Take a fresh look at your lifestyle.

60 శాతం మంది తల్లిదండ్రుల అంగీకారం

  • 60 శాతం మంది తల్లిదండ్రుల అంగీకారం
  • కోవిడ్‌ ‌నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
  • మధ్యాహ్న భోజనానికి పాత స్టాక్‌ ‌బియ్యం వాడొద్దు
  • మే 15లోగా ఇంటర్‌ ‌పరీక్షలు పూర్తి చేస్తాం
  • విద్యాశాఖ, డీఈవోలతో మంత్రి సబిత సమీక్షా సమావేశం

‌రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో కోవిడ్‌ ‌నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇంటర్‌ ‌పరీక్షలను మే 15లోపు పూర్తి చేస్తామని వెల్లడించారు. మధ్యాహ్న భోజనానికి పాత స్టాక్‌ ‌బియ్యాన్ని వాడొద్దని సూచించారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో 9 ఆపై తరగతులు పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి సబిత బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్ఘలో విద్యా శాఖ ఉన్నతాధికారులు, 33 జిల్లాల డీఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి సబిత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 14,252 పాఠశాలలు ఉన్నాయనీ, వాటిని వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో కొరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామనీ, కళాశాల, తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి పాఠశాల పరిసరాల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా, పాఠశాలలో శానిటైజర్లు ఏర్పాటు చేసేలా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

9,10 తరగతులకు విద్యార్థులను పంపించేందుకు 60 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకార పత్రాలను అందజేశారని చెప్పారు. ప్రతీ విద్యార్థికీ తక్షణమే పాఠ్య పుస్తకాలను అందజేస్తామనీ, యూనిఫాంలు కూడా కొత్తవి పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అన్ని జిల్లాలలో 85 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ‌క్లాసులు వింటున్నారనీ, పాఠశాలలకు హాజరు కాని విద్యార్థులకు డిజిటల్‌ ‌క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని ఈ సందర్భంగా మంత్రి సబిత స్పష్టం చేశారు.

Leave a Reply