- రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఏమైనా ప్రసాదమా?
- రెమిడిసివిర్ ఇంజక్షన్ల కంపెనీ ముందు ధర్నా చేస్తాం
- బిజెపి వేస్ట్ మాటలు చెబుతోంది: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేస్తున్న భజనను మానుకుంటే మంచిదన్నారు. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…మంత్ర తలసాని ఇంట్లో కూర్చోని మాట్లాడడం మంచిది కాదనీ, అంతేకాకుండా తెలంగాణ ప్రజల ప్రాణాలతో కామెడీ చేయొద్దన్నారు. కొరోనా కేసులు తగ్గాయనీ మంత్రి తలసాని చెబుతున్నారనీ..సంగారెడ్డిలోని ఆసుపత్రికి వెళ్లి చూద్దామనీ, గాంధీ ఆసుపత్రికి వెళ్లి చూడు కేసులు తగ్గాయా? లేదా?అని తెలుస్తుందన్నారు. కేసులు తగ్గినట్లు మంత్రి తలసాని రుజువు చేయగలడా?అని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్ దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం భజన చేయడం మానుకోవాలన్నారు.
తలసాని మగాడైత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలని సవాల్ విసిరాడు. రాష్ట్రంలో కొరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ..రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత రోజు రోజుకూ ఎక్కువవుతుందన్నారు. కొరోనా పేషెంట్లకు సంజీవినిలా మారిన రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో కొందామనుకుకున్నా కూడా దొరకడం లేదన్నారు. తెలంగాణలోనే రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఉత్తత్తి అవుతున్నా…ఇక్కడే కొరత ఉండడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలోనే రెమిడిసివిర్ ఇంజక్షన్ తయారవుతున్నా..మనకే దొరకడం లేదనీ, కొరత ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. ఇంజక్షన్ల కొరతపై ప్రభుత్వం స్పందించకుంటే రెమిడిసివిర్ ఇంజక్షన్లను ఉత్పత్తి చేసే కంపెనీ ముందర ధర్నా చేస్తామనీ జగ్గారెడ్డి హెచ్చరించారు.
తెలంగాణను కేంద్రం అశ్రద్ధ చూపుతుందనీ ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం అశ్రద్ధ చూపుతున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. రాష్ట్రంలో బిజెకి ఉన్న ఎంపిలు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఎందుకు కేటాయించడం లేదనీ ప్రధానమంత్రి మోదీ అడగడం లేదన్నారు. రెమిడిసివిర్ ఇంజక్షన్లను మొక్కుబడిగా కేటాయిస్తున్నారనీ, ఇదేమైనా ప్రసాదమా? కొంచెం కొంచెం కేటాయించాడానికి అని నిలదీశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెడిసిన్‌ను ఎక్కువ అందుబాటులో ఉంచాలనీ, రెమిడిసివిర్ అవసరం లేదంటూనే… ఎందుకు బ్లాక్ చేస్తున్నారన్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుందన్నారు.
కంపెనీ ధ•రకే రెమిడిసివిర్ ఇంజక్షన్ దొరుకుతుందన్న భరోసాను కల్పించాలన్నారు. ప్రయివేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనం పిట్టల్లా చనిపోతున్నారనీ, ప్రతి నిత్యం రాష్ట్రంలో 200మందికి పైగా కొరోనా బారినపడిన వారు చనిపోతున్నారన్నారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ వేస్ట్ మాటలు చెబుతుందనీ, ప్రతి దానిని రాజకీయం చేస్తుందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరోనాపై రాష్ట్రం లెక్కలు ఇవ్వడం లేదని మెడిసిన్ ఇవ్వరా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రానికి ఇంటలిజెన్స్ వ్యవస్థ లేదా? తెలంగాణ ఏమైనా ఫరవాలేదు అనుకుంటుందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్రం డ్రగ్స్ డిపార్ట్మెంటు ద్వారా అనధికారికంగా మందులను సరఫరా చేస్తుందన్నారు. ఫార్మా ఓ మాఫియా అని, అడ్డగోలుగా అమ్మకాలు జరుగుతున్నాయనీ జగ్గారెడ్డి ఆరోపించారు. కొరోనాతో ప్రజలు చనిపోతుంటే కేంద్రం చూస్తూ కూర్చుందనీ, మనుషుల ప్రాణాలకు విలువ లేదా?అని జగ్గారెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు.