Take a fresh look at your lifestyle.

‌గ్రామ బొడ్రాయి సాక్షిగా..!

సతికిల పడ్డ సన్నకారు రైతులు
చితికిపోయిన చిన్ని కర్షకులు
వ్యతల పాలవుతున్న వలస కూలీలు
కుమిలి పోతున్న పల్లె పుత్రులు !

చెమటతో చెలిమి చేస్తున్న కార్మికులు
సత్తువుడిగి క్షోభిస్తున్న శ్రామికులు
బక్కచిక్కిశల్యమైన వడ్రంగులు
నెర్రెల చెరువై పోతున్న చాకి రేవులు  !

కత్తితో గోళ్లు గీల్లుకుంటున్న మంగలి
తుప్పపట్టిన కుట్టు మిషన్లతో దర్జీలు
చావు డప్పులతో పేద గూడెమన్నలు
గుడిసె తూట్లు లెక్కేస్తున్న మేదరన్నలు !

కొలిమి కుమిలి కమిలి..
అనాథలా పోతున్న అవుసులోల్లు
కాళ్ళ కింద నలిగిన మన్నులా..
ఊపిరాడక నరకయాతనలో కుమ్మరన్నలు !

భారంతో అలిసి ఒగిరి పోతున్న..
వ్యవసాయ కూలీ అతుకుల బతుకు
ఒడ్డున పడ్డ చేపలా గిలగిల..
కొట్టుకుంటున్న ముది‘రాజు’ ధీనులు !

బురదమయమైన ఎరుకలి బతుకులు
చెదలు పడుతున్న గౌడన్న మోకులు
ఆధారమే తెగిపోయిన సాలోల్ల దారాలు
బండి గిలక ఎగిరిపడుతున్న దీన రైతన్నలు !

ఎక్కెక్కి ఏడ్చి ఎడారైన పల్లెతల్లి
జనవిస్పొటనంతో పెళుతున్న పట్నాలు
ముళ్ళు కర్ర పట్టే చేతిలో సెల్‌ ‌తిష్టలు
నాగలి పట్టే చేతిలో ట్రాక్టర్‌ ‌స్టీరింగులు !

పల్లె కట్టిన చీరకు అంటిన..
కూలాల మురికిని చాకిరేవుపై..
కసితో బండపై బాది శుభ్ర పరచాలె !

గ్రామ తలపై కట్టిన..
అసమానతల జడల ఉండలను..
మంగలి కత్తితో గుండి గీకాలె !

ప్రేమానురాగాల దారాలతో..
నేతన్న జన సింగిడి రంగుల చీరలు నేసి..
గ్రామదేవతకు అలంకరింపజేయాలె !

ముత్యాలమ్మ సాక్షిగా..
కట్ట మైసమ్మ దీవెనతో..
పోచమ్మతల్లి సల్లని ఓడిలో..
ఊరు వాడంతా పనిపాటలతో..
సంబరాల ఊయల్లో ఊగి తూగాలె !

dr burra madhusudhan reddy
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, కరీంనగర్‌, 9949700037

Leave a Reply