Take a fresh look at your lifestyle.

జీవన గమనంలో సం‘క్రాంతి’

‘‘‌సంక్రాంతి అంటేనే పల్లెలకు ప్రత్యేక కళ వస్తుంది ఇంటికి చేరిన ధాన్యరాశులతో రైతుల లోగిళ్ళు కళకళలాడుతున్న తరుణాన… కుటుంబమంతా సంతోషం వెల్లివిరిసేలా సంక్రాంతి సాక్ష్యాత్కారిస్తుంది. ప్రత్యేక రుచులతో వంటకాలు, భోజనాలు ఏడాదంతా గుర్తుండేలా చేస్తాయి. భారతావని అంతటా ఆనందంగా జరుపుకునే పండుగగా సంక్రాంతి గణుతికెక్కింది. రైతన్నలు ఆనందంగా తమ ఊరిలోని కళాకారులకు తమ కష్టంలో పాలు పంచుకున్న పశువులకు, పక్షులకు ఆహారాన్ని అందించడం ఆనవాయితీ.’’

సంక్రాంతి… తెలుగు వారి పెద్ద పండుగ. మనం జరుపుకునే పండగలన్నీ ఏదో ఒక దైవానికి సంబంధించినవే! కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. ఈ పండుగకు మూల పురుషుడు రైతన్న. సంక్రాంతి కేవలం ఒక సంప్రదాయం కాదు. అది ఓ జీవన విధానం. వర్షాకాలం ముగిసి పంట చేతికి వచ్చే సమయంలో జరుపుకునే సంబరమిది. మూడు రోజుల వ్యక్తిత్వ వికాస మేళవింపు ఇది. తొలిరోజు భోగి…మలిరోజు సంక్రాంతి… మూడోరోజు కనుమ. సంక్రాంతి తో ముడిపడిన ప్రతి ఆచారంలోనూ ఎంతో కొంత నీతి బోధ ఉంటుంది. పరోక్షమైన హెచ్చరికలూ వినిపిస్తాయి. ఆ లోతుల్ని అర్థం చేసుకోగలిగితే, జీవితానికి అన్వయించుకుంటే… సంక్రాంతి ముగ్గులా జీవితం వర్ణభరితం.
సంక్రాంతి అంటేనే పల్లెలకు ప్రత్యేక కళ వస్తుంది ఇంటికి చేరిన ధాన్యరాశులతో రైతుల లోగిళ్ళు కళకళలాడుతున్న తరుణాన… కుటుంబమంతా సంతోషం వెల్లివిరిసేలా సంక్రాంతి సాక్ష్యాత్కారిస్తుంది. ప్రత్యేక రుచులతో వంటకాలు, భోజనాలు ఏడాదంతా గుర్తుండేలా చేస్తాయి. భారతావని అంతటా ఆనందంగా జరుపుకునే పండుగగా సంక్రాంతి గణుతికెక్కింది. రైతన్నలు ఆనందంగా తమ ఊరిలోని కళాకారులకు తమ కష్టంలో పాలు పంచుకున్న పశువులకు, పక్షులకు ఆహారాన్ని అందించడం ఆనవాయితీ.
కాలానుగుణంగా వస్తున్న మార్పులు పండుగ వాతావరణాన్ని మార్చేస్తున్నాయి. ••రువులు అనావృష్ఠి, అతివృష్టి అకాల వర్షాలు జీవనగమనాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అప్పులు, ఆత్మహత్యలతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. చాలామటుకు పల్లెల్లో వృథ్ధులు తప్ప యువత కనిపించటం లేదు. పల్లె లోగిళ్ళు అక్కడక్కడా ముగ్గులు లేక వెలవెలబోతున్నాయి. పట్టణముంగిట్లో అపరిమిత జనాభాతో నిత్యం రద్దీతో దర్శనమిస్తున్నాయి. విస్త •తమైన పట్టణీకరణ తో నగర ప్రజానీకం మన సంస్క•తి, సంప్రదాయాలకు దూరమౌతున్నా… కొన్ని పల్లెప్రాంతాల్లో మాత్రం నేటికీ నిజమైన జానపదుల పండుగ ఆవిష్క •తమవటం గొప్ప పరిణామమే.
తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్థరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు. వాళ్ళ వివరాలు తెలుసుకుందాం.
బుడబుక్కలవాడు :
ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది. పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిఝాములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ కొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీయకుండా ‘కట్టు’ కట్టి కట్టడి చేసేవాడు బుడబుక్కలవాడు. ఇతను తొలిఝామంతా పంటకు కాపలా కాసి రెండోఝాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆపని అప్పచెబుతాడు.
జంగం దేవర :
సాక్షాత్తు శివుని అవతార అంశలుగా భావించే ఈ జంగం దేవరలు శంఖ నాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు, ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర!
హరిదాసు :
