Take a fresh look at your lifestyle.

‘‘‌సప్తపది..’’

ఒక ఇంటి వారయ్యే ప్రతి జంట
కలిసి వేసే ఏడడుగుల నడక
ఒకరికొకరు తోడంటూ
అరుంధతి సాక్షిగా చేసుకున్న బాస
యవ్వనపు ప్రాయములో
పెళ్లిపందిరి మండపంలో
అదొక జ్ఞాపకాల మూట

కదిలే కాలానికి కళ్లెమెవ్వడేస్తాడు
జీవిత ప్రవాహాన్ని ఆపేవాడెవ్వడుంటాడు

ఎగిసిపడే దాంపత్య కడలి అలల్లో
ఎన్నెన్ని ఎత్తుపళ్లాలు,
మరెన్ని ఒడుదుడుకులు
ఆర్థిక అవసరాలు, స్వంతింటి కలలు
పిల్లలు, చదువులు, పెంపకాలు

తలకు మించిన భారమైనా
తడిసి మోపెడు అప్పులయినా
విదేశీ చదువు మోజుల్లో
మోసినా, మోయలేకున్నా
భుజాలపైవేసుకునే భారమది,భాద్యతది

రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోతాయి
సొంత గూళ్లను కట్టుకుంటాయి
పరామర్శలు, పలకరింతలు
క్రమంగా పలచబడతాయి

ఒంటరితనం కలుక్కుమంటున్నా
వయస్సుతెచ్చినఅనారోగ్యంవేటాడుతున్న
బాగున్నామనే,వారు బాగుంటే చాలనే
అబద్ధాలే అక్కడకు బట్వాడవుతాయి

మజిలీ చివరిదయినప్పుడు
అడుగులు తడబడుతున్నప్పుడు
ఆసరగా వచ్చిన మూడో కాలుతో
నడిచే సహభాగస్వామితో
ఏడడుగులు ఎన్ని అడుగులో మరి
మాంళ్యం తంతునానేనా..మంత్రాలు
మనసులో కదులుతునే ఉంటాయి

– డా:పాక వెంకటేశ్వర్లు, 9849436891
2-9-270, హన్మకొండ

Leave a Reply