బీజేపీ నిరసనలకూ పోలీసులు సహకరించాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రానున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్తో బీజేపీకి రాజీ కుదిరిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల డిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆ విషయం సీఎంనే అడగాలని వ్యాఖ్యానించారు.
రైతుల సమస్యలపై నిర్వహించిన భారత్ బంద్‌లో టీఆర్ఎస్ మంత్రులు పాల్గొనడంపై అది రైతుల బంద్ కాదనీ, సర్కారీ బంద్ అని పేర్కొన్నారు. భారత్ బంద్‌లో పాల్గొన్న కేటీఆర్, కవితలను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలనీ, ఇకపై బీజేపీ చేసే నిరసనలకు సైతం పోలీసులు సహకరించాలని స్పష్టం చేశారు. భారత్ బంద్‌లో స్వయంగా మంత్రులు పాల్గొనడం సిగ్గు చేటనీ, రాజకీయంగా మోడీని ఎదుర్కోలేకనే వ్యవసాయ చట్టాల పేరుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.
సీడ్ డెవలప్మెంట్ కోసం సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఐటీసీ కంపెనీని ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు నష్టం చేసే చర్యలను బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం కలలో కూడా చేపట్టదనీ, రాహుల్‌గాంధీ, కమ్యూనిస్టులు అడ్డుకున్నా కేంద్ర ప్రభుత్వం అనుకున్నది చేసి తీరతామన్నారు. ఎంఎస్పీకి చట్టబద్దత కల్పిస్తామనీ, మార్కెట్ యార్డులను ప్రోత్సహిస్తామనీ, వేర్ హౌసింగ్‌ల కోసం తెలంగాణకు నిధులు మంజూరు చేశామని వివరించారు. కిసాన్ బ్రాండ్ పేరుతో రామగుండం పరిశ్రమ నుంచి తెలంగాణ, ఏపి రైతులకు యూరియా అందించబోతున్నట్లు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.