Take a fresh look at your lifestyle.

నేను రావాలా…ఉచిత అంబులెన్స్ ‌సేవలు కావాలా’?

అందరు వేరు జగ్గారెడ్డి వేరు…
సంగారెడ్డికి మరో 2అంబులెన్స్‌ల ప్రారంభం
త్వరలో మరో 11అంబులెన్స్‌ల ఏర్పాటు
మెడికల్‌ ‌కాలేజ్‌ ఇచ్చినందుకు సిఎం కేసీఆర్‌కు థాంక్స్ ‌చెప్పా: జగ్గారెడ్డి
హైదరాబాద్‌, ‌మే 31 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): ప్రస్తుతం ఉన్న కొరోనా పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులకు గురౌతూ ఇటు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోలు రూంకు 3అంబులెన్స్‌లను సమకూర్చా. సంగారెడ్డి నియోజకవర్గంకు ఇప్పటికే 2అంబులెన్స్‌లను పంపించా. తాజాగా…సోమవారం మరో 2అంబులెన్స్‌లను పంపిస్తున్నా. డబ్బులు లేని పేదోళ్లు ఇబ్బందులు పడొద్దనీ..నేను ఇబ్బందులు పడుతూ కూడా ఉచిత అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నా. త్వరలోనే నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మరో 11 అంబులెన్స్‌లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నా. అయితే, ఇంత చేస్తున్నా…నేను సంగారెడ్డికి రావడం లేదన్న మాటలు కొందరు చేస్తున్నట్లు వినిస్తున్నాయనీ, నేను సంగారెడ్డికి రావడం ముఖ్యమా? ఆపదలో ఉన్న వారికి ఉచితంగా అంబులెన్స్ ‌సర్వీసులు సమకూర్చడం ముఖ్యమా?అని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారమిక్కడ సంగారెడ్డి ప్రజల కోసం సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన మరో 2 ఉచిత అంబులెన్స్‌లను ప్రారంభించిన అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ…నా తల్లితండ్రుల జ్ఞాపకర్ధంగా సంగారెడ్డి నియోజకవర్గంలో 15 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట ప్రకారం ఇప్పటికే 2 ఏర్పాటు చేశాననీ, తాజాగా మరో రెండింటిని ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

మిగతావి విడతల వారీగా ఏర్పాటు చేస్తాననీ, తాజాగా ప్రారంభించిన 2అంబులెన్స్‌లలో ఒకటి రాంనగర్‌, ‌మరొకటి సంగారెడ్డి ప్రభుత్వ క్యాంప్‌ ‌కార్యాలయంలో ఉంటుందన్నారు. అంబులెన్స్‌లు అవసరమున్న వారు క్యాంప్‌ ఆఫీస్‌ ‌నెంబర్‌ 08455-278355‌కి ఫోన్‌ ‌చేయడంతో పాటు డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డికి కూడా ఫోన్‌ ‌చేస్తే అంబులెన్స్ ‌వస్తుందన్నారు. ఇది రాజకీయం కోసం కాదన్నారు. ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. పేద ప్రజలు ఎవరూ ఇబ్బంది పడొద్దని ఈ ఉచిత అంబులెన్స్ ‌సర్వీస్‌లు ప్రారంభించాననీ, సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు ఉపయోగించుకోవాలన్నారు. ఈ అంబులెన్స్ ‌సర్వీస్‌ ‌పూర్తిగా ఉచితమనీ, పెట్రోల్‌,‌డీజల్‌ ‌కూడా నేనే ఏర్పాటు చేస్తున్నానీ, ఒక్కరూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా పని చేసేవాడిపైనే విమర్శలు చేస్తుంటారు..

ఇది సహజమనీ, వీటిని నేను పట్టించుకోననీ, అందరు లీడర్లు వేరు గ్గారెడ్డి వేరన్నారు. దీనికి కారణం…సంగారెడ్డి నియోజకవర్గానికి నేను వెళ్తే వందల సంఖ్యలో జనం చుట్టు చేరుతారనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మంచిది కాదనీ, సంగారెడ్డికి వెళ్లడం లేదన్నారు. నేను వెళ్లకున్నా అన్నీ సమకూరుస్తున్నానీ అన్నారు. 2014ఎన్నికల్లో నేను ఓడినా మెడికల్‌ ‌కళాశాల కోసం మూడేళ్ల పాటు పోరాటం చేశాననీ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడుసార్లు అడిగాననీ అన్నారు. రెండుసార్లు సిఎం కేసీఆర్‌ ‌స్పందించారనీ, సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్‌ ‌కళాశాల మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాననీ గుర్తు చేశారు. కొరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ జాగ్రత్తగ ఉండాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. చెప్పిన మాట ప్రకారం త్వరలోనే మరిన్ని అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తాననీ అన్నారు.

Leave a Reply