Take a fresh look at your lifestyle.

సప్తపర్ణి’లో కనుల విందుగా ‘తొవ్వ ముచ్చట’

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సప్తపర్ణిలో ‘కారా’ ఉత్సవాలలో భాగంగా ప్రొ.జయధీర్ తిరురుమల రావు నాలుగు దశాబ్దాలుగా సేకరించిన విలువైన వస్తువుల ప్రదర్శన వీక్షకులను ఆకర్శిస్తున్నాయి.

–      కందుకూరి రమేష్ బాబు

 ప్రొ.జయధీర్ తిరుమల రావు అంటే తెలుగు నాట ఒక ఖజానా. ఒక వాజ్మయం. ఒకరే ఒక సాంస్కృతిక దళం. వారు జానపద, గిరిజన, ఆదివాసీ -సాహిత్య సంగీత మౌఖిక రూపాలకు సంబంధించిన ఎన్నో అంశాల్లో పరిశోధనలకు పేరొందిన మేధావి. ప్రభుత్వాలు, సంస్థలు చేయాల్సిన పనిని తన భుజానికి ఎత్తుకుని పదుగురికి చేరువ చేస్తున్న కార్యకర్త. వారు ఎందరికో ఆధారం. వారిది నిరంతర తొవ్వ ముచ్చట. వారి నాలుగు దశాబ్దాల కృషి కవులు, రచయితలు, విద్యార్థులు, పరిశోధకులకు ఒక నిరంతర  ప్రేరణ. స్ఫూర్తి. ఒక్కరే ఒక సైన్యంగా చేసిన వారి అపారమైన కృషికి దాఖలా సప్తపర్ణిలో చూడవచ్చు. నవంబర్ 1న ప్రారంభమైన ఈ ప్రదర్శన నేటితో ముగుస్తోంది.

సప్తపర్ణి గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్న ‘కారా’ ఉత్సవాల్లో భాగంగా కొద్ది మంది చిత్రకారుల పెయింటింగ్ లతో పాటు తిరుమలరావు గారి సేకరణ ఇక్కడ ఎంతో అందంగా ప్రదర్శితమైంది. వీటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి, డోక్రా వస్తువులు. రెండు, ప్రాచీన రాత ప్రతులు. మూడు, గిరిజన సంగీత వాయిద్యాలు. ఇవన్నీ ఎన్నో వ్యయ ప్రయాసలకు లోబడి వారు సేకరించిన అస్తిపాస్తులని చెప్పవచ్చు. అవన్నీ చూడటం అంటే వాటి గురించి తెలుసుకోవడమే కాదు, మనం ఎంతటి ఘనమైన వారసత్వానికి వారసులమో కూడా అనుభూతిలోకి తెచ్చుకోవడం. వాటి గురించి లోతుగా తెలుసుకోవాలన్న జిజ్ఞాసకి బీజం వేసుకోవడం కూడా.

ఈ ప్రదర్శనలో ఉన్నవాటిని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. గిరిజనులు, ఆదివాసీలు తాము ప్రదర్శనలో వాడేవి ఇక్కడ చూస్తాం. వారు వివిధ క్రతువుల్లో ఉపయోగించేవి ఏమిటో తెలుసుకుంటాం. అలాగే, అవన్నీ కూడా వివిధ వాయిద్యాలతో అనుసంధానం అయ్యాయన్న విషయమూ బోధపడుతుంది. ఈ మూడు రకాలగా వాటిని తిరుమల రావు ఇక్కడ ఒక్కచోటే ప్రదర్శించడం విశేషం.

ఆధునిక జీవితంలో నగరజీవుల విజ్ఞానం, విహారం, వినోదం అంతా కూడా ప్రజలకు, ప్రజా సంస్కృతికి దూరంగా మారుతున్న తరుణంలో ప్రో.జయధీర్ తిరుమల రావు కృషి అసలు సిసలు జీవన వికాసానికి ఆధారభూతమైన వాటిని చూపుతోంది. వారి ఏదో ఒక రీతిలో అవకాశం దొరకబుచ్చుకుని ప్రదర్శిస్తూ ఉన్నారు. తన సేకరణతో మన హృదయలను పరిశుభ్రం చేయపూనుకున్నారు. వాటిని చూడటం ఒక అనుభవం. ఒక వికాసం. నేడు చివరి రోజే ఐనప్పటికీ, పిల్లలతో కుటుంబ సమేతంగా వీలుచూసుకొని సందర్శించడం ఒక మంచి అనభవం.

ఈ సేకరణ ఒక చోట ఎల్లవేళలా ఉండేందుకు ఒక శాశ్వత ప్రదేశం అవసరం. నిరంతర ప్రదర్శనకు యోగ్యంగా ఒక మ్యూజియం ఏర్పాటు మరెంతో ఉపయోగం. ఆ దిశలో తిరుమల రావుగారికి భాసటగా నిలవాల్సిన అవసరం మనందరిపై  ఉన్నదని కూడా గుర్తుంచుకోవాలి.

అన్నట్టు, సప్తపర్ణి రోడ్డు నంబర్ 8 బంజారాహిల్స్ లో ఉంటుంది. సందర్శనా వేళలు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు. ఈ ఆదివారంతో ముగుస్తుందని గమనిక.

Leave a Reply