Take a fresh look at your lifestyle.

సావిత్రిబాయి పూలే ఆశయ సాధన..బహుజనుల కర్తవ్యం

“ఆ ‌కాలంలోనే సావిత్రిబాయి పూలే చాకిరి, అంటరాని కులాలకు విద్య అందించినా నేటికి ఆమె ఆశయం నెరవేరకపోగా తిరిగి శూద్ర దళిత కులాలు విద్యకు దూరమయ్యే సామాజిక పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసి తన సామాజిక బాధ్యత నుండి తప్పుకుంటున్నది.  బతకడం కోసమే తండ్లాడుతున్న అనేక దళిత బహుజన కులాలు విద్యను కొనలేక అనివార్యంగా విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రూపం మారిన సామాజిక జీవనంలో బ్రాహ్మణ వాదం బహుజన సమాజాన్ని నేటికి పీడిస్తూనే ఉంది.’’

Savitribai Phule birth anniversary special
నేడు సావిత్రిబాయి పూలే జయంతి…

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించి, ఎంతో నాగరికతను సాధించామని చెప్పుకునే సమాజం మహిళా సమాజం పట్ల వివక్షతను రూపుమాపలేకపోతుంది. కుల వివక్ష, వర్గ వివక్షతో పాటు లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంటా బయట మహిళలపై హత్యలు, హత్యాచారాలు, హింస కొనసాగుతూనే ఉంది. సావిత్రిబాయి 1831 జనవరి 3న దక్షిణ మహారాష్ట్ర లోని సతార జిల్లాలోని నాయగావ్‌ ‌పల్లెటూరులో ఖండోజి సేవేనే పాటిల్‌, ‌లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. ఆమె తన తొమ్మిది సంవత్సరాల వయస్సులో జ్యోతిరావు పూలేను వివాహమాడింది. సావిత్రిబాయి జన్మించిన శూద్ర సమాజం కూడా ఈ వివక్షత భావాజాలానికి, అనుభవానికి దూరం కాలేకపోయింది. ఆమె ప్రదర్శించిన సాంఘిక చైతన్యం ఈ సమాజానికి ఎంత అవసరమో మొదటగా గుర్తించాల్సింది మహిళలే. ఆమె మహిళా విద్యకు ఆది గురువన్న విషయం విద్యాధికులైన మహిళా సమాజానికే తెలియని పరిస్థితి నెలకొని ఉంది. సాంఘిక చైతన్యం లేని సమాజం నిరంతర ఘర్షణతో హింసల పాలవుతుందన్నది చారిత్రక సత్యం. ఈ సత్యాన్ని మొదటగా గ్రహించిన సావిత్రిబాయి పూలే దంపతులు 180 ఏండ్ల క్రితమే సమస్య పరిష్కారానికి సమాజాన్ని జాగృతం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా దేశంలోని చాకిరి కులాలు విద్యకు దూరం చేయబడ్డారు. మానవ చైతన్యానికి విద్య ఎంతటి గొప్ప సాధనమో వీరు ముందుగా గుర్తించారు. లింగ వివక్షత కారణంగా మహిళలను దూరం చేయడాన్ని సామాజిక అభివృద్ధికి గొప్ప ఆటంకంగా భావించిన వీరు మొదటగా స్త్రీలకు విద్య నేర్పే విషయంలో క్రియాశీలక పాత్ర నిర్విహించారు. సామాజిక మద్దతు లభించని తరుణంలో తన ఆడపడుచు సుగుణాబాయితో కలిసి భర్త జ్యోతిరావు పూలే వద్ద విద్య నేర్చుకొన్నారు. ఆ విధంగా వారి లక్ష్య సాధనలో తన విజయవంతమైన మొదటి అడుగు వేసారు.

1848లో శూద్ర కులాల మహిళలను సమీకరించి పూణేలో వీరు మొదటి మహిళా పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాలకు శూద్ర కులాల మహిళల నుండి ఆదరణ లభించి చాలామంది చేరి విద్య నేర్చుకుంటుండంతో ఈ విషయం దేశ వ్యాపితంగా సంచలన చర్చగా మారింది. మహిళలు విద్య నేర్వడం మహా పాపమని ప్రచారం చేస్తూ వచ్చిన బ్రాహ్మణ వాదానికి తిరుగులేని దెబ్బ తగిలినట్లైంది. దాంతో బ్రాహ్మణులు అహం దెబ్బ తిన్నట్లుగా భావించి వారంతా కలిసికట్టుగా శూద్ర కులాల మహిళలకు విద్యను కొనసాగించే క్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని, ఆటంకాలు కల్పించారు. ఈ క్రమంలో బ్రాహ్మణుల ఒత్తిడితో పూలే దంపతులు వారి ఇంటి నుండి బయటకు నెట్టివేయబడ్డారు. అయినా సావిత్రిబాయి పూలే దంపతులు వెనక్కి తగ్గకుండా మరో అడుగు ముందుకు వేసి విద్యాభివృద్ధికి కృషి చేసారు. సమాజములో అంటరానివారుగా చూడబడుతున్న దళిత మహిళలకు విద్యను అందించడానికి వారి గూడాలకు తరలిపోయారు. సాటి దళిత మహిళకు విద్యను అందించే క్రమంలో శూద్రుల నుండి కూడా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. లోపాయికారి బ్రాహ్మణముల ప్రోద్భలంతో సావిత్రిబాయి దళిత గూడేనికి వచ్చిపోయే దారిలో పేడ నీళ్లను, మురికి నీళ్లను చల్లి, రాళ్లు రువ్వి ఆమెను శారీరకంగా, మానసికంగా ఎంతగానో హింసించి భయపెట్టారు. అయినా ఆమె సంకల్పం నుండి ఒక అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. ఆమె సాహసం ముందు దుర్మార్గమే ఓడి పోయింది. ఒక సామాజిక అభివృద్ధి కోసం, సాంఘిక చైతన్యం కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యం, సాహసం, సంకల్పం యావత్‌ ‌సమాజం గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం.

