Take a fresh look at your lifestyle.

సమ్మక్క సారలమ్మలకు సబ్బినాటితో అనుబంధం

“దేశ మాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ జానపదులు ఆరాధ్య దైవాలుగా కొలవడం సదాచారంగా మారింది. దాదాపు 900 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన వన దేవతల జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే సాగుతుంది. అయితే గిరిజనులే కాక, గిరిజనేతరులు సైతం గద్దెలెక్కిన దేవతలను కొలవడం వంశపారం పర్య ఆచరణగా కొనసాగుతున్నది.”

( ఫిబ్రవరి 24 నుండి 27 వరకు మేడారం మినీ జాతర )

కాకతీయులు మొదట సబ్బినాడు (కరీంనగర్‌) ‌లోనే రాజ్యము చేసి, చాళుక్యుల దయచే అనుమ కొండను సంపాదించారనే భావనకు, పొలవాసలో ఏకశిలాదేవి కాకతీయుల కులదైవం మందిరం ఆనాడు ఉండడం ఊతమిస్తున్నది. కాకతీయులలో మూడవ రాజైన రెండవ బేతరాజు, మహా మండలే శ్వర మేడరాజుకు సామంతుడని శాసనాధారులున్నాయి. జగిత్యాల జిల్లాలో ఆర్వెల్లి (ఆరువేల గ్రామం)లో నేటికీ ఎత్తైన ఆర్వెల్లి నాయకమ్మ విగ్రహం కలిగి, ఏటా జాతర జరుగుతున్నది. బేతరాజు సబ్బి సహస్రం (ఆరువేల నాడు)ను పాలించాడని చరిత్రకారుల భావన. బేతరాజు తర్వాత రెండవ ప్రోలరాజు రాజై, జగిత్యాల సమీప పొలవాస రాజ్యాన్ని ఏలే మేడరాజును గెల్చి, సామంతునిగా నిలిపాడని, అలాగే మంత్రకూటపు (మంథెన) రాజైన గుండెరాజును గుండారం వద్ద ఓడించి, అవమాన పరిచాడని, గుండెరాజు, మేడరాజు అన్నదమ్ములని పరిశోధనలు జరిగాయి.

ప్రోలుని తర్వాత రాజైన కాకతీయ రుద్రుడు నగునూరుపై దండెత్తి దొమ్మరాజును ఓడించాక, పొలవాసపై దండెత్తగా, మేడరాజు పారిపోగా, హుస్నాబాద్‌ ‌సమీప ఆకునూరుకు చేరుకుని, మూల సైనిక బలంతో మైళగి దేవుని కళ్యాణి వరకు తరిమిన క్రమంలో, రుద్రరాజు స్వతంత్రుడైన సందర్భంలో, యావదాంద్రదేశం రుద్రుని పాలన కిందకు 1162లో వచ్చినట్లు చరిత్రకారులు తెలుగు ప్రజలందరిని ఒక్కటిగా చేసిన సంవత్సరంగా గుర్తించారు. మేడరాజు తమ్ముడగు ఏడెరాజు  వేయించిన శాసనం రామగుండం వద్ద లభించుటచే ఏడెరాజు ఆప్రాంత సామంతుడుగా ఉండినట్లు అభి ప్రాయాలున్నాయి. గణపతి దేవుని కాలాన కరీంనగర్‌ ‌జిల్లా మొత్తం సామంత పల్లవుల పాలనలో ఉండెనని తెలుస్తున్నది. గణపతి దేవుని తర్వాత రుద్రమ సింహాస నమెక్కింది.

కాకతీయులలో చివరివాడు ప్రతాప రుద్రుడు. స్థానిక కథనాల ప్రకారం పొలవాసను పాలించిన మేడరాజు ఏకైక పుత్రిక సమ్మక్కను తన మేనల్లుడైన మేడారం పాలకుడగు పగిడిద్దరాజుతో వివాహం జరిపించాడు. వారికి సారలమ్మ నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు.

ప్రతాప రుద్రుడు పొలవాసపై దండెత్తగా, మేడరాజు పోరిపోయి, పగిడిద్ద రాజుకు ఆశ్రయుడైనట్లు, పడిగిద్ద రాజుపై ఆగ్రహించిన ప్రతాప రుద్రుడు మాఘ పౌర్ణమినాడు మేడారంపై దండెత్తి నట్లు, మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధంలో వీరస్వర్గం పొందినట్లు, సమ్మక్క సైతం కాకతీయలతో వీరోచితంగా పోరుసల్పి, గిరిజన యుద్ధ తంత్రాన్ని ప్రదర్శించినట్లు ప్రచారంలో ఉంది.

సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి పెద్ద జాతర, అలాగే మినీ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు కుంటున్నారు.
అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లాతో విడదీయరాని అనుబంధం, సంబంధం కలిగిన సమ్మక్క – సారలమ్మలకు అత్యధికంగా వనదేవతల గద్దెలున్నాయి. దేవాదాయ శాఖలో రిజిస్ట్రేషన్‌ అయినవి కరీంనగర్‌ ‌జిల్లాలో 41 కాగా, వరంగల్‌ ‌జిల్లాలో 12 ఉన్నాయి. ఆదిలాబాద్‌ ‌లో వేళ్ళపై లెక్కించేవి కాగా, ఇతర జిల్లాలలో బహుస్వల్పం.

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతరను ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు (మండె మెలిగే పండగ)  నిర్వహించేందుకు కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క – సారలమ్మ చిన్న జాతర ఘనంగా జరుగనుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సమ్మక్క- సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్ల కోసారి వైభవంగా జరుగుతుంది.  జాతరలో భాగంగా నాలుగు రోజులపాటు వివిధ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించ నున్నారు. జాతరలో మొదటి రోజైన 24న సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు గ్రామ ద్వార స్తంభాలను స్థాపించ నున్నారు. 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేయనున్నారు. 26న భక్తులు అమ్మవారిని దర్శించు కుంటారు.

సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం 27వ తేదీన జాతర ముగియనుంది. ఉత్తర తెలంగాణ నుండి అధిక సంఖ్యాకులైన భక్తులు ఈ జాతరకు సనాతన సంప్రదాయ వారసత్వ ఆచారంలో భాగంగా క్రమం తప్పకుండా వెళ్లడం పరిపాటి.  జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. విద్యుత్‌, ‌తాగునీరు, మరుగుదొడ్లు ఇతర వసతులను ఏర్పాట్లు చేసేందుకు కోసం ములుగు జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణా ఆదిత్య రూ.2 కోట్లు కేటాయించి పనులను వేగవంతం చేయించారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
     9440595494 

Leave a Reply