Take a fresh look at your lifestyle.

జాతీయ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మహిళా ఉద్యమం కొత్త మార్గం నిర్దేశించుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, న్యాయం అనే ఆధునిక భావనతో ఈ దేశం నడవాలంటే అందుకు విరుద్ధమైన అసమానతల బ్రాహ్మణవాదానికి, మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ క్రమంలో మన దేశానికి ప్రత్యేకంగా ఒక మహిళా దినోత్సవం అవసరం ఉందని గుర్తించాలి అందుకోసం మనం ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ ‌చేయాలి. పంచవ్యాప్తంగా మార్చి 8 నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళా హక్కులు, లింగ వివక్ష పనిస్థలాల్లో లైంగిక వేధింపులు, గృహ హింస వంటి అమానుష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ, స్త్రీ పురుష సమానత్వం, రాజకీయ, సామాజిక సమానత్వం కోరుతూ వివిధ దేశాల మహిళలు జరువుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన దేశంలో స్త్రీల పరిస్థితి గూర్చి ఆలోచించే అవసరాన్ని నొక్కి చెపుతుంది. ఈ దేశంలోని మహిళల విముక్తి కోసం జీవితాంతం సైద్ధాంతిక పోరాటం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి 123 వ వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా మార్చి 10 వ తారీఖునాడు జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోవాలి. జాతీయత, స్వదేశీ గురుంచి నిత్యం మాట్లాడే భారత ప్రభుత్వం సావిత్రిబాయి పూలే వర్ధంతిని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి మార్చి నెలంతా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని దేశీయ మహిళా సంఘాలు డిమాండ్‌ ‌చేయాలి.

డెబ్భై ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా చట్టసభల్లో మహిళకు రిజర్వేషన్లు లేవంటే కారణమేమిటి? మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లులో ఎస్సి, ఎస్టీ, బి.సి, మైనార్టీ స్త్రీలకు ప్రత్యేక కోటా ఉండాలంటే కేంద్రం ఎందుకు అంగీకరించడం లేదు? ఇప్పటికి మహిళల్లో సగానికి పైగా నిరక్షరాస్యులుగానే మిగిలిపోయారంటే కారణం ఎవరు? ప్రతి రెండు నిముషాలకు ఒక అత్యాచారం జరుగుతుందంటే దానికి బాధ్యత ఎవరిది? దేశ జనాభాలో సగభాగమైన మహిళలు ఇంత దోపిడీ పీడనలకు గురవుతుంటే పరిష్కారం లేదా? ప్రేమ పేరుతో మహిళల మీద జరుగుతున్న దాడులకు మహిళా సంఘాలు ఎందుకు పరిష్కారం చూపలేకపోతున్నాయి? స్త్రీల విముక్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇస్తున్న దిశానిర్దేశం ఏంటి? ఇప్పటికీ మనకు ఒక జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు లేదు? ఇన్నేళ్ళుగా జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కులం వల్ల పీడనకు గురవుతున్న మెజార్టీ మహిళలకు విముక్తి ఎందుకు కలిగించలేకపోయింది? జాతీయ, అంతర్జాతీయ మహిళా సంఘాలు వర్గ దృక్పథం నుండి తప్ప కుల వ్యవస్థ నిర్మూలన దృక్పథంతో స్త్రీల సమస్యను చూడలేకపోవడమే దీనికి కారణం. మహిళా విముక్తి కోసం పోరాటం చేసిన జాతిపిత మహాత్మా జయితీరావు పూలే, సావిత్రిబాయి పూలే స్త్రీ పురుష సమానత్వం కొరకు ఏర్పాటు చేసిన సత్య శోధక్‌ ‌సమాజములో నాయకురాలిగా పనిచేసిన తారాబాయి షిండే, హిందూ కోడ్‌ ‌బిల్లు కొరకు మంత్రి పదవికి రాజీనామా చేసిన బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌, ‌స్త్రీలకు స్వాభిమానం కల్పించిన పెరియార్‌ ఇ. ‌వి.రామసామి లాంటి మహానుభావులను ఇప్పటివరకు పట్టించుకోని కారణంగా దేశంలో మహిళా విముక్తికి సరైన మార్గంలో మహిళా ఉద్యమం పయనించలేదు.

