- ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం
- ఎనిమిదేండ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరణ
- అతితక్కువ సమయం నాలుగేళ్లలో కాళేశ్వరం నిర్మాణం
- 45 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు
- 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి…
- టెక్నాలజీ విషయంలో ఇండియా ఇంకా వెనుకబడే ఉంది
- ఇన్నోవేషన్‌లో తెలంగాణ ఎంతు ముందుంది
- నిజామాబాద్ పర్యటనలో మంత్రి కెటిఆర్ వెల్లడి
- కెటిఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎన్‌ఎస్‌యూఐ
నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28 : రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం అందించామని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో కాకతీయ స్యాండ్ బాక్స్ ఆధ్వర్యంలో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…గత ఎనిమిదేండ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరించామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని అతితక్కువ సమయంలో నిర్మించామన్నారు. 45 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని చెప్పారు. 2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండిందని, 2022 నాటికి 3.5 కోట్ల టన్నులు పండించే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ లాభాల బాటపట్టిందని తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు నిత్యం ఆదాయం సమకూరు తుందని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు నడుస్తున్నదని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు.టెక్నాలజీ విషయంలో ఇండియా ఇంకా వెనుకబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇన్నోవేషన్ లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. ’ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను నాలుగేళ్లలో నిర్మించామని, లక్ష కిలోవి•టర్ల పైప్‌లైన్‌వేసి మిషన్ భగీరథ ద్వారా కోటి ఇళ్లకు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. రూరల్ ఏరియాలకు ఐటీని విస్తరించడంతో పాటు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు కేటీఆర్ ప్రకటించారు.
రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. అయితే టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని తెలిపారు. టెక్నాలజీ ఫర్ ఇంప్యాక్ట్ పేరుతో స్యాండ్ బాక్స్ సంస్థ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యాక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణెళిశ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే జిల్లా కేంద్రంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగలు తగిలాయి. కంటేశ్వర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఆధ్వర్యంలో కేటీఆర్ వాహనాల ఎదుట నిరసనకు దిగారు. పోలీసుల రక్షణ వలయాన్ని దాటుకుని వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగానే ప్రతిపక్ష, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితమే హెలికాప్టర్‌లో జిల్లా కేంద్రానికి చేరుకుని కేటీఆర్… న్యూ కలెక్టరేట్ మైదానం నుంచి రోడ్డు ద్వారా భూమా కన్వెన్షన్‌కు చేరుకున్నారు.