Take a fresh look at your lifestyle.

మట్టి అంతరించిపోతుంది ..

(మట్టి పరిరక్షణకై సద్గురు ప్రపంచ యాత్ర)

సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ.. సప్తసముద్రాలను నదులను తన తనువులో దాచుకొని విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయంగా నిలచింది నేలతల్లి. ఈ నేలను నమ్ముకొని.. నేలను ఆధారంగా చేసుకొని.. చెట్లూ చేమలు.. జీవులు..జీవరాశులు.. మనుషులు .. చివరకు సూక్ష్మక్రిములు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఇలా కొన్ని కోట్ల జాతుల జీవనానికి మట్టి ఆధారమై నిలచింది. తల్లి మనకు జన్మనిస్తే.. ఆ తల్లితో పాటు నేల తల్లి మనకు బతుకునిస్తుంది. మనల్ని పోషిస్తూ మన ఉనికికి ఆధారభూతమైన, చైతన్యవంతమైన ఒక మాతృస్వరూపంగా నిలచింది నేల తల్లి..ఎందుకంటే మనిషులకు సమస్త జీవరాశికి అవసరమైన అన్ని వనరులనూ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా  అన్నీ మట్టి అందిస్తూ ఉంది.భూమి అన్నది ఒక అద్భుతం. చనిపోతే నేలలోనే పాతిపెడతారు. అక్కడే ప్రాణం కూడా మొలకెత్తుతుంది. మనం భూమి నుంచే ఉద్భవిస్తాం. భూమిపై ఉన్న దానినే తింటాం. చనిపోతే తిరిగి అదే భూమిలోకి చేరతాం’’ అయితే మట్టి అనే దానిని మనలో చాలా మంది ప్రాణం లేని జడ పదార్థంగా భావిస్తాం.కానీ ఎన్నో జీవాలకు  మనుగడ ఇచ్చే ఈ మట్టికి  జీవం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మట్టి ఓ సజీవ పర్యావరణ వ్యవస్థ. ఒక చెంచా మట్టిలో వందల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి.ఈ గ్రహం మీద జీవిస్తున్న మానవుల కంటే ఎక్కువ జీవులు పిడికెడు మట్టి(8 నుంచి10 బిలియన్లు)లో నివసిస్తున్నాయి.ఈ భూమిలో 36-39 అంగుళాలు 87 శాతం జీవరాశుల ఆవాసాలకు నిలయంగా ఉంది.95 శాతం ఆహారం మనకు భూమి ద్వారానే అందుతున్నది.
ఎన్నో కోట్ల జీవరాశులు మట్టిలో ఆవాసం ఉండటం వల్లనే మనకు భూమి నుండి ఆహరం పండుతుంది. మనం తినగలుగుతున్నాం అన్ని జంతువులు బతుకుతున్నాయి. అంతే కాదు మట్టి వర్షపు నీటిని తనలో ఇముడ్చుకుని వడకట్టి శుద్ధి చేసి భూగర్భంలో నిలువ  చేస్తుంది. ఇవన్నీ కూడా నేల సారవంతంగా అంటే జీవం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఇసుకలో సేంద్రియ పదార్థం చేరితే మట్టి అవుతుంది.అప్పుడు మట్టిలో జీవం ఉన్నట్టు.అదే మట్టిలో సేంద్రియ పదార్ధం కోల్పోతే అది ఇసుక అవుతుంది అంటే మట్టి జీవం కోల్పోయినట్లు లెక్క.మట్టికి జీవం పోతే  అది బీడు భూమి అవుతుంది.అటువంటి బీడు భూమిలో ఎన్ని రసాయనాలు వేసినా పంట పండదు. ఇప్పుడు అనేక భూములు ఈ స్థితికి చేరుకున్నాయి.అంటే జీవం ఉన్న మట్టి మన చర్యలు వలన అమ్మ లాంటి భూమి, అన్నం పెట్టే భూమి విషతుల్యం అయిపోతోంది.అంతరించిపోయే స్థితికి చేరుకుంది.ఒక అంగుళం ఎత్తు మట్టి కొత్తగా ఏర్పడాలంటే 250 ఏళ్లు పడుతుంది. అటువంటిది మన అజాగ్రత్త వల్ల, స్వార్థం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల సారవంతమైన పై మట్టి కొట్టుకుపోతోంది. ప్రతీ 5 సెకన్లకు దాదాపు ఫుట్‌బాల్‌ ‌మైదానానికి సమానమైన మట్టి జీవం కోల్పోయేలా మనం చేస్తున్నాం.  నేల సారవంతంగా ఉండాలి అంటే దానిలో సేంద్రియ కంటెంట్‌ 3 ‌నుంచి 5 శాతంగా ఉండాలి.కానీ ప్రస్తుతం మన దేశంలో 60 శాతం భూమిలో ఈ కంటెంట్‌ 0.5 ‌శాతంగా ఉన్నట్లు పరిశోధనలు తెలుపు తున్నాయి.
అంటే మనం ఇప్పటికే చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అర్థం అవుతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మట్టే కదా! అని మనం తేలికగా తీసుకో వడమే ఈ దుస్థితికి కారణం.అభివృద్ధి పేరిట పారిశ్రా మికీకరణ,అధిక దిగుబడులు సాధనకు రసాయనాలు, హానికరమైన పురుగు మందులతో పునరుత్పాదక సహజ వనరైన నేలపై మనం దశాబ్దాలుగా దాడి చేస్తూనే ఉన్నాం. ఫలితంగా వేల సంవత్స రాలలో పాడుచేయలేని భూసారాన్ని మనం కేవలం నాలుగైదు దశాబ్దాలలో నాశనం చేసేశాం.మనం మట్టికి చేసిన ద్రోహం వల్లనే మన తర్వాత తరాలకు తీరని నష్టం జరుగుతుంది.మన ముందు తరాల వారు మట్టిని కాపాడి మనకు ఇవ్వడం వల్లనే ఈ రోజు మనం ఆ మట్టిపై పంట పండించుకుని మనుగడ సాగిస్తున్నాం. దానిని గమనించకుండా మనం సాగిస్తున్న ఈ మట్టి వినాశనానికి  అడ్డుకట్ట వేయకపోతే మరో 40-50 ఏళ్లకు ఈ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పాడై ఎడారిగా మారిపోతుందని  శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
2050 నాటికి 90 శాతానికి పైగా నేల క్షీణించవచ్చని యునైటెడ్‌ ‌నేషన్స్ ‌కన్వెన్షన్‌ ‌టు కంబాట్‌ ‌డిసర్టిఫికేషన్‌ (‌ఖచీ••ణ) వెల్లడించింది. ఇదే జరిగితే ఆహారం, నీటి కొరతతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపత్తు సంక్షోభాలకు దారి తీస్తుంది. 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 9 బిలియన్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఆనాటికి పంట పండించడానికి ఇప్పటి కంటే 1.5 రెట్ల ఎక్కువ మట్టి అవసరం అవుతుంది.కానీ ప్రస్తుతం ఉన్న మట్టిలోనే వేగంగా సారం తగ్గిపోతూ ఉంటే అదనపు మట్టి  సాద్యపడే అవకాశమే లేదు.ఈ లెక్కలు బట్టి 2050 నాటికి మనకు అవసరమైన ఆహారంలో 30 శాతం మాత్రమే పండుతుంది.దీని వలన ప్రతీ పది మందిలో ముగ్గురు ఆకలితో చని పోయే అవకాశం ఉందని వివిధ అధ్యయనాలు తేల్చి చెప్పాయి.మట్టిలో జీవం కోల్పోవడం వలన జీవ వైవిధ్యాన్ని కోల్పో తున్నాం.ఎందుకంటేభూమి సేద్యం విషయంలో గతానికి ప్రస్తుతానికి పంట సాగు చేసే తీరులో చాలా మార్పులు సంభవించాయి గతంలో రైతులు పంటల పండించడంలో వైవిద్యం ఉండేది.దానివలన భూమి సేంద్రియ పదార్థాన్ని సమకూర్చుకునేది. నేటి సాగులో ఒకే రకమైన పంట కు రసాయనాల వినియోగానికి ప్రాధాన్యం వలన భూసారం క్షీణించి పోతు ఉంది.