Take a fresh look at your lifestyle.

‘‘రైతుల బతుకులు మారేది ఎన్నడు…?’’

“రైతే రాజు,, రైతే దేశానికి వెన్నెముక, జై జవాన్‌ ‌జై కిసాన్‌,, అన్నదాత సుఖీభవ  అంటూ నోటి మాటలు చెప్పడమే కానీ రైతుల సంక్షేమం కోసం వారి బాగోగుల కోసం  చేసిన కృషి నాస్తి.   ప్రభుత్వాలు  మారినప్పుడల్లా రైతులు తమ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశగా ఎదురు చూసి  గద్దెనెక్కిన తర్వాత వారి విధానాలవలన భంగ పడుతూనే ఉన్నారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనిచెప్పి నూతన సాగు చట్టాలను  తీసుకురావడంతో నవంబర్‌ ‌నుండి వాటి రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతులనె రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం మోసపూరితం.”

రైతే రాజు,, రైతే దేశానికి వెన్నెముక, జై జవాన్‌ ‌జై కిసాన్‌,, అన్నదాత సుఖీభవ  అంటూ నోటి మాటలు చెప్పడమే కానీ రైతుల సంక్షేమం కోసం వారి బాగోగుల కోసం  చేసిన కృషి నాస్తి.   ప్రభుత్వాలు  మారినప్పుడల్లా రైతులు తమ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశగా ఎదురు చూసి  గద్దెనెక్కిన తర్వాత వారి విధానాలవలన భంగ పడుతూనే ఉన్నారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనిచెప్పి నూతన సాగు చట్టాలను  తీసుకురావడంతో నవంబర్‌ ‌నుండి వాటి రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతులనె రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం మోసపూరితం.  ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలకు పాల్పడినా,రైతులు సంఘటితంగా నిరసన కొనసాగించడం విశేషం. కొరోనా కాలంలో  అన్ని రంగాల పరిశ్రమలు మూతపడినా ఒక వ్యవసాయ రంగమే కొనసాగి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి  ఉపయోగ పడింది. 63 శాతం ప్రజలు వ్యవసాయం పై  ఆధారపడి జీవనాన్ని కొనసా గిస్తు న్నారు..

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాల అమృత ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో కూడా వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభం లోనే ఉంది. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అందరికీ అవసరమైన ఆహారం కోసం  పండించే రైతన్నను కాపాడు కోవాల్సింది పోయి  అసమగ్రమైన విధానాల ద్వారా రైతుకు మరణశాసనం లిఖించడం విషాదం.  రైతులకు వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత నిచ్చి పరిరక్షించుకోవాల్సిన అవసరం వుంది .  ప్రకృతి కన్నెర్ర చేయడం, ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. అకాల వర్షాలు, కొరోనా వైరస్‌ ‌పాలక విధానాలు రైతుల పై ముప్పేట దాడి చేస్తున్నాయి.

పంట చేతికొచ్చే అమ్ముకునే దశలో, నోటి  దగ్గరవచ్చిన  బుక్కను గద్ద తన్ను కెళ్ళిన చందంగా రైతులు అయోమయంలో పడ్డారు. ధాన్యం కొనుగోలు జాప్యం జరగడంతో, వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయవలసి వస్తోంది. , దీనికితోడు సన్న ధాన్యం కొనుగోలు చేయబోమని మిల్లర్లు చెప్పడంతో, పంట చేతికి అందిన తర్వాత అమ్ముకునే దశలో   రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత సంవత్సరం  నియంత్రిత సాగు విధానంలో అధికారుల సూచన మేరకు   రైతులు సన్నధాన్యం పండించారు. దీంతో రైతులు మిల్లర్ల చుట్టూ తిరిగి  బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. మిల్లర్లు కొనుగోలు చేయకుండా మద్దతు ధర కల్పించకుండా నెలరోజులుగాపట్టించుకోక పోవటంతో కొనుగోలు నిరసనలు, ధర్నాలు చేస్తే  అరెస్టులు, కేసులు బనాయించి నానాయాతనలకు గురిచేయడం విచారకరం.