హరిలో రంగ హరి అంటూ శ్రీకృష్ణుని గాధలను కీర్తిస్తూ ఇంటింటి ముంగిటికీ వచ్చీ పొలం వెళ్ళిన రైతుల క్షేమ సమాచారాలను వాళ్ళ ఇళ్ళలో తెలుపుతూ హరినామ సంకీర్తనామృతాన్ని దోసిళ్ళతో అందించి దోసెడు బియ్యాన్ని కృష్ణార్పణమంటూ స్వీకరిస్తాడు. ఆ యదుకులేశుని ఆశీస్సులను తన ద్వారా మనకు అందిస్తాడు.
గంగిరెడ్లు :
హరిదాసు ఇంటిలోని వారిని పలకరించి ఇంటి ఆడపడుచులు వేసిన రంగవల్లులపై కృష్ణపరమాత్మ ఆశీస్సులు కురిపించాక అయ్యగారికి దండంపెట్టు, అమ్మగారికి దండం పెట్టు, బాబుగారికి దండంపెట్టు, పాపగారికి దండం పెట్టు అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి, రైతు బ్రతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటి ముంగిట్లో ఎడ్ల ఆట ఆడించి ఇంటిలోని చిన్నా పెద్ద అందరినీ అలరించిన గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి ఊదుకుంటూ వెళ్ళిపోతారు.
పిట్టల దొరలు :
గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్లపోగు, కోతలరాయుడు పిట్టల దొర వస్తాడు. తనకు అరేబియా సముద్రంలో ఆరువేల ఎకరాల భూమి ఉందని, బంగాళాఖాతంలో బంగ్లాలున్నాయని ఆ బంగ్లాలకు వెళ్ళడానికి దారిలేక ఈ మధ్యనే బొప్పాయి కలపతో బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టించాననీ, అవన్నీ పిల్లలు అడిగితే ఇచ్చేస్తానని డంబాలు పోతాడు. పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు.
సోదెమ్మ :
సోదెమ్మ వెళ్ళిన తరువాత మన భవిష్యత్‌ ‌ఫలాలను చెబుతానంటూ ‘సోదె చెబుతానమ్మ సోదె చెబుతాను లేనీదేమీ చెప్పను తల్లీ’ అంటూ మన భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర, రవికల గుడ్డ పెట్టించుకుని పోతుంది.
భట్రాజులు :
ఆరు నెలల కష్టానికి ఫలితం వచ్చే వేళలో ధాన్యాన్ని ఇంటికి తరలించే సమయంలో రైతుల కళ్ళాలలోకి వెళ్ళి రైతుని ఆతని వంశాన్ని ఆతని పెద్దలనూ పొగుడుతూ ఆ రైతు కుటుంబం నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ పద్యాలల్లి ఆశీస్సులను వెదజల్లి ఓ కుంచెడో రెండు కుంచాలో ధాన్యాన్ని కొలిపించుకుని భుజాలకెత్తుకుంటారీ భట్రాజులు.
కొమ్మదాసర్లు :
అన్ని పనులు పూర్తి  చేసుకున్న తరువాత కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఈ కొమ్మదాసరోడు వచ్చి పెరట్లో చెట్టుకొమ్మనెక్కి ‘అప్పయ్య గోరో పడతా పడతా నే పప్పుదాకలో పడతా, పడతా పడతా నే పాతరగోతిలో పడతా’ అంటూ అల్లరి చేస్తాడు. అమ్మలక్కలు, పిల్లలు చెట్ల క్రింద జేరి క్రిందకు దిగమని బ్రతిమాలతారు. ఆ పాతరగోతి మీద పాతబట్టలు పరచమని చెప్పి వాటిని పట్టుకెడతాడు. ఇక్కడ పాతరగోతి గురించి చెప్పాలి.
పూర్వం పండిన పంటను ఇంటికి తెచ్చి పెరట్లో గొయ్యి తవ్వి ఆ గోతిలో తాటాకులు కొబ్బరాకులు పరిచి వాటిపైన గడ్డి పరిచి మెత్తను తయారుచేసి ఆపైన ధాన్యం పోసి నిలవచేసే వారు. దీనినే పాతరగొయ్యి అంటారు. పొద్దున్నుంచి పని చేసి చేసి అలసి పోయి సొలసి నిద్రబోతారేమో… ఇదే సందని దొంగలు ఆ గొయ్యిని తవ్వి పండిన పంటనంతా దోచుకుపోవచ్చు. మీ పాతరగొయ్యి సరిగా ఉందో లేదో! ఓ సారి చూసుకోండి అని చెప్పడానికి ఈ కొమ్మదాసరి వస్తాడు.
ఈ విధంగా ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మన పొలాలకు పహారా ఇస్తారు.
పంటల పండుగగా పేరుగాంచిన సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపు కో వాలంటే ప్రకృతి మాత కరుణించాలి. పంటలతో కళకళ లాడాలి. దేశానికి రైతే రాజన్న స్పూర్తినిస్తేనే నిజమైన పండుగ. రైతన్న మోమున కాంతి… అందరికీ సంక్రాంతి! మన సంస్క•తి, సంప్రదాయాలను కాపాడు కుందాం!!

