Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందడి

  • నగరంలో లోగిళ్లలో భోగిమంటలు…పట్టణాల్లో, పల్లెల్లో ముగ్గుల పోటీలో వేడుకలు
  • రెండు రోజుల్లో సిటీ దాటిన  లక్షా 20 వేల వాహనాలు
  • హైదరాబాద్‌లో బోసిపోతున్న రోడ్లు
  • సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి బస్టాండ్లలో తప్పని పడిగాపులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : జంటనగరాల్లోనూ, పల్లెల్లోనూ సంక్రాంతి సందడి నెలకొంది. నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. గ్రామాలకు వెళ్లినవారు వెళ్లగా హైదరాబాద్‌లో ఉన్న వారు పండగ వేడుకల్లో నిమగ్నమయ్యారు. భోగి మంటలకు పిడకలు, గొబ్బెమ్మలకు కూడా అంతా రెడీమేడ్‌ ‌వస్తువులే చోటుచేసుకుంటున్నాయి. శిల్పారమంలో భోగిమంటలు ఆకట్టుకున్నాయి. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ ‌కమ్యూనిటీల్లో  నివసించే వారు ఒక్కచోటకు చేరి ముగ్గులు తీర్చిదిద్దారు. ఉదయమే పలుకాలనీల్లో భోగిమంటలు వేశారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు అందంగా దర్శనమిచ్చాయి. లోగిళ్ల ముందు ముత్యాల ముగ్గులు పలుకరించాయి. ఇప్పటికే చాలామంది నగరవాసులు సొంతూళ్లలో బంధువులతో కలిసి పండుగ చేసుకునేందుకు పల్లెబాట పట్టారు.

ఇక్కడే ఉన్నవారు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు.ఆవుపేడతో గొబ్బెమ్మలు చేస్తారు. పూలు, పసుపు, కుంకుమలతో అలంక రిస్తారు. గ్రామాల్లో ఆవులు, గేదెలు ఉంటాయి కాబట్టి పేడకు కొదవ ఉండదు. సిటీలో పేడరంగు లాంటి పౌడర్‌తో కల్లాపి చల్లి రంగవల్లులు వేశారు. సంక్రాంతి శుభాకాంక్షల అందులో మెరిశాయి. పిల్లలకు భోగిపండ్లు పోస్తూ సంబురాలు చేసుకున్నారు. పలు పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు  వేడుకల ఏర్పాటు చేసారు.  వేషధారణలు, ముత్యాల ముగ్గుల పోటీలు పెడుతున్నారు. సంప్రదాయ పిండివంటలను రుచి చూపుతున్నారు.

రెండు రోజుల్లో సిటీ దాటిన  లక్షా 20 వేల వాహనాలు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్లడంతో టోల్‌ ‌గేట్ల వద్ద చాంతాడంతా వాహనాల క్యూలు దర్శనమిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ‌మండలంలోని పంతంగి టోల్‌ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే లక్షా 20 వేలకు పైగా వాహనాలు టోల్‌గేట్‌ ‌దాటాయి. గురు, శుక్రవారాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంటల వరకు పంతంగి, బీబీనరగ్‌ ‌టోల్‌ప్లాజా వి•దుగా ప్రయాణించిన వాహనాల సంఖ్యను రాచకొండ ట్రాఫిక్‌ ‌పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్‌-‌విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ ‌ప్లాజా వద్ద ఈ నెల 12న మొత్తం 56,595 వాహనాలు పాస్‌అయ్యాయి. ఇందులో 42,844 కార్లు ఉండగా 1,300 ఆర్టీసీ బస్సులు, 4,913 ప్రైవేట్‌ ‌బస్సులు, 7,538 గూడ్స్, ఇతర వాహనాలు ఉన్నాయని తెలిపారు.

