Take a fresh look at your lifestyle.

ఇంకెక్కడి సంక్రాంతి శోభ

మార్కెట్‌ ‌మాయాజాలం…కోడి పందాల ఇంద్రజాలం…

మకర సంక్రాంతి అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణంలో మరణించిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారన్నది హిందువుల నమ్మకం. ఆ నమ్మకాలు ఎలా ఉన్నా ఇప్పుడు ప్రజలు ఏ తప్పూ చేయకుండానే నరకాన్ని అనుభవిస్తున్న రోజులివి. సూర్యమానం, చాంద్రమానం ప్రకారం తిధి వార నక్షత్రాలను గుణిస్తారు. మనది చాంద్రమానం. మకర సంక్రాంతికి గ్రామీణ వాతావరణం అనువైనది. అసలు పండుగలంటేనే గ్రామాల్లోనే హడావుడి ఉండేది. ఇప్పుడు ఆ సంస్కృతి అంతా గ్రామాల్లో కనుమరుగు అయిపోయి పట్టణాలకు పాకింది. పట్టణాల్లో కూడా శివారు ప్రాంతాల్లోనే కనిపిస్తోంది. చేతిలో డబ్బు ఉంటేనే పండుగ. పండుగ వాతావరణం ఇప్పుడు ఎక్కడా కానరావడం లేదు. అందుకు ఆర్థిక ఇబ్బందులు కారణం. ప్రస్తుత పరిస్థితులకు కొరోనా కారణమని మనం చెప్పుకుంటున్నా, కరోనా కన్నా కర్కోటకంగా వ్యవహరించే వారి వల్లనే జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మకర సంక్రాంతికి గ్రామాల్లో ఇళ్ళ ముందు రంగవల్లికలు, హరిదాసుల కీర్తనలు, ఆడపిల్లల గొబ్బి పూజలు, పిల్లల పంతగులు ఎగురవేసే కోలాహలం కనిపించేది. ఇప్పుడు అలాంటివన్నీ అక్కడక్కడ తప్ప అన్ని చోట్లా కనిపించడం లేదు. ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ధరలు పండుగ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ప్రజల్లో పండుగ సరదా మచ్చుకైనా కానరావడం లేదు. మనిషి జీవితం యాంత్రికంగా తయారైంది. అయితే, ఇది సగటు మనిషి జీవిత ముఖ చిత్రం. భూస్వాములు ఇప్పటికీ గ్రామాల్లో కోళ్ళ పందాలను నిర్వహిస్తున్నారు. కాయ్‌ ‌రాజా కాయ్‌ అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కోడి పందాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వాలు ప్రకటించడం మామూలే, అవి యథేచ్ఛగా సాగిపోవడమూ మామూలే. ప్రజల్లో నమ్మకాలను, ఆనవాయితీలను ఆసరాగా చేసుకుని వాటిని సొమ్ము చేసుకోవడానికి ఇలాంటి తతంగాలను నడిపిస్తూ ఉంటారు. పేకాట ఎటువంటి జూదమో, కోడిపందాలు కూడా అలాంటి జూదమే. కానీ, చిన్న స్థాయిలో నాలుగు గోడల మధ్య ఆడేది పేకాట.

బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో జనం గుంపులుగుంపులుగా చేరేది ఆడించేవి కోడి పదాలు. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలకు పంటలు మట్టి పాలు అయినా సరే కోడి పందాలు వాయిదా పడవు. వడ్డీ వ్యాపారులు, కాంట్రాక్టు ఫార్మింగ్‌ ‌చేసేవారి వద్ద వద్దంటే డబ్బు ఉండటం వల్ల ఇలాంటి పందాలకు లోటుండదు. పోలీసులకు అన్నీ తెలుసు. ప్రభుత్వాధికారుల కనుసన్నల్లోనే ఇవి జరుగుతున్నాయి. ఆ మాటకొస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలోనే ఇవి సాగుతున్నాయి. ఏమైనా అంటే ఇది సంప్రదాయం అంటారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు ఆడాలన్న సంప్రదాయం ఎక్కడా లేదు. నాయకురాలు నాగమ్మ కాలంలో పలనాడులో ఈ క్రీడ ప్రతిష్ఠాత్మకంగా జరిగేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రతిష్ఠాత్మకంగా పోలింగ్‌ ‌జరిగి ఫలితాల కోసం నిరీక్షిస్తున్న సమయాల్లో ఫలానావారు నెగ్గుతారంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతున్నవే. ఆదాయం పన్ను శాఖవారు, ఆర్థిక శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడుల పేరిట హడావుడి చేస్తుంటారు. ఈ కోళ్ళ పందాల్లో ఐదొందల రూపాయిలు, రెండువేల రూపాయిల నోట్ల కట్టలను చేతులను నెప్పి పుట్టేలా లెక్కేస్తుంటారు.