మన దేశంలో స్త్రీలు దుర్మార్గమైన దోపిడి, అణచివేతకు గురికావడానికి, రెండవ శ్రేణి పౌరులుగా పరిగణించబడడానికి బ్రాహ్మణవాదమే కారణమని బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌సూత్రీకరించాడు. ఈ సూత్రీకరణను పట్టించుకోని మహిళా సంఘాలు పితృస్వామిక వ్యవస్థ స్త్రీల అణచివేతకు కారణమని, పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించుకొని పోరాడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో స్త్రీల అణచివేతకు పితృస్వామ్యం కారణం ఎందుకంటే అక్కడ బ్రాహ్మణీయ కుల వ్యవస్థ లేదు. స్త్రీలను దారుణంగా అణచివేసే మనుధర్మం అక్కడ అమలులో లేదు. కానీ మన దేశంలో మనుధర్మం నిర్దేశించిన అసమానాతల కుల దొంతరుల సమాజం ఉంది. కులం ప్రతి మనిషి హక్కులను నిర్దేశిస్తుంది, కులం ప్రతి స్త్రీ సామాజిక హోదాను నిర్ణయిస్తుంది. స్త్రీలకు ఆత్మ విశ్వాసం లేకుండా పోవడానికి, స్త్రీలకు స్వాభిమానం, స్వయం నిర్ణయాధికారం లేకుండా పోవడానికి కారణం కులం, కుల వ్యవస్థ ఆ కుల వ్యవస్థను సృష్టించి కాపాడుతున్న మనుధర్మ శాస్త్రం. ఆర్య బ్రాహ్మణులు నిర్మించిన కుల వ్యవస్థ వల్ల ఈ దేశం సర్వ నాశనమైంది. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి ఆధిపత్య కుల మహిళా సంఘాలు, అగ్రకుల స్త్రీ వాదులు సిద్ధంగా లేరు.
స్త్రీలందరూ ఒక్కటే అనే బూటకపు వాదన వెనుక బ్రాహ్మణవాద కుట్ర ఉంది. ఆర్య బ్రాహ్మణ స్త్రీలు, మూలవాసి స్త్రీలు(ఎస్సి, ఎస్టి, బి.సి, మైనార్టీ స్త్రీలు) స్వాభావికంగానే వేర్వేరు. రాజకీయంగా జాతీయస్థాయి నాయకులుగా ఎదిగిన స్త్రీలంతా ఆధిపత్య కులస్థులే. బహుజన రాజకీయ చైతన్యం వల్ల బహిన్‌ ‌జి మాయావతి, మాన్యశ్రీ మీరాకుమారి మాత్రమే అందుకు మినహాయింపు. రాజకీయంగా ఎదగాలని ఆరాటపడుతున్న ఆధిపత్య కులాల స్త్రీలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల వల్ల అగ్రకుల స్త్రీలే లాభ పడతారని చేస్తున్న విమర్శను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలని చూస్తుంది.

దళిత బహుజన మైనార్టీ స్త్రీలకు ఈ చట్టంలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని బహుజన స్త్రీలు అడుగుతున్న డిమాండ్‌ను అగ్రకుల మహిళా సంఘాలు అవహేళన చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌, ‌పార్టీలు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతున్నాయి. బి.సి లకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల జరిగిన నష్టం కళ్ళముందు కనపడుతుంటే మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్లలోట బి.సి మహిళల వాటా ఎంతో స్పష్టంగా చెప్పాలని అడగడంలో తప్పేముంది? స్త్రీలంతా ఒక్కటే అనే సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బి.సి, స్త్రీల మీద అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు అగ్రకుల స్త్రీల మీద జరిగితే స్పందించినంత తీవ్రంగా ఎందుకు స్పందించరు? కులాన్ని బట్టి స్పందించడమే మహిళలంతా ఒకటి కాదని నిరూపిస్తుంది.

భారత జనజీవనంలో సగభాగమైన మహిళలను దశాబ్దాలుగా అణచివేసిన చరిత్ర వెనుక బ్రాహ్మణీయ (అ)ధర్మశాస్త్రం ప్రధానంగా పని చేసిందన్న సత్యం మరువ లేనిది. ‘‘న స్త్రీ స్వాతంత్ర మర్హతి’’, ‘‘న స్త్రీ విద్యార్హతి’’ అంటూ రాజశాసనంగా మహిళపై పురుషాధిక్యతను స్థిరపరిచింది. ఈ కారణంగా అనేక సాంఘిక కట్టుబాట్లకు, వివక్షలకు మహిళలు గురికావాల్సి వచ్చింది. మనుధర్మం బ్రాహ్మణ స్త్రీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బి.సి స్త్రీలను కూడా బానిసలను చేసింది. ఇప్పటికీ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్త్రీలు అణచివేతకు గురవుతున్నారంటే దానికి ఆర్య బ్రాహ్మణవాదమే కారణం. ఆర్య బ్రాహ్మణులు మెజారిటీ ప్రజలైన దేశ మూలవాసి స్త్రీలను బానిసలను చేసి అజ్ఞానంలో ఉంచుతున్నారని గుర్తించింది మహాత్మా పూలేగారు. ఆయనే మొట్టమొదటిసారిగా శూద్రులకు, అతిశూద్రులకు పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించారు. వర్ణ ధర్మం, కుల ధర్మం బ్రాహ్మణవాద కుట్రని, చదువుకునే హక్కు కులమతాలకు అతీతంగా స్త్రీ పురుషులకు సమానంగా అందించాలని ఆయన వాదించారు, ఆచరించారు. ఈ విధంగా స్త్రీ విముక్తి కోసం త్యాగపూరిత పోరాటం చేసిన ఈ విప్లవకారున్ని అగ్రకుల స్త్రీ వాదులు స్మరించుకోరు. 1848 లో జ్యోతిరావు పూలే స్థాపించిన పాఠశాలల్లో అధ్యాపకురాలిగా పనిచేసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే శూద్ర అతిశూద్ర స్త్రీలకు విద్య నేర్పడమే కాకుండా వారి విముక్తి కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన తొలి మహిళా నాయకురాలు.

మానవ హక్కులు, పౌర హక్కుల అవగాహనతో పాటు ఆర్య బ్రాహ్మణ కులవ్యవస్థకు మూలమైన భావజాలం మార్చితే తప్ప స్త్రీ పురుష సమానత్వం సాధించలేమన్న మూలవాసి తత్వ చింతనను అభివృద్ధి చేసిన జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే బహుజన ప్రజలతో పాటు అన్ని వర్గాల స్త్రీలకు ఆదర్శం కావాలి. స్తీల విద్య హక్కుల కోసం పాశ్చాత్య దేశాల్లో 1910.తర్వాత ఉద్యమాలు మొదలుకాగా అంతకన్నా కొన్ని దశాబ్దాల ముందే మన దేశంలో స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం కోసం ఉద్యమం నడిపిన గొప్ప విప్లవవాది సావిత్రిబాయి పూలే. 1917 నుండి బాబుసాహెబ్‌ అం‌బేడ్కర్‌, ‌పెరియార్‌ ‌రామసామిలు మహిళా హక్కుల కోసం ఉద్యమం నిర్వహించారు. సమాజ పరివర్తనం కోసం ఉద్యమించిన చాకలి ఐలమ్మ చరిత్రను ఆ క్రమంలోనే అర్థం చేసుకోవాలి. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మహిళా ఉద్యమం కొత్త మార్గం నిర్దేశించుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, న్యాయం అనే ఆధునిక భావనతో ఈ దేశం నడవాలంటే అందుకు విరుద్ధమైన అసమానతల బ్రాహ్మణవాదానికి, మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ క్రమంలో మన దేశానికి ప్రత్యేకంగా ఒక మహిళా దినోత్సవం అవసరం ఉందని గుర్తించాలి అందుకోసం మనం ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ ‌చేయాలి. జాతీయ మహిళా దినో త్సవం ద్వారా ప్రజలను స్త్రీ పురుష సమాత్వం కోసం చైతన్యం చేసినప్పుడే మహిళలపై దాడులు, అత్యాచారాలు ఆగుతాయని గుర్తించి ప్రతి ఒక్కరు ఆ దిశగా ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం.

Leave a Reply