image.png
చెన్నుపాటి రామారావు
విశ్రాంత పాత్రికేయుడు, సామాజిక విశ్లేషకుడు
విజయవాడ,9959021483

భోగి పండుగ
image.png
చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది బోగి పండగ. ఇది ఇతర పండుగల వలె తిథి ప్రధానమైనది కాదు. ఇది ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు, మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈపండుగ నాటికి ఇంటికి వచ్చేస్తాయి. వాళ్ళకు వ్యవసాయపు పనులు రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి వలసిన విశ్రాంతి లభించే కాలమిది. చేతి కందిన పంటను అనుభవించడానికి తెచ్చుకుని భోగభాగ్యాలు అనుభవానికి రైతులకు వీలు కలిగించే పండుగ ఇది. కనుకనే ‘‘భోగి’’ అని పేరు వచ్చింది. గోదా దేవి తిరుప్పావై రచన పూర్తి చేసిన ముప్పయవ నాడు రంగనాధుడు ప్రత్య క్షమై, ఆమెను వివాహమాడ తానని, సకల భోగాలు సమకూరుస్తానని చెప్పి, వివాహ మాడగా, వివాహ తంతు పూర్తికాగానే ఆమె స్వామి వారిలో ఐక్యం పొందుతుంది. అందుకే భోగి అని ఈ పర్వదినానికి పేరు. జన సామాన్యానికి భోగ భాగ్యాలు ఇచ్చే రోజని ప్రతీతి. బోగినాడు మేఘాధిపతియైన ఇంద్రపూజ చేయడం అనవాయితీ. బోగినాడు బలి చక్రవర్తి అణగిన దినంగా చెపుతారు. సాంప్రదాయాచరణ ప్రకారం ఈనాడు బోగిపీడ నివారణకై తెల్లవారగానే అభ్యంగన స్నానం చేయడం విధాయక కృత్యం. భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగు పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగు పండును బదరీఫలం రేగు చెట్టు, రేగు పండ్లు శ్రీ మన్నారాయణ  ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం  పిల్లలపై ఉంటుందని, భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగు తుందంటారు. తల పై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం పై భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతు లవుతారని విశ్వాసం. అలా చంటి పిల్లలకు తలంటుపోసి, బోగి పళ్ళు పోయడంతో దృష్టి పరిహారం చేస్తారు. కొత్త బట్టలు కట్టి, కుర్చీలో కూర్చుండచేసి, రేగు పళ్ళు, పైసలు, చెరుకు ముక్కలు, బోడికలు దిగువార బోస్తారు. ధనుర్మాసం నెల రోజులు ఆడపిల్లలు తయారు చేసిన గొబ్బి పిడకలు వేయడం, తెల్లవారగట్ల బోగిమంటలు వేయడం ఆచరించారు. భోగి మంటలలో వాడే దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆయురారోగ్యాలు వృద్ధి కలుగుతాయని విశ్వాసం. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు.. మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు చేకూరుతాయి. ఆడపిల్లలు తెల్లవారు జామున లేచి పెట్టే గొబ్బిళ్ళు, ఆర్ష కర్మలలో ప్రాముఖ్యం కలిగిన కళాభిజ్ఞత ఉట్టిపడే ముగ్గులు, పళ్ళ నైవేద్యాలు, బాజా భజంత్రీల వాద్యాలు ఎక్కడ చూసినా తెలుగుదనం ఉట్టిపడేట్టు చేసే పండగ ఇది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply