Take a fresh look at your lifestyle.

సాగుబాటా!?…సావుపాటా!?…

“తెలంగాణల సాగుభూమెంత! రొండు పంటలకు నీళ్ళందేదే భూమెంత!? ఏడేడ ఏ తీరు భూములున్నయి!? ఏ భూములల్ల ఏసొంటి పంటలే పండుతయి!  ఏ పంట లేత్తె గనుక రైతుకిన్ని పైసలు గిట్టుబాటయితయి! ఏ కాలంల ఏ పంటేసుట్ల ఆమ్దానుంటది!?అనేటి లెక్కలు ఇన్నేండ్ల నుంచి తెల్వనియి కాదుగదా!? ఈ సందుల్నే కొత్తంగ  ఇచ్చంత్రాల ఇగురం ఎట్ల తెలిషోచ్చె!?    బి.టి. విత్తనాల మోసాలు,గులాబీ రంగు పురుగు దాడికి జీవిడిషిన పత్తి రైతుల ఆత్మల శాపనర్ధాల యాది మరువనేలేదు.రైతు బతుకులింక మళ్ళోపాలి ఆగం జేషేటి పత్తులెక్కువెయ్యాలని హుకుం జేసుడేంది. అప్పడు ఆగమైన రైతులను వలర్సుకున్నరు!? ఏమర్సుకున్నరు!?”

yelamandhaసర్కార్‌ అమలు జేషేటి సంక్షేమం సాటున సంక్షోభాలు కొత్తయేంగాదు. పాలకులెప్పుడేం కొత్త ఇగురమెల్లబెడుతరో అనేటి గుబులుతోని సావుగల్మన బతుకుడే ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధమోలిగె కానత్తాంది. తెలంగాణ సర్కార్‌.ఈ ‌నడుమన ఎవుసం మీద జెప్పుకచ్చేటి షిత్రకత చిట్టు పొయ్యోల్గె షిన్నంగనె అంటుకున్నది.సెగమాత్రం ఊరూర్లు పాకి రైతం బతుకులాశలను ఆగంజేషే మోపయితాంది.గాచారం బాగలేకపోతె తాడే పామై కుడుతదంటరు.ఇది ఇనెటోళ్ళకు ఇచ్చంత్రంగనిపిచ్చినా ఒల్లెక్కాలకు జెప్పేటి ముచ్చటైతె గాదు.కన్నతల్లాసొంటి నేలతల్లి నుంచి రైతు బతుకును ఏరు బడేషే అనుమానం మోపయితాంది.తీసుకచ్చినపంటలకే దిక్కులేక మార్కిట్ల ఎండకెండి,వానకు తడుసుడైతాండె!తీర పంటనమ్ముతె చేషిన అప్పుకింద మిత్తి పైసలన్న మిగులక రైతన్నలు గుడ్లనీళ్ళు తీసుకోవట్టె!సాగుబాటంటె సావుపాటై బతుకుదేవులాటల రైతు జీవిడ్వబట్టె. తెలంగాణ దేశానికి అన్నం గిన్నె కావాలనే సర్కార్‌ ‌మాట మంచిదే !కాదని, ఏవలనరు గని పండిన పంటకు మద్దతు ధర దొర్కనప్పుడు,మార్కిట్ల కాంటల్లేక పంట ఎండకెండి,వానకు ధాన్యం తడిషి కాల్వలై బారినప్పుడు పంట కుప్పల మీదనే జీవిడిషే రైతన్న బతుకు బాధను పట్టించుకున్నోళ్ళెవ్వలు!? కాంటాల కాడ తాలు పేరుతోని తాకట్ల యవారాలు మోపయి,ఎటమటం ధరలు ఎదురైనప్పుడు రైతన్న కార్చేటి కంటి నీరుకు లెక్కలెవలేషిండ్లు!? రైతుబంధు కౌలుదార్లకు రాకుంట భూసాముల పాలైతె,పెట్టుబడులకు పంట తాకట్టు పెడ్తాంటె సూషినోళ్ళేవరు!? రైతుల తిప్పలిట్లున్నయని యవుసం అధికారులు సర్కార్‌ ‌కాడ ఏనాడైనా జెప్పుకచ్చిండ్లా!? యవుసం అధికారులు గిట్ల జెప్పబట్టిండ్లని తెలంగాణ సర్కార్‌ ‌కొత్త ఇగురం ముందుకు తెచ్చింది. ఈ యేటి నుంచి సర్కార్‌ ఎసొంటి భూమిల ఏం పంటలేయాల్నని జెప్తె గవే పంటలేయాలట!కాదంటె రైతుబంధు ఇయ్యమని, అసొంటి పంట కొనుడు సుతుండదని జెప్పుడు రైతన్నలను ఆగంజేషే కతలవడుడే గని ఇంకోటి కాదు.

మట్టిలబుట్టి మట్టిని నమ్ముకున్న రైతుకు పంట పాటాలుజెప్పుడు తాతకు దగ్గులు నేర్పినట్టే కొడ్తాంది. మార్కిట్ల డిమాండ్‌ ‌వున్న పంటలేసుడు కన్న మట్టిని బట్టి పంటలేసుకునుడే లాభం తెచ్చేటి యవారమని తెల్వని కత కాదు. తెలంగాణల సాగుభూమెంత! రొండు పంటలకు నీళ్ళందేదే భూమెంత!? ఏడేడ ఏ తీరు భూములున్నయి!? ఏ భూములల్ల ఏసొంటి పంటలే పండుతయి! ఏ పంట లేత్తె గనుక రైతుకిన్ని పైసలు గిట్టుబాటయితయి! ఏ కాలంల ఏ పంటేసుట్ల ఆమ్దానుంటది!?అనేటి లెక్కలు ఇన్నేండ్ల నుంచి తెల్వనియి కాదుగదా!? ఈ సందుల్నే కొత్తంగ ఇచ్చంత్రాల ఇగురం ఎట్ల తెలిషోచ్చె!? బి.టి. విత్తనాల మోసాలు,గులాబీ రంగు పురుగు దాడికి జీవిడిషిన పత్తి రైతుల ఆత్మల శాపనర్ధాల యాది మరువనేలేదు.రైతు బతుకులింక మళ్ళోపాలి ఆగం జేషేటి పత్తులెక్కువెయ్యాలని హుకుం జేసుడేంది.అప్పడు ఆగమైన రైతులను ఎవలర్సుకున్నరు!? ఏమర్సుకున్నరు!? వానాకాలం పంటంటె మక్కలే మనకాడి లెక్క. పత్తులేసుడంటె భూమిడిషి సాగుజేసుడే! ఎకురానికి అయ్యేటి ఖర్సుల సగం సుత అప్పులియ్యని బేంకోళ్ళ తోని కష్టాలు దేవునికి ముట్టినయి. గిన్ని లక్షల ఎకురాల పత్తులేసుడంటె మళ్ళా ఇంటికో పీనుగెళ్ళుడే!. విపత్తుల మోపుజేషే పత్తుల మీద సర్కార్‌ ‌గింతగనం ప్రేమలేందో జెప్పాలె గద! సాగుతీరు మారితె రైతాంగం బతుకు తీరుమారుతదని ఏనంగ ఎరుకైందో సర్కార్‌ ‌జేషిన శాస్త్రీయ పరిశీలనేందో జెప్పాలే! రైతులకు గాకపోయిన ఈ ముచ్చటేసుకోని రైతాంగం తోని మీటింగ్‌ ‌లు పెట్టే ఎమ్మెలే సార్ల కన్న జెప్పాలె కద! మీటింగుల కాడ ‘‘బరాబర్‌ ‌మా భూముల తీరు బట్టిపంటలేసుకుంటం,మా తాత ముత్తాతల సంది మా భూమిల పండే పంటలు మేమేసుకుంటం! ’అని జెప్పేటి రైతుకు యవుసం అధికారులు,నాయకులు ఏ తీర్గ సుత సమ్జాయించలేక పోతె నియంత్రిత సాగు బాగుపడే కత కానత్తదా!?.నియంత్రిత సాగు బ్యానర్లు తప్ప,బ్యానర్‌ ‌పెట్టినోళ్ళ కాడ మ్యాటర్‌ ‌లేకుంటె మీటింగ్‌ ‌లన్ని ఇచ్చికపోయినపిచ్చిక గూళ్ళ తీర్గ గావట్టె! గాచారం బాగుండి వానలు కురుసుడుతోని ఈ యేడుపంట దిగుబడి మాగచ్చిందిగని ఎత్తిపోతలనుంచి సుక్క నీరందిన జాడలేదు. రైతు సంక్షేమం గురించి జెప్పుకునే సర్కార్‌ ఏ ‌పంటకు ఎసొంటి మద్దతు ధరలిచ్చిందో తెల్వంది కాదు.