ఆ కాలంలోనే సావిత్రిబాయి పూలే చాకిరి, అంటరాని కులాలకు విద్య అందించినా నేటికి ఆమె ఆశయం నెరవేరకపోగా తిరిగి శూద్ర దళిత కులాలు విద్యకు దూరమయ్యే సామాజిక పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసి తన సామాజిక బాద్యత నుండి తప్పుకుంటున్నది. బతకడం కోసమే తండ్లాడుతున్న అనేక దళిత బహుజన కులాలు విద్యను కొనలేక అనివార్యంగా విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. రూపం మారిన సామాజిక జీవనం లో బ్రాహ్మణ వాదం బహుజన సమాజాన్ని నేటికి పీడిస్తూనే ఉంది. ఆనాటి సామాజిక దుర్మార్గాలను వ్యతిరేకించిన పూలే సత్యశోధక్‌ ‌సమాజాన్ని స్థాపించి కుల, వర్గ వివక్షతను, లింగ వివక్షతను, వితంతు వివక్షతను రూపుమాపడం కోసం చేసిన కృషికి ఆమె తోడ్పాటు చాలా గొప్పది. వీరు చేస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాలను ఆపలేని బ్రాహ్మణ వర్గాలు తనపై ప్రత్యక్ష దాడులకు దిగినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా బ్రాహ్మణుల సూచనలతో జ్యోతిరావు పూలేను హత్య చేయడానికి వచ్చిన దళితను నిలువరించి వారికి బోధించి వారిని సత్యశోధక్‌ ‌సమాజ్‌లో చేరే విధంగా మార్చివేసిన ఘనత కూడా సావిత్రిబాయికి ఉంది. జ్యోతిరావుపూలే మరణానంతరం కూడా ఆయన స్థాపించిన సత్యశోధక్‌ ‌సమాజ్‌ ‌కార్యకలపాలను కొనసాగిస్తూ వచ్చిందంటే ఆమె ఎంతటి దృఢ చిత్తురాలో మనం అర్థం చేసుకోవచ్చు.

ఆ కాలంలోనే ఎన్నో విలువలు బోధించి ఆచరణాత్మక ఉద్యమం చేసిన పూలే దంపతుల చరిత్ర నేటి సమాజంలో విస్తృత పరచకపోవడం వల్లనే నేటి సమాజంలో ఇంకా వివక్షత కొనసాగుతుంది. ప్రతి ఇంటా ఒక సావిత్రిబాయి పూలే తయారు కావల్సిన అవసరముంది. తల్లి జ్ఞానం చైతన్యం కలిగి ఉంటే భవిషత్‌ ‌సమాజం విలువల సమాజంగా మారుతుందనే విషయం గమనించాలి. స్త్రీల పట్ల సమానత్వం గౌరవం పెంచే సమాజం సావిత్రిబాయి పూలే జీవితం నుండి నేర్చుకోవాలి. సావిత్రి బాయి పూలే1897లో పూణే నగరాన్ని ప్లేగు వ్యాధి సోకిన క్రమంలో రోగులకు సేవలందిస్తూ అదే ప్లేగు వ్యాధికి గురై మార్చి 10, 1897న మరణించింది. ఆమె మరణం బహుజన సమాజానికి తీరని లోటును మిగిల్చింది. ఆమె సాగించిన కృషి బహుజన సమాజానికి స్ఫూర్తిదాయకం. సావిత్రిబాయిపూలే జయంతి సందర్బంగా ఆమె ఆశయ సాధనకోసం బహుజన సమాజం అంతా ప్రతిన బూనుదాం.
-సాయిని నరేందర్‌
బిసి స్టడీ ఫోరం
9701916091

Tags: Savitribai Phule, birth anniversary, special,

Leave a Reply