Take a fresh look at your lifestyle.

తెలంగాణలో సంక్రాంతి సందడి

కొత్త అందాలు సంతరించుకున్న పల్లెలు
తెలంగాణలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు  రంగురంగుల ముగ్గులు, ఇంటి ముందు గొబ్బెమ్మలతతో పల్లెలన్నీ కొత్త అందాలను సంతరించుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ ‌నగరంలో నివసిస్తున్న సమీప జిల్లాల ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని బుధవారం  తెల్లవారుజాము నుంచే చిన్నాపెద్దా అంతా కలసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు, హరిదాసుల ఆటపాటలతో పాటు పతంగులు ఎగుర వేస్తూ సంబరాలు చేసుకున్నారు.

మరోవైపు, ధనుర్మాసం సందర్భంగా దేవాలయాలలో గోదా కల్యాణాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రధాన దేవాలయాలైన యాదాద్రి, భద్రాచలంతో పాటు హైదరాబాద్‌లోని పలు ఆలయాల్లో గోదాదేవి శ్రీరంగనాథస్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా నెల రోజుల పాటు తిరుప్పావై వ్రతాన్ని నిర్వహించిన అర్చకులు గురువారం శ్రీరంగనాథునికి గోదాదేవితో కల్యాణ వేడుకను జరిపించారు. ఇదిలా ఉండగా, రాజధాని హైదరాబాద్‌లోని శిల్పారామాలలో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చేసిన ఏర్పాట్లు నగర ప్రజలను ఆకట్టుకున్నాయి. హైటెక్‌సిటీ, నాగోలు శిల్పారామాలలో పతంగులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో మార్మోగాయి.

Leave a Reply