Take a fresh look at your lifestyle.

6,7,8 తరగతుల విద్యార్థులకు స్కూళ్లు

  • కొరోనా నిబంధనలు పాటిస్తూ తెరిచేలా ఆదేశాలు
  • మార్చి 1 వరకు ప్రారంభించుకునే వెసలుబాటు
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • తరగతుల ప్రారంభంపై అధికారులతో సిఎస్‌ ‌టెలీకాన్ఫరెన్స్

ఇప్పటికే 9,10 తరగతులను ప్రారంభించిన ప్రభుత్వం రాష్ట్రంలో 6,7,8 తరగతులకు కూడా బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో నేటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే నేటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవొచ్చని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలల ప్రారంభానికి ఈ మేరకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నేటి నుంచి మార్చి 1వ తేదీలోగా తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కొరోనా నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కోవిడ్‌ ‌మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు.

విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన ఆమె కోవిడ్‌ ‌మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్‌ ‌కారణంగా గత ఏడాది మార్చి చివరి నుంచి విద్యాలయాలు మూతపడ్డాయి. సుదీర్ఘకాలం తర్వాత కాలేజీలు ప్రారంభమైనప్పటికీ పాఠశాలలు మాత్రం తెరుచుకోలేదు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 9, 10 వ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా తరగతులు చదువుకునే విద్యార్థులకు కూడా బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజా 6, 7, 8 తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే 9,10 తరగతులు ఎలాంటి ఆటంకాలు, ఆందోళనలు లేకుండా సాగుతున్నాయి.

తరగతుల ప్రారంభంపై అధికారులతో సిఎస్‌ ‌టెలీకాన్ఫరెన్స్
‌రాష్ట్రంలో 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులను రేపటి నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌జిల్లా కలెక్టర్లు, డిఈఓలు, బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటి శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులతో మంగళవారం బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌ ‌నుండి టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. 6 నుండి 8 వతరగతి వరకు క్లాసులను వీలైన మేరకు రేపటి నుండి లేదా మార్చి 1 లోగా ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 6 నుండి 8వ తరగతులకు సంబంధించి 17.24 లక్షల మంది విద్యార్ధులతో పాటు ఇప్పటికే హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఉంటారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్యూకేషన్‌ ‌మానిటరింగ్‌ ‌కమీటీలు సమావేశమై 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉపాధ్యాయులు, విద్యార్ధుల భద్రత కోసం తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలను మొదటి సారి ప్రారంభిస్తున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం ‌రిజ్వీ, ఎస్సి సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్‌ ‌బొజ్జా, బీసి సంక్షేమ కార్యదర్శి బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్‌ అహ్మద్‌, ‌గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌, ‌పాఠశాల విద్యా శాఖ సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply