Take a fresh look at your lifestyle.

కోవిద్ ప్రమాదపుటంచుల్లో పారిశుద్ధ్య కార్మికులు

“కరోనా పాండమిక్ తో లాక్ డౌన్ ప్రకటించిన మార్చి నుండీ మే వరకూ దేశంలో వివిధ ప్రాంతాల్లో వున్న కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో వారి పని పరిస్థితుల గురించి చేపట్టిన ఒక సర్వే వివరాలను గమనిస్తే; దాదాపు తొంభైఐదు శాతం మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారే ఈ పనిలో వున్నారు. ఇందులో సగంమందికి కూడా రేషన్ కార్డులు లేవు. ఎక్కువశాతం మందికి చేసిన పనికి సకాలంలో వేతనాలు అందింది లేదు. కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాలి. మరుగుదొడ్లు శుభ్రంచేయటం, తడి చెత్త (ఇళ్ళలోని చెత్త కూడా) తీసుకువెళ్ళేవారందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులే. వీరికి ఏ రకమైన హక్కులూ లేవు. ఈ పారిశుద్ధ్య కార్మికులెవరికీ కనీస రక్షణ పరికరాలు అందుబాటులో లేవు. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే కిట్స్ కూడా లేవు. ఆరోగ్యబీమా అసలే లేదు.”

k sajaya

పైపైన వినటానికి, చూడటానికి కొన్ని అంశాలు చాలా బాగున్నట్టు అనిపిస్తాయి. అలాంటివే సఫాయి కార్మికుల కాళ్లను ప్రధానమంత్రి కడగటం, రోడ్లు వూడ్చి, చెత్త ఎత్తి శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల నెత్తిమీద పూలు చల్లటం వంటివి. మీడియా కూడా వీటిని అత్యద్భుతమైన అంశాలుగా ప్రచారం చేస్తుంది. ఆగస్ట్ 15ని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య టీవీల్లో ఒక ప్రకటన వస్తోంది. కరోనా పాండమిక్ సమయం కాబట్టి, తమ వీధిని శుభ్రంచేసే పారిశుద్ధ్య కార్మికుడితో జండా ఎగురవేయించి మనందరం అంతా ఒకటే అని చెప్పడం, దానికి ఆ కార్మికుడు కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయి కృతజ్ఞతాభారంతో నమస్కారం పెట్టడం! ఇంతకు ముందు ఇంకో ప్రకటన కూడా ఇలాంటిదే వచ్చింది. ‘డ్రైనేజీలు శుభ్రంచేయటం ద్వారా మా నాన్న ఈ దేశాన్ని రక్షిస్తున్నాడు, మా నాన్నని చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ స్కూల్లో చదువుకుంటున్న ఒక పిల్లవాడితో చెప్పించే ప్రకటన అది. నిజమే, చూసేవాళ్ళందరికీ కూడా ఒక మాయాపొర కమ్ముకుంటుంది అలాంటివి సమయాల్లో. ఎక్కడా కూడా వారి వాస్తవ స్థితిగతులపై ఆలోచించే వైపుగా చర్చ వెళ్లనీయదు. కాదు, వెళ్ళనీయకుండా ఉండటానికే ఈ రకమైన ప్రకటనలు తయారుచేస్తారు. ప్రధానమంత్రి సఫాయి కార్మికుల కాళ్లు కడగటం అనే అంశాన్ని గొప్పగా కీర్తించే మీడియా గానీ, వారి అనుచరులు గానీ మాట్లాడనిది ఏమిటంటే ఎంతమంది ఇలాంటి కార్మికులు డ్రైనేజీలు శుభ్రంచేస్తూ ఆ విషవాయువులు పీల్చి చనిపోతున్నారనే విషయం! సఫాయి కర్మచారీ ఆందోళన్ వంటి సంస్థలు సర్వేలు చేసి, చనిపోతున్న వాళ్ళ లెక్కతీసి, ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికీ వెళ్లి.. ఆ కుటుంబాల ఘోషను పట్టించుకుని.. సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరిగితే ప్రభుత్వం పట్టించుకునేది అందులో పదోవంతు కూడా వుండదు. అసలు ఎక్కడెక్కడ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారనే కనీసపాటి సమాచారం కూడా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాల మద్దతులను అనుభవిస్తున్నవారు తెలుసుకోవాలని కూడా అనుకోరు. లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచీ నిరంతరం పనిచేసింది, చేస్తున్నది కూడా ఈ కార్మికులే! వారిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయవచ్చు. కాంట్రాక్టర్ల దగ్గర కావచ్చు, లేదా ప్రైవేటుగా కావొచ్చు. వీరిలో రోడ్లు, పబ్లిక్ టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్లు, డ్రైనేజీలను శుభ్రం చేసేవారు, హాస్పిటల్స్ లో ప్రమాదకరమైన చెత్తను, వాడి పారేసిన పీపీఈ కిట్లను ఎత్తిపోసేవాళ్ళు.. ఇలా ఎన్నో రకాల విధులను నిర్వర్తిస్తూనే వున్నారు. మనం రోజూ రోడ్లమీద చూసే పారిశుద్ధ్య కార్మికులు దాదాపు ఒక కాంట్రాక్టరు కింద పనిచేసేవారే అయి వుంటారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అందించే నిధులు పూర్తిగా వీరివరకూ రావు. ప్రభుత్వ ఖాతాలో ఒక లెక్క వుంటుంది, వీరికి వచ్చే నెల వేతనం తక్కువ వుంటుంది.

