- పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం
- ఘటనపై స్పందించిన మంత్రులు కెటిఆర్, తలసాని
- విచారణకు ఆదేశించిన జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మి
హైదారబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : వీధికుక్కల బెడద నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అంబర్‌పేట్‌లో వీథికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. బాలుడి కుటుంబానికి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి సంతాపం తెలిపారు. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి చాలా బాధాకరమని అన్నారు. సిటీలో కుక్కల నియంత్రణ కోసం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతీ మున్సిపాలిటీలోనూ వీధి కుక్కల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు.
దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. కాగా వీధి కుక్కలు దాడి చేయడంతో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంబర్‌పేట ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి వెంటనే విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్‌లో వీధికుక్కల బెడదపై విమర్శలు వస్తుండటంతో ఈ ఘటనపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఘటనపై గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని వీధి కుక్కల బెడదకు నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నగరంలోని కుక్కలకు స్టెరిలైజ్ చేసేందుకు ప్రతిరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని, ఇప్పటికే 4 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాలుడి మృతి చెందిన ఘటనపై వెంటనే ఎంక్వయిరీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడు ప్రదీప్(4) కుటుంబానికి సంతాపం తెలిపారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్యను పరిష్కరిం చేందుకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.