మద్దతు ధర ముచ్చట మూలకేషి తెలంగాణ సోన పాటందుకునుడెక్కడిది!.జప్పున చేతికచ్చే పంటన్నరుసరె,గని మద్దతు ధర గ్యారెంటీ ఇచ్చేదున్నదా! మూడుతీర్ల మందు గొట్టేదుంటది, వాటిని అందిచ్చే ముందుమాట ఏమన్నున్నదా!? ‘‘రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్‌ ‌పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి,మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలని యవుసం నిపుణులు సర్కార్‌ ‌కు సూచించిండ్లు.’’నియంత్రిత పద్ధతిలో సాగు జరగాలని,సాగుతీరును ఆగం జేయబోయేటి సర్కార్‌ ‌మనుసుల అసలు ఇగురం ఏందనేది బుద్దిజీవులందరికి ఎరుకైందే! నియంత్రితసాగు పేరుమీద సినిమా మొదలు గాక మునుపే’’జెప్పినమాట ఇననోళ్ళకు రైతుబంధు ఇయ్యమని జెప్పుడే ముందున్న అసలు సిసలు యవారం నియంత్రిత సాగు సిన్మాను ఇటుదిప్పి, అటుదిప్పి మొత్తానికి రైతుబంధుకు,రైతుబీమా పథకాన్ని సాగనంపే కత మోపయితది. ‘‘సూడ్రా బయ్‌! ‘‘ఇ‌క్రమార్క్’’! ‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! ఇన్నేండ్ల సంది జేషిన యవుసంల పంట రాలేదా!? అమ్ముకోలేదా!? ఇప్పుడు కొత్త పథకం ఏంది గావచ్చు!? నా ప్రశ్నకు జవాబు ఇయ్యకుంటె మళ్ళ చెట్టెక్కుత!అని బెదిరిచ్చేటి భేతాళున్ని ఎప్పటి తీర్గనే భూజనేసుకొని’’ ఇను!భేతాళ్‌! ‌కొండపోషమ్మసాగర్‌ ‌నీళ్ళు కొండెక్కి దునికిచ్చే ముందు రైతు లందరి సూపు సక్కంగుంటె తిప్పలైతది.ఎత్తెక్కిచ్చి దునికిపిచ్చేటి నీళ్ళు ఏ పల్లానికి జారుతానయో,ఎవలి భూముల్ని తడుపుతానయో జూడకుంట మాట మళ్ళిచ్చేటి శాందారు పనొక్కటే గాదు,లొల్లిల లొల్లి నియంత్రిత సాగు అనే బ్రహ్మాండమేదో తెచ్చి రైతు బతుకులను బాగు జేషినట్టు జనం అనుకోవాలె గద! అనుకున్నా,కోకపోయినా జెప్పినట్టినకుంటె రైతుబంధు,రైతు బీమాలు కోసుడు,పంట కొనకపోవుడు గిసొంటి బెదిరిచ్చుడుల తోనే రైతుబంధువు ఆనిపిచ్చుకునే కొత్త సినిమా లాక్‌ ‌డౌన్‌ ‌తరువాత రిలీజయితది’’అని జెప్పుకుంట నడ్వబట్టిండు..నడ్వబట్టిండు…
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply