- రెండు రాష్ట్రాల నుంచి భారీ వలసలు
- పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
గుజరాత్ రాష్ట్రంలో సూరత్ వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. దేశం నలుమూలలకు ఇక్కడి నుండి వస్త్రం పోతుంది. సూరత్ గడ్డ మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డలు వలస కార్మికులుగా గత ముపై ఏళ్లగా జీవిస్తున్నారు. తమ రక్త మాంసాలు చెమటగా మలిచి గుజరాత్ పవర్ లూమ్స్ పరిశ్రమ యజమానుల గల్లాపెట్టెలు నింపారు. తెలంగాణ.. ఆంధ్ర వలస కార్మికులు లేని పవర్ లూమ్స్ సూరత్ లో లేవు అనే చెప్పాలి. కరోనా లాక్ డౌన్ ప్రకటించగానే గుజరాత్ వస్త్రపరిశ్రమలలో ఏళ్లుగా పనిచేసుకుంటున్న వలస కార్మికులను పవర్ లూమ్ యజమానులు కూరలో కరివేపాకును తీసి పక్కన పెట్టినట్టు ఫ్యాక్టరీ నుంచి వలస కార్మికులను బయట పడేసారు. దీనితో కార్మికుల పరిస్థితి అధోగతి అయిపోయింది. వారిని పలకరిస్తే … ‘‘ఇంటికి ఫోన్ చేస్తుంటే నా భార్య నేను బాగున్నా అని చెబితే… నేను కూడా ఇక్కడ బాగున్నా అని చెబుతున్నా.. మా భార్య భర్తలం ఇద్దరం గంభీరంగా ఒకరితో ఒకరం అబద్దం చెప్పుకుంటున్నాం’’..ఇది మల్లేష్ వ్యధ. మల్లేష్ కాల్వల గ్రామం మహబూబ్ నగర్ నుంచి సూరత్ కి వలస కార్మికుడుగా ముప్పై ఏళ్ళ క్రితం పోయాడు.. ఇలా ఒక మల్లేష్ పరిస్థితి మాత్రమే లేదు. శంకరపల్లి బుగలాచారి సొంత వూరు ఇల్లింద.. వర్దన్న పేట తాలూకా..బుగలాచారిని కదిలిస్తే ఇలా చెబుతున్నాడు.. ‘‘గత ముప్పై ఏళ్లగా సూరత్ లో ఉంటున్నా.. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ప్రభుత్వం ఫ్యాక్టరీ సేట్లతో మాట్లాడి
జీతం ఇప్పించాలి.’’
ముపై ఏళ్ళుగా ఫాక్టరీలలో కార్మికులుగా పనిచేస్తున్న వలస కార్మికులు ఒక్క లాక్ డౌన్ తో కుదేలు కాగా సూరత్
పవర్ లూమ్ ఓనర్స్, మాత్రం ఇంకో పది లాక్ డౌన్స్ అయినా తట్టుకునే అంత సంపద కలిగి వున్నారు. అయితే వారు ఒక్క రూపాయి కూడా శ్రామికులతో పంచుకోటానికి సిద్ధంగా లేరు. సూరత్ గుజరాత్ లోని అతిపెద్ద వలస జనాభా కేంద్రం. డజనుకు పైగా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇక్కడ బస చేసి వున్నారు. వస్త్రాలు, విద్యుత్ మగ్గాలు, ఎంబ్రాయిడరీ పనులు,భవన నిర్మాణ పనులు , డైమండ్ పాలిషింగ్,డైమండ్ కట్టింగ్ ఫ్యాక్టరీలలో నిత్యం పనిలో నిమగ్నమై వలస కార్మికులు పనిచేస్తుంటారు. ఏళ్లుగా గుజరాత్ సేట్ల గల్లా పెట్టెలను అపార ధనరాశులతో ఈ వలస కార్మికులు నింపారు. అదే సమయంలో రెక్కాడితే గానీ డొక్కాడని వలస కార్మికులుగా మిగిలిపోయారు. సూరత్ నగరంలో నివాసం ఉంటున్నా డజనుకు పైగా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఆ నగరంతో ఉన్న అనుబంధం ఒకే ఒకటి. అది తాము పనిచేస్తున్న ఫ్యాక్టరీలో తమకు దొరికిన పని.. ఆ పనికి అందుతున్న వేతన బంధం. ఈ ఒక్క బంధం సొంత గ్రామంలో ఉన్న పేగు బంధాన్ని..తాళి బంధాన్ని మిగతా అన్ని బంధాలను తెంచివేసేలాగా చేసింది. లాక్ డౌన్ తో పవర్ లూమ్ ఫ్యాక్టరీకి రక్తం వంటి వారు అయినా వలస కార్మికులను ఫ్యాక్టరీ ఓనర్లు నిర్ధాక్ష్ణ్యంగా ఫ్యాక్టరీ నుంచి బయటపడేసారు. అంతే కాదు వలస కార్మికుల కనీస తిండి అవసరాలు కూడా పవర్ లూమ్ యజమానులు చూడటం లేదు. అమ్మబటి సత్యనారాయణ తుంగతుర్తి , సూర్య పేట జిల్లా నుంచి సూరత్ లో పవర్ లూమ్ లో పనిచేస్తున్న వలస కార్మికుడు. సూరత్ లో పవర్ లూమ్ లో పనిచేస్తున్న కార్మికుల ట్రేడ్ యూనియన్ లీడర్ కూడా వున్నారు. ‘‘సూరత్ లో కుటుంబాలతో కలసి నివసిస్తున్న వలస కార్మికులు.. ఒంటరిగా ఉన్న వలస కార్మికులు వొట్టి చేతులతో మిగిలాము.. అందరు వలస కార్మికులు భయంలో వున్నారు అని అంటున్నారు. పవర్ లూమ్ ఓనర్లు 200 వందలు ప్రభుత్వం 200 కలిపి నాలుగు వందలు ప్రతి కార్మికునికి ఇవ్వాలి అప్పుడే బ్రతికి బట్టకట్ట గలం అని అమ్మబటి సత్యనారాయణ అంటున్నారు.’’
దేశవ్యాప్తంగా అమలు అవుతున్న లాక్డౌన్ ఫలితంగా, సూరత్ పవర్ లూమ్స్ ఫ్యాక్టరీ ఓనర్లు లక్షలాది మంది.. వలస కార్మికులను ముఖ్యంగా రోజువారీ కూలీలను నిరుద్యోగులను చేస్తూ పవర్ లూమ్స్ మూసివేశారు. పని లేనప్పుడు.. వేతనాలు లేకుండా.. ఆనాధలు అయిపోయినా వలస కార్మికులు సూరత్ మురికివాడల్లో ఉండటానికి బదులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. కనీసం ఈ విషయంలో వలస కార్మికులను సహాయం చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనవేశాలు వేస్తున్నాయి. వీరిని తరలించటం విషయంలో ఖర్చులు భరించటానికి రాష్ట్రము, కేంద్రం మీద కేంద్రం, రాష్ట్రము మీద నెపం నెడుతున్నాయి. ఈ వలస కార్మికులు సొంత ఖర్చులుతో పుట్టిన ఊరుకు పోలేక అవస్థలు పడుతున్నారు.