- 9 నుంచి ఆపై తరగతుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
- ఉద్యోగ ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ
- ధరణి పోర్టల్ విజయవంతమైంది, అవసరమైన మార్పులు చేయండి
- కొరోనా టీకా పంపిణీ ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలి
- పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసు రెండేళ్లకు కుదింపు
- మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు పున: ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో దాదాపు 10 నెలల తరువాత రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్ ప్రస్తుతం ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలనీ, ఇందుకు సంబంధించిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, వైద్య శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో విద్యా సంస్థలను పున:ప్రారంభించే విషయంపై ఆ శాఖ ఉన్నతాధికారులతో ప్రధానంగా సమీక్షించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ రాష్ట్రంలో విద్యా సంస్థల నిర్వహణ సాధ్యమేనని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం సూచించిన కోవిడ్ నిబంధనల మేరకు నడుస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సంక్రాంతి పర్వదినం తరువాత 9వ తరగతి, ఆ పై క్లాసుల నిర్వహణకు సంబంధించి విద్యా శాఖ సమర్పించిన నివేదికను సీఎం పూర్తిగా చర్చించారు.
ఈనెల 18 నుంచి లేదా 20 నుంచి పాఠశాలలను నిర్వహించడానికి విద్యా శాఖ ప్రతిపాదించగా, ప్రస్తుత పరిస్థితులు, కొరోనా వ్యాక్సిన్ ప్రారంభం దృష్ట్యా ఇది కూడా పూర్తయిన తరువాత ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. దీంతో సీఎం విద్యా సంస్థల ప్రారంభానికి పచ్చ జెండా ఊపారు. దీంతో 10 నెలలుగా రాష్ట్రంలో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరుచుకునేందుకు మార్గం సుగమమైంది. అలాగే, రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినందున ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకేసారి భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వం శాఖలలో అర్హులకు వెంటనే పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖపై జరిగిన సమీక్షలో ఆ శాఖకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ వందకు వంద శాతం విజయవంతమైందనీ, ఈ పోర్టల్‌లో అవసరమైన అన్ని రకాల మార్పులు చేర్పులు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు.
కొరోనా టీకా పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేదీని నిర్ణయించి ఈనెల 16న దేశవ్యాప్తంగా టీకా వేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నింటీనీ వెం•నే పూర్తి చేయాలన్ని వైద్య, ఆరోగ్య శాఖ అదికారులను ఆదేశించారు. ఇక పల్లె ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో భాగంగా అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనీ, అన్ని గ్రామాల్లోనూ వైకుంఠ ధామాలు నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిపై సమీక్షలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని సూచించారు. కాగా, రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించి గతంలోనే తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్ తాజాగా పదోన్నతుల విషయంలోనూ మరోమారు వరాలు కురిపించారు. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైల్‌పై సీఎం సంతకం చేశారు.