- నమూనా విడుదల చేసిన మంత్రిత్వ శాఖ
- కాలుష్య కారక వాహనాలను నియంత్రించడానికి అవకాశం
కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 కింద జారీ చేస్తున్న పియుసి(పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ దేశంలో అన్ని ప్రాంతాల్లో ఒకే తరహాలో ఉండేలా ఆదేశిస్తూ కేంద్ర రహదారి మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2021 జూన్ 14వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. నూతనంగా జారీ చేయనున్న పీయూసీసీతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో జారీ అయ్యే సర్టిఫికెట్ ఒకే తరహాలో ఉంటుంది. ప్రతి పీయూసీ సమాచారాన్ని జాతీయ రిజిస్టర్‌తో అనుసంధానం చేస్తారు. తిరస్కరణ స్లిప్‌ను జారీ చేసే విధానాన్ని తొలిసారిగా అమలులోకి తీసుకుని రానున్నారు.
నిర్ణీత ప్రమాణానికి మించి వాహనం నుంచి పొగ వెలువడితే ఆ వాహన యజమానికి తిరస్కరణ స్లిప్ జారీ చేస్తారు. వాహనాన్ని సర్వీస్ చేయడానికి లేదా మరో కేంద్రంలో పరీక్షించినప్పుడు పీయూసీసీ పరికరం సక్రమంగా పనిచేయడం లేదని చెప్పడానికి దీనిని ఉపయోగించవచ్చును. అయితే సమాచారం గోప్యంగా ఉంటుంది. వాహన యజమాని పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ఇంజిన్, చాసిస్ నంబర్లు(మొదటి మూడు సంఖ్యలు మాత్రమే కనిపించేలా చూసి మిగిలిన సంఖ్యలను కనపడకుండా చేస్తారు) వివరాలను గోప్యంగా ఉంచుతారు. నూతన సర్టిఫికెట్ కొరకు వాహన యజమాని తన మొబైల్ నెంబర్ని తెలియ చేయడాన్ని తప్పనిసరి చేయడం జరిగింది. ధ్రువీకరణ మరియు రుసుము కోసం దీనికి ఎస్ఎంఎస్ వొస్తుంది.
ప్రమాణాలకు లోబడి ఏదైనా ఒక వాహనం పొగను వెలువరిస్తున్నదని తనిఖీ అధికారి గుర్తించినప్పుడు ఆ అంశాన్ని సదరు అధికారి లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ పద్దతిలో వాహన యజమాని లేదా దానిని నడుపుతున్న వ్యక్తికి తెలియజేసి అధీకృత పొల్యూషన్ అండర్ కంట్రోల్ కేంద్రాల్లో వాహనాన్ని పరీక్షించాలని ఆదేశించే అధికారం కలిగి ఉంటారు. ఆదేశాలను పాటించని యజమాని లేదా నడుపుతున్న వ్యక్తి పాటించనప్పుడు లేదా పరీక్షల్లో వాహనం సక్రమంగా లేదని వెల్లడయినప్పుడు వాహన యజమాని జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
దీనికి వాహన యజమాని అంగీకరించని పక్షంలో ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్’సర్టిఫికెట్ వొచ్చేంత వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు జారీ అయిన పర్మిట్‌ను తగిన కారణాలను లిఖితపూర్వకంగా తెలియచేస్తూ సస్పెండ్ చేసే అధికారం నమోదు సంస్థకు ఉంటుంది. నూతన నిబంధనల వల్ల వాహనాలపై ఐటీ ఆధారిత పర్యవేక్షణ ఉంటుంది. దీనితో కాలుష్య కారక వాహనాలను నియంత్రించడానికి అవకాశం కలుగుతుంది. పీయూసీ కేంద్ర పూర్తి వివరాలను తెలియజేసే క్యూఆర్ కోడ్‌ను ఫారంపై ముద్రిస్తారు.