నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని రైల్వే ప్రాజెక్టు పనులు, ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం, భూసేకరణపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, మేయర్ బొవతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.
నగరంలో రోడ్డు నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ వేగంగా చేపడుతున్నదని ఆయన చెప్పారు. పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జిలకు సంబంధించిన పనులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని దక్షిణమధ్య రైల్వే సహకారంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే శాఖ కూడా జీహెచ్ఎంసీ మాదిరిగా పనులు పూర్తిచేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని సూచించారు. ఎస్ఆర్డీపీ, లింక్ రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని రైల్వే జీఎం గజానన్ మాల్యాను కేటీఆర్ కోరారు. వానాకాలం నాటికి ఎక్కువ చోట్ల రైల్వేకు సంబంధించిన పనులు పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పనుల పూర్తికి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. జలమండలి మౌలిక వసతుల ప్రాజెక్టులపై రైల్వే జీఎంతో చర్చించారు.