ఇక శుక్రవారం రాత్రి మొత్తం 67,577 వాహనాలు టోల్‌ప్లాజా విదుగా పయణించాయని చెప్పారు. ఇందులో 53,561 కార్లు, 1,851 ఆర్టీసీ బస్సులు, 4,906 ప్రైవేట్‌ ‌బస్సులు, 7,259 ఇతర వాహనాలు ఉన్నాయి. కాగా, హైదరాబాద్‌-‌వరంగల్‌ ‌హైవేపై ఉన్న బీబీనగర్‌ ‌టోల్‌గేట్‌ ‌వి•దుగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 1 గంటవరకు మొత్తం 25231 వాహనాలు పయనించాయని తెలిపారు. ఇందులో 17844 కార్లు, 872 బస్సులు, వరంగల్‌ ‌వైపు నుంచి హైదరాబాద్‌కు మొత్తం 13,334 వాహనాలు వెళ్లాయని చెప్పారు.

హైదరాబాద్‌లో బోసిపోయిన రోడ్లు…జనం పల్లెలకు వెళ్లడంతో తగ్గిన సందడి
సంక్రాంతి సెలవుల సందర్భంగా నగరంలోని చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో రెండురోజులుగా నగరం బోసిపోయింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో విద్యుత్‌ ‌వినియోగమూ తగ్గిందని అంచనా.  ఇక.. మెట్రో రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ రెండు రోజులుగా భారీగా తగ్గింది. పండుగకు ఊరెళ్లే వాహనాలన్నీ సాఫీ ప్రయాణం కోసం ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డును ఎంచుకుంటుండడంతో గత నాలుగైదు రోజులుగా ఓఆర్‌ఆర్‌పై మాత్రం వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఐదు రోజుల్లో పదిలక్షల వాహనాలు ఔటర్‌పై అదనంగా ప్రయాణం చేసినట్టు సమాచారం. ఇకపోతే నగర రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బందులు కానరావడం లేదు. వాహనాల రొద బాగా తగ్గింది. సాధారణంగా నగర రోడ్లపై ప్రతి రోజూ సగటున 50 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. శుక్ర, శనివారాల్లో 20 లక్షల లోపే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి బస్టాండ్లలో తప్పని పడిగాపులు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలన్న ప్రజలకు బస్సులు దొరక్క చాలామంది నానాయాతన పడ్డారు. శనివారం ఉదయం కూడా బస్సుల కోసం వేకువ జాము నుంచే బస్టాండ్ల వద్దకు వొచ్చినా చేరాల్సిన గమ్యానికి బస్సులు దొరక్క ఇబ్బందులు పడ్డారు. తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్న ప్రయాణికుల రాకతో జూబ్లీ బస్‌స్టేషన్‌, ఇమ్లిబన్‌, ‌దిల్‌సుఖ్‌ ‌నగర్‌, ఉప్పల్‌ ‌బస్టాండ్‌ ‌పరిసరాలు కిటకిట లాడాయి. నగరవాసులు కుటుంబ సమేతంగా పండుగకు తమ ఊళ్లకు వెళ్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ముందుగా అనుకున్నట్లుగానే రద్దీకి అనుగుణంగా కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, అదిలాబాద్‌, ‌మెదక్‌ ‌సెక్టార్లలోని వివిధ ప్రాంతాలకు రోజువారి సర్వీసులతోపాటు అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.

విజయవాడ వైపు ప్రత్యేక బస్సులు నడిపారు. కర్నూలు రూట్లో కూడా బస్సులు నడిపారు. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో ఎంజీబీఎస్‌,  ‌సీబీఎస్‌లు కిటకిటలాడుడాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ రెగ్యులర్‌ ‌బస్సులతో పాటు  ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. అన్ని బస్సులు ఎంజీబీఎస్‌ ‌నుంచే నడపడం వల్ల తరచూ ట్రాఫిక్‌ ‌సమస్యలు తలెత్తుతుండటంతో ఆర్టీసీ అధికారులు గత కొన్నేళ్లుగా ఎంజీబీఎస్‌తో పాటు జేబీఎస్‌, ‌నగర శివారు ప్రాంతాలైన దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌.‌బి.నగర్‌, ఉప్పల్‌, ఈసీఐఎల్‌, ఆరాంఘర్‌, ‌మెహిదీపట్నంలతో పాటు ఆర్టీసీ అధీకృత ఏజెంట్లకు కేటాయించిన ప్రాంతాల వద్ద నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply