Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో పాఠశాలలు వెంటనే ప్రారంభించాలి టీపీటీఎఫ్‌ ‌డిమాండ్‌

ఆన్‌లైన్‌ ‌బోధన కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జరుగుతున్న నష్టం మరింత పెద్దగా మారక ముందే ప్రభుత్వం పాఠశాలలను పున: ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని టీపీటీఎఫ్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. ఈమేరకు టీపీటీఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు కె.రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్‌ ‌మంగళవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అనేక కారణాల వల్ల బోధనను అందుకోలేని గ్రామీణ విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్నారనీ, విద్యార్థుల మానసిక, శారీరక నైపుణ్యాల వేగం కంటే టీవీ పాఠాల వేగం ఎక్కువగా ఉండటం వల్ల 90 శాతానికి పైగా విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుంగా వ్యవసాయ పనుల సీజన్‌ ‌కావడం వల్ల తల్లిదండ్రులకు సహాయంగా పొలాలకు వెళ్లడం, పశువుల కాపరులుగా మారడం జరుగుతున్నదని తెలిపారు. కొద్ది మంది విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతంగా టీవీల ముందు కూర్చొబెట్టినా ఏ ఫలితం ఉండటం లేదని చెప్పారు.

మరోవైపు, పట్టణ ప్రాంత విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడుతూ పర్యవేక్షణ కొరవడటం వల్ల విచ్చలవిడి ఇంటర్నెట్‌ ‌వాడకం పెరిగి దారితప్పే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పాఠశాలలు తెరవకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారనీ, కొరోనా వల్ల జరిగే నష్టం కంటే ఈ ప్రమాదాల వల్ల పిల్లలకు కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు సైతం పాఠశాలలు ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నారనీ, వారి నుంచి ఉపాధ్యాయులు ప్రతీ రోజు ఇవే ప్రశ్నలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థులు చదువులో మూడేండ్ల పాటు వెనుకబడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  అన్ని రంగాలకు చివరికి సినిమా థియేటర్లు వినోద రంగానికి సైతం సడలింపు ఇచ్చిన ప్రభుత్వం విద్యాసంస్థలను తక్షణమే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే పాఠశాలలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించి కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ వెంటనే పాఠశాలలు పున:ప్రారంభించి విద్యా రంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా రమణ, శ్రీనివాస్‌ ‌ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply