Take a fresh look at your lifestyle.

‌రైతు ఉద్యమంపై ఉక్కు పాదమా..?

దేశానికి వెన్నెముక రైతు…రైతు లేనిదే రాజ్యంలేదు..దేశ ప్రజందరికీ ఆహారాన్ని అందించే అన్నదాత..అంటూ రైతు సేవలను వేనోళ్ళ కొనియాడే రైతాంగంపై కేంద్రం యుద్ధానికి సిద్దమైనట్లు కనిపిస్తున్నది. నేలను నమ్ముకుని, ఆరుగాలం కష్టపడే రైతుపట్ల అందరికీ అభిమానమే. పంటలు పండించడమే తప్ప, తన కష్టానికి తగిన ప్రతిఫలంగురించి రైతులేనాడు పెద్దగా పట్టించుకోలేదు. కాలంపై భారంవేసి ఏదో తెలియని ఆశతో ముందుకు దూసుకుపోవడమే వారికి తెలిసింది. విత్తనం నాటినప్పటి నుండి పంటచేతికొచ్చే వరకు పొత్తిళ్ళలోని బిడ్డను కన్నతల్లి సాకినంత జాగ్రత్తగా పంటను చూసుకోవడమే అన్నదాతకు తెలిసింది. ఇవ్వాళ్టికి నూటికి డెబ్బైమంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారంతా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. ఇలాంటి రైతాంగ జీవితాలను అనేక మంది కవులు, కళాకారులు తమ రచనల ద్వారా, కళారూపాల ద్వారా కథనాలను రూపొందించి, వారి సాదకబాదకాలను వెలుగులోకి తీసుకువొచ్చారు. తీసుకువొస్తున్నారు కూడా.

మనది ప్రధానంగా వ్యవసాయ ఆధార దేశమే అయినా ఆ రంగాన్ని ఆదుకోవాల్సినంతగా ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి. బానిసత్వంలో బ్రతికిన నాటి నుండీ నేటి వరకు ఈ రంగంలో సాంకేతిక ప్రగతి తప్ప పండించిన పంటకు గిట్టుబాటు ధర లభ్యంకావడం లేదు. ఈ విషయంలో ఇప్పటివరకు ఆనేక రైతు ఉద్యమాలు లేచినా పెద్దగా జరిగిందేమీ లేదు. గత రెండున్నర నెలలుగా వొణికే చలిలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్న రైతుల దీనిస్థితిని చూసైనా పాలకుల మనసు కరగటం లేదనిపిస్తుంది. దేశమంతా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటే ఢిల్లీ పరిసర ప్రాంతంలో న్యాయం కోసం లక్షలాది మంది రైతాంగం పడిగాపులు కాస్తున్న తీరు నిజంగా హృదయ విదారకం. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి మేలుచేసే చట్టాలను రూపొందించామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి పదకొండు సార్లు సుదీర్ఘ చర్చలు జరిపి కూడా రైతులను సంతృప్తి పర్చలేకపోయింది. కాగా ఇప్పటి వరకున్న చట్టాలు, ఒప్పందాలేవీ రైతులకు మేలు చేయలేకపోయాయి. రైతు కేంద్రంగా మద్యదలారీల సామ్రాజ్యం విస్తరించింది. పండించిన రైతుకన్నా మద్యదలారీయే లాభపడుతున్నాడన్నది జగమెరిగిన సత్యం.

ఇప్పుడు ఈ రంగంలో కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు చట్టాలు కూడా రైతులకు ఏమాత్రం లాభదాయకం కాదన్నది రైతు సంఘాల వాదన. ఇన్ని విడుతలుగా చర్చలు జరిపినా కేంద్రం పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నదన్నదన్నది వారి వాదన. రైతుల ఆదాయం పెంచే ప్రయత్నాలు చేయకుండా, రుణ లక్ష్యం అధికం చేయడం సమస్యకు పరిష్కారం కాదంటున్నారు. కేంద్రం రూపొందించిన ఈ చట్టాలు అమలైతే దీర్ఘకాలంలో రైతులను భూమికి దూరం చేస్తాయన్నది రైతు నాయకులు చెబుతున్న అంశం. పది పదిహేనేళ్ళలో కార్పొరేట్‌ ‌సంస్థల అజమాయిషీలోకి రైతాంగం వెళ్ళే దుర్బర పరిస్థితి ఏర్పడుతుందన్నది కర్షకనేత తికాయిత్‌ ‌లాంటివారి ఆరోపణ. తమ ఈ భయాందోళనలపై సాక్షాత్తు ప్రధాని మాట్లాడలన్నది కూడా వారి డిమాండ్‌. ఏదిఏమైనా ఈ మూడు చట్టాలను ఎత్తివేయించడమే అంతిమ లక్ష్యంగా తమ పోరాటం సాగుతుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అనడమే ఈ ప్రతిష్టంభనకు కారణమైంది. ఫలితంగా పచ్చటి పంటపొలాల్లో పనిచేసుకోవాల్సిన రైతులు దేశ రాజధానిరోడ్లపై పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి ఏడు పదుల రోజులు దాటాయి.

తమది న్యాయపోరాటం అంటున్న రైతులు గొడ్డు, గోదను వొదిలి రావడంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి నిరసన ప్రదర్శన వల్ల ఢిల్లీ సామాన్య జనజీవనానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనవరి 26న నిరసనకారులు చేపట్టిన ట్రాక్టర్‌ ‌ర్యాలి అపశృతికి దారతీసింది. ఎర్రకోటపై జరిగిన దాడిగా కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. పలువురిని అరెస్టుచేసింది. పలువురిపై కేసులు నమోదు చేసింది. అయినా వెనక్కు తగ్గని రైతాంగం ఫిబ్రవరి ఆరున చక్కాజామ్‌ ‌పేర మరో భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్భందించాలని రైతునాయకులు పిలుపు నివ్వడంతో కేంద్రం అప్రమత్తమయింది. ఒక విధంగా రైతాంగం పిలుపును ఎదుర్కునేందుకు యుద్ధ తంత్రాన్ని తలపించే రీతిలో ఏర్పాట్లు చేస్తుంది. ఢిల్లీలోకి చొరపడకుండా భద్రతా ఏర్పాట్లలో భాగంగా కేవలం ఇనుప కంచెలేగాక, ఇనుప మొలలుగల ప్లేట్లతో అడ్డుకోవాలను కుంటోంది. పొరపాటున దానిమీద ఎవరైన పడితే శరీరంలోకి మొలలు దిగబడుతాయి.

ఇప్పటికే ఈ పోరాటంలో సుమారు వందకు పైగా రైతులు మృత్యువాత పడ్డారు. ఎర్రకోట ముట్టడి తర్వాత పలువురు యువ రైతుల ఆచూకీ లేకుండా పోయిందంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో శత్రువులను ఎదుర్కునేంత బందోబస్తు చేయడాన్ని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రైతులకు తమ ఉద్యమం విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలులేకుండా ఇంటర్‌నెట్‌ ‌సేవలను, ట్వీట్‌ ‌ఖాతాలను కేంద్రం నిలిపివేయడంలాంటి చర్యలు శత్రువులపై యుద్ధానికి సిద్ధమైన రీతిని తలపిస్తున్నదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చట్టాలను చేసేముందు ప్రతిపక్షాలతో, రైతు నాయకులతో చర్చించలేదన్న అపవాదు ఎదుర్కుంటున్న కేంద్రం, ఇప్పుడు పార్లమెంటు ఉభయ సభల సమావేశాల సందర్భంగా ఈ విషయంపై చర్చించడానికి తగిన సమయాన్ని ఇవ్వడం హర్షించదగిన విషయమే. అయితే ఈ చర్చలు ఏ దశకు చేరుతాయన్నదిప్పుడు ఆసక్తిగా మారింది.

Leave a Reply