Take a fresh look at your lifestyle.

‌సంగారెడ్డికి మెడికల్‌ ‌కాలేజీ.. కేసీఆర్‌కు థాంక్స్..!

ఆ ‌విషయం పార్టీకి సంబంధం లేదు.. నా వ్యక్తిగతం: జగ్గారెడ్డి
జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేస్తామనీ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందనీ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమం•త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి అన్నారు. మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌ ‌కోసం పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. తన కూతురుతో కలిసి అసెంబ్లీకి పాదయాత్ర చేశానని జగ్గారెడ్డి చెప్పారు. గడిచిన గత నాలుగేండ్లుగా నేను చేసిన ఉద్యమం ఫలితంగానే సిఎం కేసీఆర్‌ ‌సంగారెడ్డిలో మెడికల్‌ ‌కళాశాల అవసరమని గుర్తించారన్నారు.

సంగారెడ్డిలో మెడికల్‌ ‌కళాశాలతో 10 నియోజకవర్గాల ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని బీదర్‌ ‌నుండి వచ్చే ప్రజలకు కూడా ఈ మెడికల్‌ ‌కాలేజి ఉపయోగపడుతుందన్నారు. కేసీఆర్‌ ‌వెంటనే మెడికల్‌ ‌కాలేజ్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలని జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డిలో మెడికల్‌ ‌కాలేజీ కోసం ఉన్న భూముల్లోనే కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. కొబ్బరికాయ కొట్టి సిఎం శంకుస్థాపన చేయాలని.. ఎమ్మెల్యేగా తనకు సీఎంగా కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్నారు. శంకుస్థాపనకు వచ్చిన రోజు కేసీఆర్‌ అనుమతితో భారీ సన్మానం చేస్తానని తెలిపారు.

ఈ విషయం పార్టీకి సంబంధం లేదని తన వ్యక్తిగతమని జగ్గారెడ్డి చెప్పారు. అపాయింట్‌ ‌మెంట్‌ ఇస్తే వెళ్లి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు చెబుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. శిలాఫలకంపై నా పేరు లేకున్నా సరే…సంగారెడ్డికి మెడికల్‌ ‌కాలేజ్‌ ‌చాలనీ, నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడే సంగారెడ్డికి ఐఐటి వచ్చిందనీ, దీంతో సంగారెడ్డి చుట్టూ అభివృద్ధి జరిగిందన్నారు. సంగారెడ్డి ప్రజలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు మంచి జరిగితే చాలు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Leave a Reply