
- కేసీఆర్ సర్కార్తీరును దుయ్యబట్టిన
- అఖిలపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు
- కొట్లాడితే కాని నిధులు విడుదల కావు : కోదండరామ్
- విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు: ఆర్. కృష్ణయ్య
- విద్యార్థుల ఉసురుపోసుకుంటున్నారు : వి హనుమంతరావు
విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని అఖిలపక్ష నాయకులు తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల కష్టాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఫీజు రీయింబర్స్ మెంట్‌పై ప్రభుత్వం నాటకమాడుతున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద జరిగిన విద్యార్థి మహా ధర్నాలో వారు పాల్గొన్నారు. ఇంజనీరింగ్, పిజి , డిగ్రీ, ఫార్మసీ కోర్సులలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలని, స్కాలర్షిప్ చెల్లించాలని వారు డిమాండ్ చేసారు. వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ, ఎమ్మెల్సీ రాములు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి. హనుమంతరావు హాజరై విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరం పెండింగ్ ఫీజులతో పాటు ఈ ఏడాది ఫీజులను కూడా విడుదల చేయాలని లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధం అవుతాం అన్నారు. అవసరమైతే పరీక్షలను బై కాట్ చేస్తామని హెచ్చరించారు. చదువుకోవడానికి విద్యారంగానికి నిధులు కేటాయించకుండాప్రాజెక్టులకు కమిషన్లు వచ్చే పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ విద్యా రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారన్నారు. చదువుకోవడానికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదన్నారు.
పేద, బలహీన వర్గాల పిల్లల చదువులను నాశనం చేయడానికి వారిని విద్యావంతులుగా చేయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. అన్ని కోర్సుల విద్యార్థుల చదువులకు సర్కార్ పూర్తిగా నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ కొట్లాడితే మాత్రమే ఫీజు రీయింబర్స్ రిలీజ్ అవుతాయని విద్యార్థులకు ఉద్బోధించారు. విద్యార్థుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రీయింబర్స్‌మెంటు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదన్నారు. నిధుల విడుదలపై ప్రభుత్వం నాటకమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసారు.నిధులు విడుదల చేస్తున్నట్లు చెబుతూనే, రిలీజ్ ఆర్డర్ మాత్రం పెండింగ్‌లో పెడుతున్నదని కోదండరామ్ అన్నారు. విద్యార్థులు కొట్లాడితేనే గాని నిధులు విడుదల కావన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచాలన్నారు. ప్రభుత్వం ఎక్కడ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుతుందో అక్కడ వెంటనే పనిచేస్తున్నదన్నారు. మిషన్ భగీరథ పథకం వల్ల ఇతర సంక్షేమ పథకాలు దెబ్బతిన్నాయని తెలిపారు. మద్యం అమ్మకాలకు విపరీతమైన రాయితీలు ఇచ్చి పేద కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యేలా ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కోసం అన్ని పార్టీలు అసెంబ్లీలో లేవనెత్తి అని, ఈ ఆందోళనను ముందుకు తీసుకుపోవాలని కోరారు.
బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థలో వెనక బడ్డ రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.రాష్ట్రంలో గతంలో విద్యారంగానికి పది శాతం బడ్జెట్ ఉంటే ఇప్పుడు 6.8 శాతానికి ఈ ప్రభుత్వం తగ్గించిందన్నారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి విద్యార్థుల స్కాలర్‌షిప్పుల విషయంలో సోయి లేదని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం ఇప్పటికి ఊరికొక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కెసిఆర్ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారన్నారు. ఎల్. రమణ, రాములునాయక్ మాట్లాడుతూ కేవలం కాలేశ్వరం ప్రాజెక్టు పనులకు మాత్రమే ప్రభుత్వం నిధులు ఇస్తున్నదన్నారు. రీయింబర్స్మెంట్ నిధుల్లో కమిషను రానందున 12 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తా అని అంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అవి భర్తీ చెయ్యరా అని ప్రశ్నించారు. విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తే కేసీఆర్ పాలన ఉండదన్నారు. నిజామాబాద్ పసుపు రైతుల కన్నెర్ర చేస్తే ఏం జరిగిందో ఒకసారి వారు ఆలోచించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, రామ్ కోటి, భూపేష్ సాగర్, అనిత, కోటశ్రీనివాస్, జయంత్ రామలింగం పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.