నేల సారం కోల్పోయి జీవం లేకపోవడం వలన నేలలో అవాసం ఉండే జీవరాశులు ప్రతీ ఏటా దాదాపు27000 రకాల జీవులు అంతరించిపోతున్నాయి. దీనివలన జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. ఐక్య రాజ్య సమితి నివేదికలు ప్రకారం.. 80-100 పంటలు పండించడానికి మాత్రమే ఈ భూమిపై అవకాశం ఉంది. అంటే కేవలం 40-50 ఏళ్ళ మాత్రమే మనకు సారవంతమైన నేల మిగిలి ఉంటుంది. (మూడొంతులు ఇప్పటికే క్షీణించింది) 30 ఏళ్లలో సేంద్రియ పదార్థాన్ని 80 శాతం కోల్పోయాం.ఇదే పరిస్థితి కొనసాగితే 50 ఏళ్లలో భూమి మీద ఆహార సంక్షోభం తలెత్తుతుంది.ఆహారం కోసం దాడులు హత్యలు సంభవిస్తాయి.
పోషకాహార లోపం
నేడు పేదవారికే కాదు భాగ్యవంతులు కు కూడా పోషకాహార లోపం ప్రధాన సమస్యగా పరిణమించింది.పోషకాహార లోపం అనేది నేడు సర్వ సాధారణం అయిపోయింది.కారణం ఏమిటంటే భూమి నుండి పండే పంటలలోనే పోషకాహారం ఉండటం లేదు.ఒక అధ్యయనం ప్రకారం మన తండ్రులు తాతలు ఒక నారింజతో పొందిన విటమిన్‌ ఏ ‌మొత్తాన్ని పొందాలి అంటే ఈనాడు దాదాపు ఎనిమిది నారింజలు తీసుకోవాలి.మనం రసాయనాలు ఉపయోగించి పంటల దిగుబడి పెంచాం కానీ దానిలో పోషకాలు పడిపోయాయి అన్న సంగతి పట్టించుకోవడం మానేసాం.ప్రస్తుతం మనం పండిస్తున్న పండ్లు కూరగాయలు ఇప్పటికే 90% తక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి. దీని కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు2 బిలియన్ల మంది ప్రజలు పోషకాహార లోపాలతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.మట్టికి జరుగుతున్న ఈ తరహా వాస్తవాలు ఎన్నో మరుగున పడి పోయి ఉన్నవాటిని వెలుగులోనికి తీసుకు వచ్చి బాధ్యత గల ఒక పౌరునిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించే ఉద్దేశ్యంతో ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సద్గురు ప్రారంభించిన ప్రపంచ ఉద్యమమే ‘సేవ్‌ ‌సాయిల్‌’. ఇషా ఫౌండేషన్‌ ‌వ్యవస్థాపకులు సద్గురు ఈ ఉద్యమాన్ని మార్గదర్శనం చేస్తున్నారు.మొన్నటి వరకు నదుల పునరుజ్జీవనం కోసం పోరాడిన ఆయన 65 సంవత్సరాల వయసులో కూడా బైక్‌ ‌పై 100 రోజులు పాటు విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణ పరిస్థితులు గల 24 దేశాలు కవర్‌ ‌చేస్తూ మార్చి 21 నుండి మట్టిని రక్షించు పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.అయితే సద్గురు ఈ ఉద్యమాన్ని రాత్రికి రాత్రి పట్టాలు  ఎక్కించలేదు.
