- ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యం
- పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేయాలి
- ఇళ్ల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని నియమించాలి
- విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు 50 లక్షలు
- అధికారులకు మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశం
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వచ్చే ఉగాది పర్వదినం నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికొట్టాలలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను మెదక్ ఎంపి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి అయిన ఇండ్ల పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేసి ఉగాది నాటికి• ప్రారంభోత్సవానికి ముస్తాబు చేయాలని సూచించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన ప్రాంతాల్లో తక్షణం మంచినీరు వసతి, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలని ఇళ్లను పంపిణీ చేసేందుకు నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లబ్దిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణాలకు అధికారులకు తగిన ఆదేశాలు అందజేయాలన్నారు. ప్రతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి సందర్శన చేసి నిర్మాణాలను వేగవంతం చేసేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. మెదక్,నర్సాపూర్ పట్టణాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం నిర్మాణాలకు మంచినీటి సరఫరా కొరకు రేపటిలోగా నిధులను సర్దుబాటు చేస్తూ ఉత్వర్వులను జారీచేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్సిని ఫోన్లో కోరారు. రేపటిలోగా నిధులు మంజూరు అవుతాయని శుక్రవారం రోజున పనులును ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టే ఇండ్లను విద్యుత్ కనెక్షన్లను ఇచ్చేందుకు మంత్రి నిధులు రూ.25 లక్షలు, ఎంపి నిధులు రూ.25 లక్షలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య, పిఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనాథ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ కమలాకర్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.