Take a fresh look at your lifestyle.

సైదాబాద్‌ ‌చిన్నారి అత్యాచారం, హత్య కేసు.. నిందితుడు రాజు ఆత్మహత్య

  • స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌రైల్వే ట్రాక్‌పై కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి బలవన్మరణం
  • చేతిపై పచ్చబొట్టు ఆధారంగా గుర్తించిన పోలీసులు
  • ధృవీకరించిన డిజిపి మహేందర్‌ ‌రెడ్డి
  • పోస్టుమార్టం కొరకు శవాన్ని ఎంజిఎంకు తరలింపు : సిపి తరుణ్‌ ‌జోషి
  • పీడవిరగడైంది.. చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు : పిల్లనిచ్చిన అత్త యాదమ్మ స్పందన

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్‌ ‌చిన్నారి అత్యాచారం, హత్య నిందితుడు పల్లకొండ రాజు స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకుతానే మరణశిక్ష విధించుకున్నాడు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యచేసుకున్నట్లు గుర్తించారు.  ప్రత్యక్ష సాక్షి, రైల్వే సిబ్బంది కుమార్‌ ‌కథనం ప్రకారం..‘స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌రాజారాం బ్రిడ్జి నంబర్‌ 436 ‌వద్ద ఓ వ్యక్తి గురువారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు రైల్వే సిబ్బంది సారంగపాణి చెప్పాడు. మమ్మల్ని చూసి రైల్వే ట్రాక్‌ ‌పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి అతను వెళ్లాడు. పది నిమిషాలు అయిన రాకపోయేసరికి మేం 200 వి•టర్లు ముందుకెళ్లాం. ఉదయం 8:40 గంటలకు హైదరాబాద్‌ ‌వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సవి•ప రైతులు మాకు సమాచారం అందించారు. మేము అక్కడికి వెళ్లి డెడ్‌బాడీని చూసి రైల్వే అధికారులకు సమాచారం అందించాం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చూస్తే సైదాబాద్‌ ‌నిందితుడు రాజు అని తెలిసిపోయింది.

సారంగపాణి 100కు డయల్‌ ‌చేసి సమాచారం ఇచ్చాడు. అంతలోపే పోలీసులు రాజారాం బ్రిడ్జి వద్దకు చేరుకున్నట్లు కుమార్‌ ‌తెలిపాడు. అయితే అతని రెండు చేతులపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా మృతుడిని రాజుగా పోలీసులు గుర్తించారు.’ రాజు రెండు చేతులపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంటుందని పోలీసులు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. పల్లకొండ రాజు రెండేండ్ల క్రితం సూర్యాపేట జిల్లా జలాల్‌పురం గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన భార్య పేరును రెండు చేతులపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఒక చేతిపై ఇంగ్లీష్‌లో, మరో చేతిపై తెలుగులో మౌనిక అని రాయించుకున్నాడు. రాజు భార్య ప్రసవం కోసం ఏడాది క్రితం జలాల్‌పురం వొచ్చి అక్కడే ఉంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. రెండు వారాల క్రితం జలాల్‌పురం వెళ్లిన రాజు మద్యం మత్తులో..తన అత్తపై దాడి చేసినట్లు తేలింది.

కుటుంబ సభ్యులు దాడి చేస్తారేమోనని భయపడి హైదరాబాద్‌కు తిరిగి వొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడి రాజు అసలు ఊరు జనగామ జిల్లా కొడకండ్ల మండలం. కాగా బతుకుతెరువు కోసం అతను పుట్టకుముందే అతని తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వొచ్చినట్టు విచారణలో తెలిసింది. అతని తండ్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని తెలుస్తుంది. నిందితుడు ఎప్పుడూ ఏదో మైకంలో ఉండే వాడని, సెల్‌ ‌ఫోన్‌ ‌కూడా వాడేవాడు కాదని అతన్ని గమనించిన వాళ్ళు చెప్పారు. ఇదిలావుంటే ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు .. వరంగల్‌ ‌జిల్లాలోని స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌పరిధిలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నట్టు రాష్ట్ర డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఆయన తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుడి శరీరంపై ఉన్న పచ్చబొట్టు ద్వారా ఆ వ్యక్తి అత్యాచార నిందితుడిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. మృతుడి చేతిపై మౌనిక అని పచ్చ బొట్టు రాసి ఉన్న గుర్తు ద్వారా అతన్ని రేప్‌ ‌నిందితుడు రాజుగా తేల్చినట్లు డీజీపీ తన ట్వీట్‌లో చెప్పారు.

పోస్టుమార్టం కొరకు శవాన్ని ఎంజిఎంకు తరలింపు : సిపి తరుణ్‌ ‌జోషి
చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని వరంగల్‌ ‌సీపీ తరుణ్‌ ‌జోషి పరిశీలించారు.  పంచనామా అనంతరం వరంగల్‌ ఎం‌జీఎంకు రాజు శవాన్ని తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. గురువారం ఉదయం 9:58 గంటలకు కీమెన్‌ ‌సారంగపాణి 100కు డయల్‌ ‌చేశారు. రాజారాం బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని తెలుపడంతో.. ఎస్‌ఐ ‌రమేశ్‌ ‌బృందం అక్కడికి చేరుకున్నారు. డెడ్‌బాడీపై ఉన్న పచ్చబొట్టు, ధరించిన దుస్తులను బట్టి రాజుగా నిర్దారించారు అని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌నుంచి స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌కు ఎలా వొచ్చాడో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ మార్గానికి వొచ్చే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని సీపీ తరుణ్‌ ‌జోపీ చెప్పారు.

పీడవిరగడైంది.. చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు : పిల్లనిచ్చిన అత్త యాదమ్మ స్పందన
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కామాంధుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న అతని అత్త ఆనందం వ్యక్తం చేశారు. రాజు ఆత్మహత్యపై అతడి అత్త యాదమ్మ మాట్లాడుతూ…తనకుతను శాస్తి చేసుకుని అందరికీ మంచి చేశాడని తెలిపింది. తన కుమార్తె మౌనిక జీవితం నాశనం చేశాడని చెప్పారు. తన కూతురు జీవితంలో మన్నుబోయడమే కాక మరో చిన్నారి జీవితాన్ని కూడా నాశనం చేశాడని, అతడికి బతికే హక్కులేదని యాదమ్మ తెలిపారు. ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడన్నారు. తన కుమార్తెకు వొచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ యాదమ్మ విచారం వ్యక్తం చేశారు. రాఖీ పండుగకు ముందు 15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వొచ్చాడని, ఇంట్లో గొడవలు జరిగాయని చెప్పారు.

ఆ సమయంలో రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వొచ్చి అడ్డుకున్నాడన్నారు. ఇక ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదని యాదమ్మ వివరించారు. రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉన్నాడు. పట్టణంలోని గోపాలపురంలో ఉన్న సిమెంట్‌ ఇటుకల తయారీ కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఉన్న ఒక గదిలో భార్యతో కలిసి నివసించాడు. 18 నెలల కిందట సూర్యాపేటకు వొచ్చిన రాజు దంపతులు అక్కడ ఆరు నెలలపాటు ఉన్నారు. ఆ సమయంలో రాజు మద్యం తాగి వొచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. రాజు అక్కడి నుంచి వెళ్లే సమయంలో భార్య, కుమార్తె ఉన్నారని, ప్రస్తుతం అతడి భార్య గర్భవతి అని సమాచారం.

Leave a Reply