కరోనా వైరస్ ని ఎదుర్కోవాలంటే తరచూ సానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలంటూ ఊదరగొట్టిన ప్రకటనలేవీ కూడా ఈ కార్మికులకు కనీసపాటి రక్షణ సదుపాయాలు ఉన్నాయా లేవా అన్న అంశాన్ని పట్టించుకోలేదు. జేబురుమాలునో, తుండునో మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు. కానీ, చేతులకు, కాళ్ళకు నాణ్యమైన రబ్బరు తొడుగులు వ్యక్తిగతంగా కొనుక్కుని వేసుకోవాలంటే వీరికి ఎలా సాధ్యమవుతుంది? రబ్బరు తొడుగులు ఎందుకు వాడటం లేదు అని ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని అడిగితే ఆమె చెప్పిన సమాధానం, ‘వేసుకున్న కొద్దిసేపటికే చిరిగిపోయే నాసిరకమైన తొడుగులు ఇస్తే వాటితో ఎలా పనిచేయగలం? పైగా అవి చిరిగిపోయి చేసే పనికి అడ్డం అనిపిస్తాయి. అవి వాడటం కన్నా వట్టి చేతులతోనే పనిచేయటం సులువవుతుంది. అందుకే మనకు సాధారణంగా కనిపించే పారిశుద్ధ్య కార్మికులెవరికీ చేతి తొడుగులు కనిపించవు. ఇంక కాళ్ళకు బూట్లు ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ వస్తుంది! కరోనా పాండమిక్ తో లాక్ డౌన్ ప్రకటించిన మార్చి నుండీ మే వరకూ దేశంలో వివిధ ప్రాంతాల్లో వున్న కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో వారి పని పరిస్థితుల గురించి చేపట్టిన ఒక సర్వే వివరాలను గమనిస్తే; దాదాపు తొంభైఐదు శాతం మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారే ఈ పనిలో వున్నారు. ఇందులో సగంమందికి కూడా రేషన్ కార్డులు లేవు. ఎక్కువశాతం మందికి చేసిన పనికి సకాలంలో వేతనాలు అందింది లేదు. కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాలి. మరుగుదొడ్లు శుభ్రంచేయటం, తడి చెత్త (ఇళ్ళలోని చెత్త కూడా) తీసుకువెళ్ళేవారందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులే. వీరికి ఏ రకమైన హక్కులూ లేవు. ఈ పారిశుద్ధ్య కార్మికులెవరికీ కనీస రక్షణ పరికరాలు అందుబాటులో లేవు. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే కిట్స్ కూడా లేవు. ఆరోగ్యబీమా అసలే లేదు.

ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాబట్టి కొంతమందికి మాత్రం ఈ సమయంలో సకాలంలో జీతాలు చెల్లించారు. అయితే, పని గంటలు, శ్రమ బాగా పెరిగాయి. చిన్నచిన్న ఇళ్ళలో వుండటం వలన పని నుంచి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో భౌతిక దూరం పాటించడమనేది అసాధ్యమైపోయింది. లాక్ డౌన్ వల్ల కొంతమంది పనికి వెళ్లలేకపోయారు. అంతమేరకు వారికి ఆర్ధిక నష్టం వాటిల్లింది. ఆయా కుటుంబాలు ఆకలి సమస్యలను ఎదుర్కొన్నాయి. పాండమిక్ ని ఎదుర్కోవటంలో ముందువరసలో నిలబడిన సైనికులుగా పారిశుద్ధ్య కార్మికులను కూడా పరిగణించినప్పటికీ మిగిలిన వారితో పోలిస్తే వీరి పరిస్థితి అత్యంత అధ్వానంగా వుందనేది ఈ సర్వే తేల్చి చెప్పింది. వీరెవ్వరికీ సరైన మాస్కులు, చేతి తొడుగులు, చేతులు శుభ్రం చేసుకోవటానికి సానిటైజర్లు, సబ్బులు అందించలేదు. అయినా గానీ అలానే పనిచేయవలసి వచ్చింది. దాదాపు అత్యధిక శాతం మంది ప్రైవేటు కాంట్రాక్టర్ల కిందే పనిచేసారు. అటు ప్రభుత్వం వైపునుంచీ గానీ, ఇటు కాంట్రాక్టర్ల నుంచీ గానీ పని సందర్భంలో తీసుకోవలసిన రక్షణ చర్యల గురించి కనీస సమాచారమూ అందలేదు. అంతేకాదు- ప్రభుత్వ పారిశుద్ధ్య ఉద్యోగులతో సహా ఈ కార్మికులెవరికీ ఈ పని క్రమంలో కోవిద్ వైరస్ బారినపడితే తగిన చికిత్స అందిస్తామన్న భరోసా ఇవ్వలేదు.

ఎక్కడో కొన్నిచోట్ల సమస్యలు ఎదురయి వుంటాయి, అన్నిచోట్లా పరిస్థితి అలానే ఉండకపోవచ్చు అని వాదించే వాళ్లకేమీ కొదవ వుండదు మన దగ్గర. కానీ, పైన చెప్పిన విషయాలే పచ్చి వాస్తవం. 73 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా కొన్ని సమూహాలకు (కులాలకు) మాత్రమే ఈ పని ఎందుకు నిర్బంధంగా మారుతోందనే అంశంపై కనీసపాటి ఆలోచన చేయటానికి ప్రయత్నించని ఆధిపత్య వర్గాలవారు.. తరాల తరబడి అణిచివేతకు గురై, విద్యకు నిరాకరించబడిన ఈ వర్గాలకు రిజర్వేషన్ ఉండటంపై మాత్రం విద్వేషాన్ని కక్కటానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా వుంటారు. అందుకే, ప్రధానమంత్రి కాళ్లు కడిగిన వెంటనే ఈ సమూహాల జీవితాలన్నీ ధన్యమయిపోయినట్లుగా, తరతరాల సామాజిక అసమానత సంపూర్ణంగా సమసిపోయినట్లుగా ఒక భ్రమ కల్పిస్తుంటారు. వాస్తవంలో మాత్రం కులాంతర వివాహాల మీద విషాన్ని కక్కుతారు. కులాధిపత్య హత్యలను నిస్సిగ్గుగా సమర్ధిస్తారు. అంతవరకూ కూడా అవసరం లేదు, తమ రోజువారీ జీవితంలో చెత్త తీసుకెళ్ళే వాళ్ళతో ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తారో ఎవరికి వాళ్ళు తమలోకి తరచి చూసుకుంటే తెలియదా? నిజానికి కరోనా పాండమిక్ సమయంలో మొట్టమొదటి వివక్ష పారిశుద్ధ్య కార్మికులపైనే కొనసాగింది. వీరిని ఇళ్ళ సముదాయాలలోకి రానివ్వకూడదని సవాలక్ష ఆంక్షలు పెట్టినవారే అధికం. వీరికి అవసరమైన రక్షణ పరికరాలు అందించాలని ఆలోచించినవాళ్ళు, లాక్ డౌన్ సమయంలో వీరికి అవసరమైన నిత్యావసర సరుకులు అందించిన వాళ్ళూ ఎందరున్నారు చెప్పండి? చాలా అపార్ట్మెంట్లలో, తమ గుమ్మాల వరకూ వచ్చి చెత్తను తీసుకెళ్లటం లేదని (రావద్దని చెప్పేదీ ఈ భద్రజీవులే!) వారికి ఇచ్చే ఇరవై ముప్ఫై లేదా వందరూపాయల్లో కోతపెట్టి సగమే ఇచ్చిన సంఘటనలూ కోకొల్లలు. లాక్ డౌన్ సమయంలో ఇళ్ళల్లో పనిచేసే గృహ కార్మికులకు, చెత్త తీసుకెళ్లే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కోతపెట్టిన మహానుభావులున్న దేశం మనది. వీరెవరికీ కూడా పారిశుద్ధ్య కార్మికులు ఈ దేశ పౌరులు, వారికి హక్కులుంటాయి అనే మాట చాలా తీవ్రమైన నేరంగా అనిపిస్తూ వుంటుంది.

Leave a Reply