Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ఆగమాగం..!

  • లాక్‌డౌన్‌పై ఎటూ తేల్చని సర్కార్‌
  • ‌పట్నం వదలి పల్లెలకు పరుగులు తీస్తున్న జనం
  • మంత్రు రోజుకో తీరు మాటలతో అయోమయం
  • ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ‌భరోసా ఇవ్వాలంటున్న నగర ప్రజలు

హైదరాబాద్‌ ‌మహా నగర ప్రజలు భయం గుప్పిట్లో నివసిస్తున్నారు.  ఓ వైపు రోజురోజుకూ విజృంభిస్తున్న కొరోనా మహమ్మారి… మరోవైపు ప్రజల జీవనానికి రక్షణ కల్పించడంపై భరోసా ఇవ్వని ప్రభుత్వం దీ•ంతో నగర జీవులు క్షణమొక యుగంగా బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌మహానగరంలో ప్రతీ రోజు దాదాపు 1000కి పైగా కేసులు నమోదవుతుండంతో లాక్‌డౌన్‌ ‌భయంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. వారం రోజుల క్రితం నుంచి గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కేసుల సంఖ్య భారీగా పెరడగంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధించక తప్పని పరిస్థితి నెలకొందనీ, దీనిపై సీఎం కేసీఆర్‌కు వైద్య, ఆరోగ్య శాఖ పక్షాన నివేదిక ఇచ్చినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ ‌వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. దరిమిలా స్వయంగా సీఎం కేసీఆర్‌ ‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో కొరోనా నియంత్రణపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా హైదరాబాద్‌ ‌నగరంలో మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామనీ, దీనిపై విధివిధానాలను రూపొందించే బాధ్యతను ప్రభుత్వ ఉన్నతాధికారులకు అప్పగించినట్లు ప్రకటించారు.
సీఎం ప్రకటనతో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధించడం తప్పదన్న నిర్ణయానికి వచ్చిన మహా నగర ప్రజలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ ‌మూడ్‌లోకి వెళ్లిపోయారు. భారీగా పెరుగుతున్న కొరోనా కేసుల నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ ‌విధిస్తారనే వార్తలు జోరుగా ప్రచారం కావడంతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కిరాణా దుకాణాలు, సూపర్‌ ‌మార్కెట్ల వద్ద జనం నిత్యావసరాల కోసం బారులు తీరుతున్నారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఒక్కసారికే కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌కాలానికి సరిపడా సరుకులు కొనాలనే ఆత్రుతతో ఎంత దూరమైనా వెళ్లి సరుకులను కంటున్నారు. ఇదిలా ఉండగా, జీవనోపాధి వెతుక్కుంటూ మహా నగరానికి వలస వచ్చిన ప్రజలు ఇక ఇక్కడ ఉంటే బతుకుబండి గాడిన పడే పరిస్థితి లేదని భావించి సాధ్యమైనంత త్వరగా పట్నం వదలి వెళుతున్నారు. ఏదోలా ఇక్కడి నుంచి బయటపడాలన్న భావనతో ఇళ్లు ఖాళీ చేసి అందుబాటులో ఉన్న వాహనాల్లో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దశాబ్దాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడి సొంతింట్లో నివసిస్తున్న ప్రజలు మినహాయిస్తే మిగతా వారంతా చలో పల్లెటూరు అంటూ పిల్లాపాపలతో మూటాముల్లె సర్దుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు.

హైదరాబాద్‌ ‌నగరంలో పరిస్థితి ఇలా ఉండగా, నగరం నుంచి సొంతూళ్లకు పయనమైన వారిని స్వగ్రామాలకు అనుమతించే పరిస్థితులు లేకపోవడం గమనార్హం. హైదరాబాద్‌ ‌నుంచి ప్రజలు సొంతూళ్లకు వస్తున్నారంటేనే ఆమ్మో హైదరాబాద్‌ ‌నుంచా అనే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు సమీపంలోని ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌, ‌మెదక్‌, ‌నల్లగొండ జిల్లాల నుంచి వలస వస్తున్న వారిపై నిఘా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వరంగల్‌ ‌జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.లలితాదేమి ఈమేరకు హైదరాబాద్‌ ‌నుంచి వచ్చే వారిని గుర్తించి హోం క్వారంటైన్‌ ‌చేయాలని పట్టణ, గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం‌లు, ఆశ వర్కర్లను ఆదేశించినట్లు స్వయంగా మీడియాకు వెల్లడించడం గమనార్హం. గతంలో విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల ఏ విధమైన నిఘా  ఉంచామో హైదరాబాద్‌ ‌నుంచి వచ్చే వారి పట్ల సైతం అలాంటి నిఘానే ఉంచుతామని వెల్లడించారు.

ఇక హైదరాబాద్‌లో కొరోనా పరీక్షల విషయానికి వస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకుందనే చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా వైరస్‌ను తక్కువ అంచనా వేయడం, సరైన సంఖ్యలో పరీక్షలు నిర్వహించకపోవడంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న కేసులు ఇప్పుడు భారీ సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు అనుమానితులకు ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలకు అనుమతి ఇచ్చినప్పటికీ పెరిగిపోతున్న పాజిటివ్‌ ‌కేసుల దృష్ట్యా ల్యాబ్‌ల యజమానులపై ఒత్తిడి తెచ్చి పరీక్షలు చేయకుండా నిలిపివేసినట్లు మీడియాలో రోజుకో విధమైన కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై మంత్రి ఈటల లేదా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

దీనికి తోడు రాష్ట్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా రోజుకో రకమైన ప్రకటనలు చేయడం ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తున్నది. గ్రేటర్‌ ‌పరిధిలో లాక్‌డౌన్‌ ఉం‌టుందని ఒకరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశం లేదని మరొకరు విభిన్న ప్రకటనలు చేస్తూ నగర జీవుల బతుకులతో ఆటలాడుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌ ‌మహా నగరంలో లాక్‌డౌన్‌ ఉం‌టుందో లేదో తెలియక జనం నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్‌ ‌హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ ఉం‌డదని ప్రజలకు భరోసా ఇవ్వడంలో చేస్తున్న తాత్సారంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ ‌నగరంలో నివసిస్తున్న దాదాపు కోటి మందికి పైగా ప్రజల్లో సగం మంది ఇప్పటికే నగరం విడిచి సొంతూళ్లకు వెళ్లిపోగా మిగిలిన ప్రజలు భయంభయంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు స్పందించడం లేదని సగటు నగర జీవి సందేహం వ్యక్తం చేస్తున్నాడు.

Leave a Reply