందించి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే దేశంలో ఇంత విస్పోటం జరిగిందని శాస్త్రవేత్తలు ఆవేదన చెందుతు న్నారు. సెంటర్‌ ‌ఫర్‌ ‌సెల్యులర్‌ అం‌డ్‌ ‌మాలిక్యూలర్‌ ‌బయాలొజీ (సిసిఎంబి) మాజీ డైరెక్టర్‌ ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలోకూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. దేశంలో కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నాయని, వాటివల్ల చాలా ప్రమాదముంటుందని ముందుగానే హెచ్చరించా మన్నాడు. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేసేందుకు తగినచర్యలు తీసుకోవాలంటాడు. అందుకు లాక్‌డౌన్‌ ‌విధించడమే సరైన నిర్ణయంగా ఆయన ఆ ఇంటర్వూలో అభిప్రాయపడ్డాడు. ఇదిలాఉంటే అమెరికా వైట్‌ ‌హౌజ్‌ ‌చీఫ్‌ ‌మెడికల్‌ అడ్వైజర్‌ ‌డాక్డర్‌ అం‌థోని ఫౌచి మరోసారి ఈ విషయమై స్పందించాడు.

సెకండ్‌ ‌వేవ్‌తో ఇప్పటికే భారత్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నదని, ఇలానే కొనసాగితే మరింత కష్ట పరిస్థితులు ఎదురవుతాయని, అందుకు కనీసం మూడు నుండి నాలుగు వారాలపాటైనా లాక్‌డౌన్‌ ‌విధించాలని అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్‌ ‌వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అంతకు మించిన నష్టం లాక్‌డౌన్‌ ‌విధించకపోతే జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. దీంతోపాటు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని, తాత్కాలిక హాస్పిటల్స్, ‌కోవిడ్‌ ‌కేర్‌సంటర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించాడు. అదే విధంగా ప్రపంచదేశాలు కష్టంలో ఉన్నప్పుడు భారత్‌ ‌వారిని ఆదుకుందని, ఇప్పుడు భారత ఇబ్బందిని ఎదుర్కుంటున్న సమయంలో ఇతర దేశాలు భారత్‌కు అండగా నిలవాలనికూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నది. ఈ రెండు రాష్ట్రాలనుండి దిల్లీ కి రావద్దని ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవిందకేజ్రీవాల్‌ ‌హెచ్చరించారు.

రెండు డోసుల వ్యాక్సిన్‌ ‌తీసుకున్నవారుకూడా 72గంటల్లోగా ఆర్టీ పీసిఆర్‌ ‌పరీక్షలు చేయించుకుని నెగటివ్‌ ‌సర్టిఫికెట్‌తో వొచ్చినా తమ దగ్గర 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రకటించాడంటే ఈ రెండు రాష్ట్రాల్లో వైరస్‌ ‌ప్రభావం ఏమేరకుందన్నది అర్థమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ ‌కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయినా తెలంగాణ సర్కార్‌ ‌లాక్‌డౌన్‌ ‌వద్దంటోంది. లాక్‌డౌన్‌వల్ల జనజీవనం స్థంబించిపోతుందని, రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుందనీ , ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ‌విధించినప్పటికీ పాజిటివ్‌కేసులు తగ్గలేదని సాక్షాత్తు రాష్ట్ర సిఎం కెసిఆర్‌ ‌పేర్కొనడం గమనార్హం. అందుకు ప్రత్యమ్నాయంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 9వేల 500 ఆక్సీజన్‌ ‌బెడ్స్‌కు అదనంగా 5వేలకు పెంచుతున్నట్లు, రాష్ట్రంలో పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఏరియా హాస్పిటల్స్ అన్నీ కలిపి 5వేల 980 ఉన్నాయని, అన్నిటిలో కోవిడ్‌ ఓసి సేవలు ప్రారంభిస్తున్నామని చెబుతున్నారు. కాగా, రాష్ట్ర హైకోర్టు మాత్రం లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీన్నిబట్టి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం లాక్‌డౌన్‌ ‌లేకుండానే నెట్టుకురావాలని చూస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఈ క్రమంలో మరెంతమంది కొరోనాకాటుకు గురి కానున్నారో మరి.

Leave a Reply