వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సంక్రాంతి సందడి.. పల్లెల్లో ఘనంగా భోగి వేడుకలు

January 14, 2020

  • పల్లెల్లో ఘనంగా భోగి వేడుకలు
  • గ్రామాలకు చేరుకున్న పట్టణవాసులు
  • పతంగులు ఎగురేస్తూ యువత కేరింతలు

Sankranti buzzingజిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. భోగి, ర మకర సంక్రాంతి సపండగల కోసం పట్టణవాసులు పల్లెలకు చేరుకోవడంతో గ్రామాల్లో పండగ వాతావరణం వెల్లవిరిసింది. వరుసగా మూడు రోజుల పాటు తెలుగు లోగిళ్లు పండుగ శోభను సంతరించుకోనున్నాయి. కొత్త అల్లుళ్లు, బంధువుల రాకలతో పల్లెలన్నీ మురుస్తున్నాయి. ఇంటి ముంగిట గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, పిల్లల గాలిపటాల ఆటలు కనువిందు చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ అంటనేనే సంబురాలకు పేరు. లోకానికి వెలుగు ఇచ్చే సూర్యుడు ఉత్తరాయణంలో మకరరాశిలో ప్రవేశించిన శుభ సందర్భంగా సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకొంటారు. చలికాలం, వేసవి కాలానికి మధ్య ఉండే సంధికాలంలో వచ్చే ఈ పండుగ రైతులకు కూడా ప్రత్యేకమైనది. ఆరుగాలం కష్టపడి పొలాల్లో పండించిన ధాన్యరాశులు ఇంటికి వచ్చేస్తాయి. పంటల ఉత్పత్తుల విక్రయాలు జరిగి రైతు ముఖాల్లో ఆనందాలు కనిపిస్తాయి. సంక్రాంతికి ముందు వచ్చే భోగి పండుగ నాడు చెడును పారదోలి మంచిని స్వాగతించడంగా భావిస్తారు. ఉదయాన్నే భోగిమంటలు వేసి అందులో ఇండ్లలో ఉన్న పాత వస్తువులను వేసి తగులబెట్టడం ఆచారంగా వస్తోంది. ఆచార సంప్రదాయాలు పాటిస్తూ భోగి, సంక్రాంతి, కనుము (కరి) ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకొంటారు. దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలో అడుగు పెట్టే వేళ మూడు రోజుల పాటు పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. దక్షిణాయణం దేవతలు నిద్రించే కాలం. దీంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడల నివారణకు వీధుల్లో భోగి మంటలు వేసి ఇంట్లోని పాత వస్తువులను ఆహుతి చేస్తారు. మరుసటి రోజు నుంచి కొత్త వస్తువులను వినియోగిస్తారు. భోగి రోజున తెల్లవారుజామున పిల్లలకు తలస్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, నువ్వులు, నాణెళిలు, అక్షింతలు తలపై పోయడం ఆనవాయితీ. దీనివల్ల చిన్నారులకు మంచి జరుగుతుందని, ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. భోగిరోజే గోదాదేవీ రంగనాథస్వామిని వివాహాం చేసుకుందని, అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలతో విరాజిల్లిందని ప్రతీతి. భోగి రోజున మహిళలు వాకిళ్లలో కల్లాపి చల్లి ముగ్గులు వేసి రంగులను నింపడంతో గ్రామాల్లో లోగిళ్లు కలర్‌పుల్‌గా దర్శనమిచ్చాయి. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి,వాటిపై గరక, జొన్న, శనగ, కుసుమ మొక్కలను, నవధాన్యాలను, జీడిపండ్లు, రేగుపండ్లు ఉంచారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవీ తమ ఇండ్లకు వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతోంది. సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు. దీనినే ఉత్తరాయణం అంటారు. అందుకే సంక్రాంతి మహత్తరమైన పండుగ అని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణం వదులుతారు. కొత్త బియ్యం, బెల్లంతో చేసిన పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. మహిళలు ముగ్గులు వేసి, పిండి వంటలు చేస్తారు. చిన్నారులు పతంగులను ఎగురవేస్తారు. కనుము అంటే పశువు అని అర్థం. కనుము రోజును ఆనందోత్సవాలతో జరుపుకొంటారు. పశువులను అలంకరిస్తారు.

వాటికి పిండి వంటలను తినిపిస్తారు. బంధు, మిత్రులతో కలిసి కనుము పండుగ రోజున ప్రత్యేకంగా వింధు కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. మాంసంతో ప్రత్యేకంగా వంటలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వింధు భోజనాలు చేసి ఆ రోజున సంతోషంగా గడుపుతారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు ప్లలెల్లో హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలతో మార్మోగాయి. హరిలో రంగ హరి అంటూ వాయిద్యం వాయిస్తూ హరిదాసులు గ్రామాల్లో దర్శనమిచ్చారు. సంక్రాంతి పండుగను తమ సొంత గ్రామాల్లో జరుపుకోవడానికి పట్టణాల్లో ఉంటున్న ప్రజలు పల్లెలకు చేరుకున్నారు. పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. జీడి, రేగు పండ్లు, పిడుకలు, ఆవు పేడ, గొబ్బెమ్మలు, వివిధ రకాల రంగులు, మట్టి పాత్రలు, గరిక, బంతిపూలను విక్రయిస్తున్నారు. వివిధ రకాల గాలిపటాలు, చక్రీలు, దారాలు భారీగా విక్రయిస్తున్నారు. చిన్నారులు ఎంతో సంతోషంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. సంక్రాంతి రోజున పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నది. పండుగ ప్రారంభానికి నెల రోజుల ముందుగానే చిన్నారులు, యువకులు పతంగులను ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. పాఠశాలలకు సెలవులు రావడంతో మూడు రోజులుగా చిన్నారులు పతంగులను ఎగురవేయడంలో ఆనందంగా గడుపుతున్నారు. చిన్నారుల అభిరుచుల మార్కెట్‌లో మేరకు రకరకాల పతంగులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Tags: Sankranti buzzing, Great bonfire, celebrations, the countryside