గత 20 సంవత్సరాలు పైబడి మట్టిలో వస్తున్న మార్పులు దాని విషయంలో శాస్త్రవేత్తలతో చర్చలు, అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అభిప్రాయాలు, క్షేత్ర స్థాయిలో భూ క్షీణత ఏర్పడి పంటల దిగుబడిలో వస్తున్న మార్పు, భూ క్షీణత వలన అంతరించి పోతున్న సూక్ష్మ జీవులు.భావితరాలు వారు ఎదుర్కొనే సమస్యలు.ఆహార సమస్య.జీవ వైవిద్యం లో ఏర్పడే అసమతౌల్యం ఇవన్నీ సద్గురు ను ఎక్కువ ఆలోచింప చేశాయి.సమస్య చెప్పడం సులభమే కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపడం చెప్పినంత సులభం కాదు.అందుకే సద్గురు ఈ సమస్య అనేది  ఒక ప్రాంతం ఒక దేశానిది కాదంటూ ప్రతీ ఒక్కరూ ప్రతీ దేశం ఈ ఉద్యమంలో కలసి పాల్గొనాల్సిన ఆవశ్యకత వివరించి కార్యాచరణ అమలులోకి తీసుకు వచ్చారు.మట్టి క్షీణత వలన ఏర్పడబోయే ప్రపంచ విపత్తు పై పోరాటానికి ఒక అద్భుత ప్రపంచ ఉద్యమాన్ని రూప కల్పన చేశారు 192 దేశాల్లో భూమి దెబ్బతినకుండా అవసరమై విధానాలను  రూపొందించడానికి ఈ ఉద్యమం ఒత్తిడి తీసుకు రావాలని, ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మందిలో ఈ ఉద్యమం మార్పు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని బైక్‌ ‌యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజలను ప్రభుత్వాలను స్వచ్చంద సంస్థలను చైతన్య పరచడమే ప్రధాన ఆశయంగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది.ఈ 100 రోజుల యాత్రలో ప్రతీ ఒక్కరు రోజుకు ఒక 10 నిముషాలు పాటు కేటాయిస్తే సరిపోతుంది.
మట్టి క్షీణత విషయంలో ఏర్పడే సమస్యల పట్ల అందరికీ అవగాహన కల్పించడం చేయాలి.సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిని ఉపయోగించుకుని సామాజిక మాధ్యమాల ద్వారా మట్టి క్షీణత ను అరికట్టే విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి విస్తృతంగా వ్యాప్తి చేయాలి.లండన్‌ ‌నుంచి ఆరంభమైన ఈ యాత్రలో ప్రతీ దేశంలోనూ ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తూ ఉంది.ఈ సమస్యపై ప్రభుత్వ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాదిపతులు కూడా మట్టి క్షీణత నివారణకు తప్పక చర్యలు చేపడతాం అనే హామీ కూడా ఇస్తున్నారు.అనేక మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రజలలో చైతన్యం తీసుకు రావడమే కాకుండా ప్రభుత్వాలకు తమ అభ్యర్థనలను పంపుతున్నారు.  నేలను బతికించడం ప్రపంచ దేశాల బాధ్యత అని సద్గురు ఇచ్చిన పిలుపు మేరకు 50 రోజుల పైబడి కొనసాగుతున్న ఈ యాత్రలో ఇప్పటికే దాదాపు 92 దేశాలు ఇషా ఫౌండేషన్‌ ‌యొక్క మట్టిని రక్షించు ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో సాకారం చేస్తాం అంటూ ఎం.ఓ.ఏ.సంతకాలు కూడా చేశాయి. ఇంకా చాలా దేశాలు ఈ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.మనం కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావడమే కాకుండా మనకు తెలిసిన వారిని కూడా భాగస్వాములను చేద్దాం.ఒక మంచి పని చేశాం అన్న ఆత్మ సంతృప్తిని మూట కట్టుకుందాం. నేల తల్లి ఋణం తీర్చుకుందాం.
image.png
రుద్రరాజు శ్రీనివాసరాజు.
9431239578
లెక్చరర్‌…ఐ.‌పోలవరం

Leave a Reply