Take a fresh look at your lifestyle.

ఫస్ట్ ‌నుండి పాఠశాలలు.. అయిష్టత చూపుతున్న తల్లిదండ్రులు

“రాష్ట్రంలో కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఈ నెల 20న లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతోపాటు, సుదీర్ఘకాలంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో పున:ప్రారంభ మవుతున్న విద్యాలయాల్లో కనీస ఏర్పాట్లకోసం ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు సిద్ధపడుతుంటే తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సందేహిస్తున్నారు. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం తెలియందికాదు. మొదటివేవ్‌తో పోలిస్తే రెండవ వేవ్‌లో కోవిడ్‌ ‌బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిన విషయం తెలియంది కాదు. అలానే మృతుల సంఖ్యకూడా గణనీయంగానే పెరుగుతూ వొచ్చింది. ప్రభుత్వ లెక్కల్లోకి రాని కేసులు చాలానే ఉన్నాయన్న వాదన కూడా లేకపోలేదు. అయితే ఈలోగా వాక్సినేషన్‌ అం‌దుబాటులోకి రావడంతో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యలో క్రమేణ మార్పు కనిపిస్తున్నది. దీంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు కాస్త ఊపిరితీసుకునే అవకాశం ఏర్పడింది. అంతమాత్రాన కొరోనాను సంపూర్ణంగా పారదోలినట్లు కాదని అధికార యంత్రాంగమే చెబుతున్నది.”

రాష్ట్రంలో కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఈ నెల 20న లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతోపాటు, సుదీర్ఘకాలంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో పున:ప్రారంభ మవుతున్న విద్యాలయాల్లో కనీస ఏర్పాట్లకోసం ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు సిద్ధపడుతుంటే తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సందేహిస్తున్నారు. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం తెలియందికాదు. మొదటివేవ్‌తో పోలిస్తే రెండవ వేవ్‌లో కోవిడ్‌ ‌బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిన విషయం తెలియంది కాదు. అలానే మృతుల సంఖ్యకూడా గణనీయంగానే పెరుగుతూ వొచ్చింది. ప్రభుత్వ లెక్కల్లోకి రాని కేసులు చాలానే ఉన్నాయన్న వాదన కూడా లేకపోలేదు. అయితే ఈలోగా వాక్సినేషన్‌ అం‌దుబాటులోకి రావడంతో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యలో క్రమేణ మార్పు కనిపిస్తున్నది. దీంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు కాస్త ఊపిరితీసుకునే అవకాశం ఏర్పడింది. అంతమాత్రాన కొరోనాను సంపూర్ణంగా పారదోలినట్లు కాదని అధికార యంత్రాంగమే చెబుతున్నది. ఇంతవరకు కొరోనా విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ యథావిధిగా మరికొంతకాలం పాటించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇంకా థర్డ్‌వేవ్‌ ‌బూచి భయం లేకపోలేదు. కొరోనా మూడవ వేవ్‌ ‌కూడా అత్యంత ప్రమాదకారేనంటున్న ప్రచారం విస్తృతంగా సాగుతున్నది.

ఇది సెప్టెంబర్‌లో బాగా విజృంభించే అవకాశాలున్నట్లుగా శాస్త్రవేత్తలు అంచానా వేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలమీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలను బయటికి పంపించాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం స్కూల్స్, ‌కాలేజీలను జూలై ఒకటి నుండి తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తగిన ఏర్పాట్లను చూడాల్సిందిగా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీచేసింది. కొరోనా కారణంగా ఇంటర్‌, ‌టెన్త్ ‌పరీక్షలను రద్దుచేసి, అన్ని తరగతుల విద్యార్థులందరినీ ఉన్నత తరగతికి ప్రమోట్‌ ‌చేసిన రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ ‌వేవ్‌ ‌రూపంలో మరో భూతం రాబోతున్నదని తెలిసికూడా పాఠశాలలను తెరవడమేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ పిల్లలు పాఠశాలకు వెళ్ళి సురక్షితంగా ఉండగలుగుతారా అన్న సంశయం చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. అనుకోకుండా ఏదైనా జరిగితే పిల్లల పరిస్థితి ఏమిటి, తమ పరిస్థితేమిటంటున్నారు. ఇంతకు క్రితం కూడా ఇలాంటి ప్రయోగం చేసి ప్రభుత్వం నాలిక కర్చుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

పాఠశాలలు తెరవడంతో సోషల్‌ ‌వెల్‌ఫేర్‌ ‌హాస్టళ్ళలో ఉన్న విద్యార్థులతో పాటు, పలువురు టీచర్లు కూడా కొరోనా బారిన పడిన విషయం తెలియంది కాదు. దాంతో ప్రభుత్వం వెంటనే స్కూళ్ళను బంద్‌ ‌చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పుడు మూసివేసిన స్కూళ్ళను ఇప్పుడు మళ్ళీ తెరవడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో తమ పిల్లలను పాఠశాలకు పంపాలా వద్దా అన్న మీమాంసలో తల్లిదండ్రులున్నారు. ప్రత్యక్ష బోదన వొద్దు.. ఆన్‌లైనే ముద్దు అన్నట్లు, మరికొంతకాలం ఆన్‌లైన్‌లోనే బోధ•నలందించాలని మెజార్టీ తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌ ‌సూచన ప్రకారం పద్దెనిమిదేళ్ళ వయస్సు నిండిన వారినుండి యువకులందరికీ వాక్సినేషన్‌ ‌ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే పాఠశాలను తెరిచే విషయాన్ని ఆలోచిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

కాగా ఈ విషయం ఇప్పుడు కోర్టు విచారణలో ఉంది. పాఠశాలల్లో బౌతిక దూరాన్ని పాటించడం కష్టమేకదా అన్న అనుమానాన్ని కోర్టుకూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. అయితే దీనిపైన రెండు మూడు రోజుల్లో విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు కోర్టుకు విన్నవించినట్లు తెలుస్తున్నది. అదే విధంగా ప్రజలకు వ్యాక్సినేషన్‌ ‌చేస్తున్న విధానాన్ని కూడా అధికార యంత్రాంగం కోర్టుకు వివరించినట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఒక పక్క థర్డ్‌వేవ్‌ ‌భయం వెంటాడుతుండడంతో తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు భయపడిపోతున్న తల్లిదండ్రులు, రెండు సంవత్సరాలుగా పాఠశాల ముఖమే చూడక విద్యలో వెనుబడిపోతున్న తమ పిల్లల భవిష్యత్‌ ‌గురించి బెంగపెట్టుకుంటున్నారు.

Manduva Ravinder Rao
( మండువ రవీందర్‌రావు )

Leave a Reply