రాష్ట్రవ్యాప్తంగా 7114  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేస్తున్నప్పటికీ 28 శాతం మాత్రమే నేటికీ కొనుగోలు జరిగిందని తెలుస్తున్నది.  తాలు,మట్టిపెళ్లలు ,తేమ  సరిగాలేదని మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.   తాలు ,తరుగు పేరిట   తూకంలో కోత,   కొన్నదానికి నెల రోజుల తర్వాత నగదు ఇవ్వడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు.  గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానంలో మొక్కజొన్న సాగు చేయవద్దని  సూచించినప్పటికీ, రైతులకు ఉన్న భూమి పరిస్థితులు, నీటి వసతి, పెట్టుబడి వెసలుబాటు తో మొక్కజొన్న మాత్రమే  సాగు చేయడంతో మొక్కజొన్న, జొన్నల కొనుగోలుపై స్పష్టత లేదు.                                                                              గతంలో మార్క్ఫెడ్‌ ‌ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి కనీస మద్దతు ధర1850ల  క్వింటాల్కు అందజేసింది. ఇప్పుడు వ్యాపారులు 1400 నుండి 1450 వరకు మాత్రమే  చెల్లిస్తున్నారు.  మిర్చి పంటను ఇంట్లో దాచుకునే సౌకర్యం లేక మార్కెట్‌ ‌బందుతో అమ్ముకో లేని దుస్థితి ఏర్పడింది.
గాలివానలు మామిడి రైతులను నట్టేట  ముంచాయి.కొరోనా ప్రభావంతో పలు రాష్ట్రాలలో ఆంక్షలు అమలులో ఉండటంతో మామిడి కాయ ఎగుమతి కూడా అవరోధం ఏర్పడింది.  రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో మామిడి సాగు 40 వేల ఎకరాలలో విస్తరించి ఉంది.  వర్షాలకు మామిడికాయలు నేలమట్టం కావడంతో లక్షలాది రూపాయలు  నష్టపోయామని  రైతులు ఆ వేదన పడుతున్నారు..

కొరోనా సెకండ్‌  ‌వేవ్‌  ‌పూల రైతులను కూడా నష్టాల బాటలోకి నెట్టివేసింది. శుభకార్యాలు వాయిదా పడిన ఫలితంగా పూల డిమాండ్‌ ‌పూర్తిగా పడిపోయింది. నిమ్మ రైతులు  కూడా  ధరలు లేక  నష్టాలలోఈ విధంగా రైతులు అందరూ  చేతికి అందిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. . పంట పండించడం ఒకెత్తయితే అది అమ్ముకోవడం మరో ఎత్తు. అమ్మబోతే అడివి…. కొనబోతే  కొరివి …. చందంగా తాము పండించిన పంటలకు   ధర నిర్ణయించే అధికారం రైతన్నకు లేదు.  మార్కెట్‌ ‌ప్రైవేటీకరణ తో వ్యాపారులు తమ ఇష్టానుసారం  క్రయ విక్రయాలు జరుపుతారు.  ఈ నూతన చట్టాలను రద్దు చేయాలని2 రోజుల క్రితం హర్యానా ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు  ప్రయత్నించిన రైతుల పై  పథకం ప్రకారం ప్లాస్టిక్‌ ‌బుల్లెట్లు, టియర్‌ ‌గ్యాస్‌, ‌బాష్పవాయు గోళాలు తో  లాఠీ చార్జింగ్‌  ‌చేయడం బాధాకరం…

tanda sadhanandha
– తండా సదానందం, టీపీటిఏఫ్‌ ‌జిల్లాఉపాధ్యక్షుడు, మహబూబాబాద్‌ ‌జిల్లా

Leave a Reply