నింగి తారలు ‘‘ఇల’’ దిగి
ముత్యాల ముగ్గులేసినట్లు…
హేమంత మేఘాలు కరిగి
పూల వర్షం కురిపించినట్లు …
బోగిమంటలు దివ్య కాంతులై
మానవాళికి వెలుగులద్దినట్లు …
పసుపు కుంకుమలు గొబ్బిళ్ళు
సిరి దేవికి స్వాగతం పలికినట్లు …
కర్షక స్వేదం ధాన్య రాశులై
గాదెల్లో ధగధగా మెరిసినట్లు
సంక్రాంతి పర్వదిన మాధుర్యం
అపూర్వ సాంప్రదాయ సౌరభం
పిల్లా పాపల ఆట పాటలు
ముత్తైదువల భక్తి పూజలు
పిండి వంటల గుమగుమలు
బంధు మిత్రుల శుభాకాంక్షలు
కొత్త జంటల సరస సల్లాపాలు
పసందు విందులు వినోదాలతో
ఇంటింటా ఆనందాల హరివిల్లులు
ఊరు వాడల ఉల్లాసాల వెల్లువలు
హరిదాసు కీర్తనల రాగాలు
బసవన్న సన్నాయి మోతలు
గాలి పటాల గగన విహారాలు
గంగిరెద్దుల చిత్ర విన్యాసాలు
కోడిపందాలు పౌరుష హాసాలు
జానపద కళాత్మక ప్రదర్శనలతో
అంబరాన్ని అంటేను సంబరాలు
ఈ.మూడు రోజుల వేడుకలు
మనమందరం ఒకే కుటుంబమై
ఆనందభరితంగా జరుపుదాం
మన సంస్కృతి, సాంప్రదయ
ప్రాశస్త్యం లోకమెల్లా చాటుదాం
(సంక్రాంతి పర్వదిన
శుభాకాంక్షలతో…)
– కోడిగూటి తిరుపతి
మొబైల్ నెం. 9573929493