- Advertisement -

ఇవన్నీ నిరంతర వార్తా స్రవంతుల్లో సామాన్యుని కంట పడుతున్నాయి. అలాంటిది అధికారుల కంట పడటం లేదంటే నమ్మగలమా! అలాంటివి అధికారుల దృష్టిలో పడినా ఏ ఎంపీగారో, మంత్రిగారి తాలూకు బంధువులో నిర్వహిస్తున్నప్పుడు ఆ ప్రదేశాలపై దాడులు చేసే సాహసాన్ని అధికారులు చేయలేరు. ఏళ్ళ తరబడి జరుగుతున్న తతంగం ఇది. కాల చక్రంలా ఏటా సంక్రాంతి రావడం, కోడి పందాలు సాగడం, కోట్లాది రూపాయిలు బెట్టింగ్‌లలో చేతులు మారడం సర్వసాధారణమై పోయింది. మన సంప్రదాయమంటూ రాజకీయ నాయకులు ప్రకటనలు జారీ చేస్తుంటారు. కోడి పందాలకు ఆంధ్ర, తెలంగాణ అనే తేడా లేదు. ఆంధ్రలో జరిగే ఈ పందాలకు తెలంగాణ రాజకీయ ప్రముఖులు పదిహేను రోజుల పాటు భీమవరం, తదితర పట్టణాల్లో హొటళ్ళలో రూంలు అద్దెకు తీసుకుంటారు. అక్కడ జరిగే కోడి పందాల కోలాహలంగా ఉంటాయి. ఈ పందాలతో పాటు మందు సరఫరా చేసే బార్‌లు, మాంసంతో తయారు చేసే తినుబండారాల విక్రయం హోరెత్తించే రీతిలో సాగుతుంటాయి.

ఇవి అన్నీ పబ్లిగ్గా జరిగేవే. అయినా సామాన్యులు ఏదైనా చిన్న ఉల్లంఘనకు పాల్పడితే లాఠీలు ఝళిపించే పోలీసులు ఇలాంటి వాటి జోలికి పొరపాటున కూడా వెళ్ళరు. అంతా ముందే ఏర్పాట్లు జరిగిపోతాయి. ఇలాంటి సంస్కృతిలో మనం పండుగలను చేసుకుంటున్నప్పుడు గ్రామాల్లో సంక్రాంతి శోభ ఉంటుందని ఆశించడం కల్ల. అంతేకాకుండా, రైతులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చిన కామందులే వీటిని నిర్వహిస్తుంటారు. ఇవి మనం ఇప్పుడు పబ్లిగ్గాచెప్పుకుంటూ ఉన్నా, పాతికేళ్ళ క్రితమే సినిమాల్లో చూసేశాం. ఇంత దారుణమైన పరిస్థితులలో పండుగ జరుపుకుంటున్న తరుణంలో సామాన్య రైతుల గోడు పట్టించుకునేదెవరు. మార్కెట్‌ ‌మాయా జాలంలో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు సామాన్య రైతును ఆదుకునేట్టు ఉండాలి. ఇందుకు పాలకుల్లో చిత్తశుద్ధి, సేవా భావం ఉండాలి. అది లేకపోవడం వల్లనే నిరవధిక ఆందోళనలు సాగుతున్నాయి. చిన్న చేపను పెద్ద చేప తిన్నట్టు చిన్న రైతులను పెద్ద రైతులు పీల్చుకుని తింటుండగా ఇక సంక్రాంతి శోభ ఎక్కడుంటుంది..

Leave a Reply