Take a fresh look at your lifestyle.

‘‘‌సారే జహాసే అచ్చా’’!….

తెంపెటోళ్ళెవ్వరో
తెలియకుండానే
మనిషి మనిషికి మధ్య
బంధం తెగిపోతున్నప్పుడు
చమట చుక్కలు పులుముకున్న
సుట్టబట్టల బతుకు ఆశల
రెక్కలు తెగిపడుతూ
రక్తమాంసాలు మైనంలా
కరిగిపోతున్న దేహంలో
సడలని దేశభక్తి…
అవును!
సారే జహాసే అచ్చా!
దేశం మనదే

జానెడు కడుపులోని
ఆకలి పేగెండుకపోయి
బతుకు సావుమర్ణమైనప్పుడు…
తోలుతిత్తిలో చుట్టబడిన
ఎముకల గూడులోంచి
ఆకలి కేకొకటి
ఆగిపోనున్న ఊపిరిని
జ్ఞాపకం చేస్తున్నప్పుడు
కూలిపోతున్న దేహాన్ని
దీనంగా మోస్తున్నప్పుడు కూడా….
అవును!
సారే జాహాసే అచ్చా!
దేశం మనదే!..

వలస బాటలు దాటి
‘‘బతుకు’’ దారుల బట్టిన
‘ఆఖరు సూపుల’ ఆశ
తొవ్వ తెల్వని నడకన సాగుతాంటె
పూటపూటకు బువ్వ దేవులాట!
బతుకుంటే చాలనే ఓ ఆశ
అవును!
సారే జహాసే అచ్చా!
దేశం మనదే!…

దారిపొడవునా అంటించిన
నెత్తుటి ఛారికల సాక్షిగా
ఆకలి చావుల చితిమంటల్లోకి
నడిచిన పాదముద్రలు
దారి మధ్యలో హఠాత్తుగా
అదృశ్యమైన పసిపిల్లల
సుకుమారపు దేహముద్రలు
అవును!
సారే జాహాసే అచ్ఛా!
దేశం మనదే!..

 అజయ్‌ ‌బాబు, వరంగల్‌

Leave a Reply