కూలిన రష్యా ప్యాసింజర్ విమానం
ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరిచిపోకముందే చైనా సరిహద్దులో రష్యన్‌కు చెందిన విమాన ప్రమాదం మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రష్యన్ ప్యాసింజర్ విమానం ఏఎన్-24 చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో 43మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రష్యాలోని అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం టిండా నగరానికి వెళ్తుండగా చైనా సరిహద్దు ప్రాంతానికి వెళ్లగానే ఉన్నట్టుండి ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. టిండాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం అదృశ్యమవగానే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టగా గమ్యస్థానానికి 15 కి.మీ దూరంలో కూలిపోయినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతుండగా రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విమానం ల్యాండ్ అవుతుండగా వాతావరణం అనుకూలించలేదని, రెండోసారి ప్రయత్నించే క్రమంలో రాడార్ నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియాల్సి ఉంది. కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.




