Take a fresh look at your lifestyle.

ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తొలి ప్రాధాన్యం హైదరాబాద్‌ ‌మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈనెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ ‌సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తూ మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈమేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. తొలుత 7న ఎల్బీనగర్‌ ‌నుంచి మియాపూర్‌ ‌మార్గంలో ప్రారంభించి దశల వారీగా మూడు కారిడర్లలోనూ సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు. 8 నుంచి నాగోల్‌ ‌రాయదుర్గం, 9 నుంచి జేబీఎస్‌ ఎం‌జీబీఎస్‌ ‌మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఉదయం 7 గంటల నుంచి 12, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే సర్వీసులు నడుస్తాయని తెలిపారు.

కొరోనా లక్షణాలు లేని వారినే మెట్రో స్టేషన్లలోని అనుమతిస్తామనీ, సాధారణ ఉష్ణోగ్రత ఉంటేనే మెట్రోలో ప్రయాణించాలనీ, థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు తక్కువ లగేజితో ప్రయాణించాలని కోరారు. ప్రయాణికులకు ఫేస్‌ ‌మాస్కు తప్పనిసరి అనీ, లేనివారు స్టేషన్‌లో కొనుక్కోవాలనీ, లేనిపక్షంలో మెట్రో ప్రయాణానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేస్తున్నామనీ, స్మార్ట్ ‌కార్డు, నగదు రహిత విధానంలో టికెట్టు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని మెట్రో స్టేషన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ ‌చేస్తామనీ, మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మెట్రో స్టేషన్లలో ఐసోలేషన్‌ ‌రూంలను సైతం ఏర్పాటు చేస్తున్నామనీ, కంటైన్మెంట్‌ ‌జోన్లుగా ఉన్న గాంధీ హాస్పిటల్‌, ‌ముషీరాబాద్‌, ‌భరత్‌నగర్‌, ‌మూసాపేట, యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసి వేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ 5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుందనీ, రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply